ద్రవిడవాదమా? హిందుత్వమా?

ABN , First Publish Date - 2021-04-05T08:13:06+05:30 IST

ఈసారి తమిళనాడు ఎన్నికలు మునుపెన్నడూ లేనంత ఆసక్తికరంగా మారాయి. మంగళవారం (6వ తేదీ) జరిగే పోలింగ్‌లో అనేక అంశాలకు సమాధానం లభించనున్నా ముఖ్యంగా రెండు వాదాలకు సంబంధిం

ద్రవిడవాదమా? హిందుత్వమా?

  • 1998 ఫార్ములా మళ్లీ పనిచేస్తుందా? 
  • గెలుపుపై ధీమాలో డీఎంకే
  • హ్యాట్రిక్‌పై అన్నా డీఎంకే ఆశలు
  • కమల్‌ హాసన్‌ కమాల్‌ ఎంత? 
  • తమిళనాడు ఓటరు తీర్పు రేపే
  • పినరయి చరిత్ర సృష్టిస్తారా?
  • కేరళలో సీపీఎం గాలి..! 
  • అయినా డీలా పడని కాంగ్రెస్‌ పార్టీ
  • బీజేపీ బలం పెరుగుతుందా?
  • ప్రచారం సమాప్తం.. రేపే పోలింగ్‌


చెన్నై, ఏప్రిల్‌ 4: ఈసారి తమిళనాడు ఎన్నికలు మునుపెన్నడూ లేనంత ఆసక్తికరంగా మారాయి. మంగళవారం (6వ తేదీ) జరిగే పోలింగ్‌లో అనేక అంశాలకు సమాధానం లభించనున్నా ముఖ్యంగా రెండు వాదాలకు సంబంధించిన జవాబు లభ్యమవుతుందని అంటున్నారు. ఇవి ద్రవిడవాదం, హిందుత్వం. 1967 తరువాత ద్రవిడ వాదం- అస్తిత్వానికి ఓ పెద్ద పరీక్ష ఈ ఎన్నికలు. నాడు ధాటిగా ముందుకు తీసుకెళ్లి చాలా సార్లు నెగ్గుకొచ్చిన కరుణానిధి ప్రస్తుతం లేరు. బీజేపీతో జట్టుకట్టినా ఆ వాదాన్ని వీడని జయలలిత కూడా లేరు. 1998 ఎన్నికల్లో బీజేపీతో కలిసి జయ పోటీకి దిగినపుడు... ఉత్తరాది పార్టీతో, హిందూ అతివాద పార్టీతో జయ మిలాఖత్‌ అయ్యారని, ద్రవిడవాదానికి తూట్లు పొడిచారని ఆనాడు కరుణానిధి విశేషంగా ప్రచారం చేశారు. అయితే అది ఫలించలేదు. వాజ్‌పేయి ఇమేజి, కోవై పేలుళ్లలో ఆడ్వాణీ త్రుటిలో తప్పించుకోవడం... ఇవి జయకు కలిసొచ్చాయి. అయితే ఆనాటి పరిస్థితి ఇపుడు లేదు. మోదీ నేతృత్వంలోని బీజేపీ హిందూత్వ ఎజెండాను కట్టుదిట్టంగా ముందుకు తీస్కెళుతోంది. ఈ పరిస్థితుల్లో... తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న స్టాలిన్‌ ఎంతమేర హిందూత్వ దాడిని ఎదుర్కొంటారన్నది ప్రస్తుత ఎన్నికల్లో స్పష్టమవుతుందని విశ్లేషకులంటున్నారు.


