శశికళ ‘చేరిక’ ఎటు.. రిలీజ్‌కు ముందే వేడెక్కిన రాజకీయం?

ABN , First Publish Date - 2021-01-16T17:55:18+05:30 IST

శశికళ ‘చేరిక’ ఎటు.. రిలీజ్‌కు ముందే వేడెక్కిన రాజకీయం?

శశికళ ‘చేరిక’ ఎటు.. రిలీజ్‌కు ముందే వేడెక్కిన రాజకీయం?

  • అన్నాడీఎంకేలో చేర్చుకోవాలన్న గురుమూర్తి
  • మీ సలహా మాకు అక్కర్లేదు: మంత్రి జయకుమార్‌
  • నోరు మెదపని ఈపీఎస్‌, ఓపీఎస్‌

చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుంచి విడుదల కాకముందే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆమె విడుదల తేదీ వెల్లడి కాగానే నేతలు వర్గాలుగా  ఎవరి అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అధికార అన్నాడీఎంకేలో ఈ వ్యవహారంపై రోజురోజుకు వేడిపుట్టిస్తోంది. ఆమెకు ఘనస్వాగతం పలుకుతామని కొందరు నేతలు చెబుతుండగా, కొందరు వ్యతిరేకిస్తున్నారు. కాగా శశికళను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించినప్పుడు ఎలా నాటకీయ పరిణామాలు జరిగాయో, ఇప్పుడు చేరికకు సంబంధించి కూడా అలాంటివే ఎదురవుతుండడంతో రాజకీయవర్గాల్లో పలు సందేహాలు రేగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు పరప్పన అగ్రహారం జైలు నుంచి శశికళ ఈనెల 27వ తేదీ విడుదలయ్యే అవకాశముందని అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ ప్రకటించినప్పుడే ఈ వివాదం రాజుకుంది.


ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గోకుల ఇందిర... శశికళను పొగడ్తలతో ముంచెత్తారు. అమ్మను వెన్నంటి నీడలా ఉన్నారని, ఆమెను విమర్శించడం సరికాదన్నారు. అదేవిధంగా పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ కూడా శశికళను సమర్థించేలా వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే, ఏఎంఎంకే పార్టీలు అన్నాతమ్ముళ్ల లాంటివని, ఇలాంటి గొడవలు కుటుంబాలలో జరగడం సహజమేనని పేర్కొన్నారు. 


జయలలితను అమ్మ అని, శశికళను చిన్నమ్మ అని పిలిచేవారమని, ప్రస్తుతం జయ లేనందు వల్ల శశికళను అమ్మ స్థానంలో చూడాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ నేతగా గుర్తింపు పొందిన ‘తుగ్లక్‌’ పత్రిక ఎడిటర్‌ గురుమూర్తి... పత్రిక వార్షికోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన శశికళకు మద్దతుగా వ్యాఖ్యాలు చేశారు. డీఎంకేను ఎదుర్కోవాలంటే అన్నాడీఎంకే... శశికళలాంటి నేతలను చేర్చుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో శశికళ అన్నాడీఎంకేలో చేరడం ఖాయమని, పక్కావ్యూహంతోనే నాటకం రక్తికట్టిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఈపీఎస్‌, ఓపీఎస్‌ నోరు మెదపరేం?

అన్నాడీఎంకే సీనియర్‌ నేత మంత్రి డి.జయకుమార్‌ మాత్రం గురుమూర్తి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్కేనగర్‌ ఎమ్మెల్యే దినకరన్‌ వద్ద ముడుపులు తీసుకుని సలహాలు ఇవ్వవద్దన్నారు. గురుమూర్తి తనకు తానుగా తెలివైనవాడినని, కింగ్‌మేకర్‌ అని తలస్తుంటారని, అయితే ఆయన ఉచిత సలహాలు తమకు అవసరం లేదని మండిపడ్డారు. ఇక మాజీ మంత్రి గోకుల ఇందిర వ్యాఖ్యల్ని కూడా జయకుమార్‌ ఖండించారు. ఆమె ఒక కాలు బురదలో, మరో కాలు చెరువులో పెట్టడం మంచిదికాదని హితవు పలికారు. ఆమెను శశికళ తొత్తుగా అభివర్ణించారు. కాగా శశికళ వ్యవహారంపై అన్నాడీఎంకే మంత్రులు, సీనియర్‌ నేతలు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నా.. ఈ వ్యవహారంపై సీఎం ఎడప్పాడి  గానీ, ఉపముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంగానీ నోరు మెదపకపోవడం మరిన్ని అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

Updated Date - 2021-01-16T17:55:18+05:30 IST