అంతా అవినీతే.. ఏళ్లతరబడి ఒకేచోట విధులు.. చక్రం తిప్పుతున్న క్లర్క్‌లు, డాక్యుమెంట్‌ రైటర్లు!

ABN , First Publish Date - 2021-12-06T13:01:30+05:30 IST

ఒకే కార్యాలయంలో సుదీర్ఘ కాలంగా తిష్ఠ వేసి.. తమదైన శైలిలో హవా కొనసాగిస్తున్నారు. ..

అంతా అవినీతే.. ఏళ్లతరబడి ఒకేచోట విధులు.. చక్రం తిప్పుతున్న క్లర్క్‌లు, డాక్యుమెంట్‌ రైటర్లు!

  • అవినీతికి కేరా‌ఫ్‌లుగా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం 
  • అటకెక్కిన బదిలీ ప్రక్రియ

హైదరాబాద్‌ సిటీ : నగరంలోని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో బదిలీల ప్రక్రియ ఏళ్ల తరబడి అటకెక్కింది. సిబ్బంది ఒకే కార్యాలయంలో సుదీర్ఘ కాలంగా తిష్ఠ వేసి.. తమదైన శైలిలో హవా కొనసాగిస్తున్నారు. కొందరు క్లర్కులు, డాక్యుమెంట్‌ రైటర్లు సబ్‌రిజిస్ర్టార్లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. సేవే లక్ష్యంగా ఉండాల్సిన ఈ కార్యాలయాల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. పలువురు అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తు న్నా.. ఉన్నతాధికారుల చర్యలు శూన్యమని పౌరులు బాహాటంగా విమర్శిస్తున్నారు. అవినీతికి చెక్‌పెట్టేలా ఆన్‌లైన్‌ విధానం అందుబాటులోకి వచ్చినా.. లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రతి పనికీ ఓ ధర ఫిక్స్‌ చేసి ఆ శాఖలో కొంతమంది సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. మూడేళ్లకోసారి జరగాల్సిన బదిలీల ప్రక్రియ స్టాంపులు, రిజిస్ర్ట్టేషన్ల శాఖలో ఆ ఊసే లేకుండాపోయిందని ఆరోపణలొస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మిస్తు న్న బహుళ అంతస్తుల భవనాల రిజిస్ర్టేషన్లు చేసేందుకు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు. 


మధ్యవర్తుల అవతారం

సబ్‌రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో కొన్ని నెలలుగా భారీగా రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. ఈ తరుణంలో కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు, క్లర్కులు మధ్యవర్తుల అవతారమెత్తారు. సబ్‌రిజిస్ర్టార్‌లతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు. శివారు ప్రాంతాల్లో ఒక్క రోజులో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తవ్వాలంటే మధ్యవర్తులను ఆశ్రయించాల్సిందేనని పలువురు వాపోతున్నారు. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌చేసుకొని నేరుగా సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి వెళితే.. అక్కడ క్లర్కులు, డాక్యుమెంట్‌ రైటర్లు పత్రాలు సరిగా లేవని, మరిన్ని పత్రాలు తీసుకురావాలని తిప్పి పంపుతుంటారని ఓ రియల్టర్‌ తెలిపారు. శివారుప్రాంతాల్లో పలు రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో రోజుకు 100కు పైగా స్లాట్స్‌బుక్‌ చేస్తుండటంతో ఉదయం నుంచి రాత్రి వరకు రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు సందడిగా ఉంటున్నాయి.


ఏసీబీకి చిక్కినా.. మారని పనితీరు..

ఐదు నెలల క్రితం బోరబండ ప్రాంతంలో 4 షాపులు రిజిస్ర్టేషన్లు చేసేందుకు రూ.75వేలు లంచం తీసుకుంటూ కూకట్‌పల్లిలో ఓ డాక్యుమెంట్‌ రైటర్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. రెండు నెలల క్రితం డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌ రద్దు కోసం రూ.5.5 లక్షల లంచం డిమాండ్‌ చేసిన రాజేంద్రనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌, డాక్యుమెంట్‌ రైటర్‌లు ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇలా అక్రమాలకు పాల్పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కుతున్నా.. పలు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో సిబ్బంది పనితీరు మారడం లేదనే విమర్శలున్నాయి. సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని విధిగా మూడేళ్లకోసారి బదిలీ చేయాలని, మధ్యవర్తులుగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-12-06T13:01:30+05:30 IST