నాలుగురోజుల కిందట జరిగిన ఒక పరిణామం అసెంబ్లీ ఎన్నికల వేళ కీలకంగా మారింది. డీఎంకే అధినేత స్టాలిన్‌ కుమార్తె ఇంట్లో ఐటీ దాడులు, తమిళ సెంటిమెంట్‌ను బాగా రెచ్చగొట్టాయి. ఉత్తరాది పార్టీ (అంటే బీజేపీ) అకారణంగా మన నేతలపై దాడులు చేయిస్తోందని డీఎంకే ప్రచారం చేసింది. ఇది జనంలోకి బలంగానే వెళ్లింది. ‘‘గత పదేళ్ళుగా అఽఽధికారంలో ఉన్నది అన్నాడీఎంకే. ఆ పార్టీ నేతలపై గానీ ఐటీ దాడులు జరగవు.. కానీ పదేళ్లుగా విపక్షంలో ఉన్న డీఎంకే నేతల బంధువుల ఇళ్లను మాత్రం సోదాలు చేస్తారు. ఇదీ బీజేపీ నైజం’’ అని డీఎంకే నేతలు సెంటిమెంట్‌ను రేపారు. ఇది బీజేపీకే కాక- ఆ పార్టీ పొత్తున్న అన్నాడీఎంకేకు కూడా ప్రతికూలంగా మారింది. ఇదొక్కటే కాదు... తమిళ సంస్కృతిని ప్రతిబింబించే జల్లికట్టును నిషేధించడం, నీట్‌ పరీక్షను బలవంతంగా రుద్దిన వైనం ఇవన్నీ తమిళుల్లో బీజేపీ పట్ల, తద్వారా అన్నాడీఎంకే పట్ల విముఖత పెరగడానికి కారణమయ్యాయి. జయ జీవించి ఉన్నపుడు ఆమె కేంద్ర నేతలను తన ఇంటివద్ద వెయిట్‌ చేయించిన రోజులున్నాయి. కానీ ఇపుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా అన్నాడీఎంకే పెద్దలంతా మోదీ- షాలకు సాగిలపడిన పరిస్థితి.



అంతర్గత పోరుతో సతమతం

జయ మరణం లగాయతు అన్నాడీఎంకే అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. పళనిస్వామి, పన్నీరు సెల్వం ఇరువురూ సమయం వచ్చినపుడల్లా  ఆధిపత్య పోరాటాన్ని జరుపుతూనే ఉన్నారు. ఎన్నికలకు ముందు తనను ప్రధాన కార్యదర్శిని చేయాలని పన్నీరు సెల్వం డిమాండ్‌చేయడం, శశికళ తిరిగి పార్టీలో చేరినా అభ్యంతరం లేదని ప్రకటించడం... ఇవన్నీ విభేదాలను రచ్చకీడ్చాయి. దీంతో పాటు అన్నాడీఎంకేలో దేవర్లు, గౌండర్ల మధ్య ఎప్పటినుంచో ఆధిపత్య పోరుంది. పన్నీరు సెల్వం గౌండర్‌ వర్గానికి చెందిన వారు. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా గౌండర్‌లదే పైచేయి. కానీ జయ బతికి ఉన్నపుడు దేవర్లదే రాజ్యం. శశికళ దేవర్‌ వర్గానికి చెందినవారు. జయ ఉన్నపుడు ఇలాంటి వాటికి తావుండేది కాదు. పార్టీ, పాలన ఆమె ప్రధానంగా భావించేవారు.


ఇపుడు అన్నాడీఎంకేకు ఉన్న మరో పెద్ద  ప్రతిబంధకం... శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ నేతృత్వంలోని ఏఎంఎంకే పార్టీ. ఇది ఎక్కువగా అన్నాడీఎంకే ఓట్లనే చీలుస్తుందన్న అంచనాలున్నాయి. ఇంత ఎదురుగాలి వీస్తున్నా అన్నాడీఎంకే తరఫున ప్రధాన ప్రచారకర్త అయిన సీఎం పళనిస్వామి ఽఆత్మస్థైర్యాన్ని వీడలేదు. నీట్‌, వన్నియార్‌ రిజర్వేషన్ల విషయంలో తమ హామీలు తమను గెలిపిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా జయ వారసత్వాన్ని ఆయన పదేపదే ప్రచారం చేసుకున్నారు. ఆకులు (అన్నాడీఎంకే), పువ్వు (కమలం), ఫలం (మామిడిపండు- పీఎంకే) చిహ్నాలకే ఓట్లు పడతాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన అన్నట్లు తమిళనాడంతా జయ ముద్ర ఉంది. అన్ని ఫోటోలు,ఫ్లెక్సీల మీద జయ ఫోటోలే పెద్దవి. ఆఖరికి బీజేపీతో చెలిమి ఉన్నా జయకు జయజయ ధ్వానాలు తప్ప మోదీ ఊసులేకుండా అభ్యర్థులు ప్రచారం చేసుకున్నారంటే ద్రవిడవాదం పదును తెలుస్తుంది. జనాకర్షక తాయిలాల విషయంలో డీఎంకే, అన్నాడీఎంకేలు రెండూ ఎప్పటిలానే పోటీ పడ్డాయి. తమిళ ఓటర్లు వీటికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే ఈ తాయిలాల్లో మూడోవంతు కూడా ఏపార్టీ అమలు చేయదు.


ఆఖరికి కొత్తగా రంగంలోకొచ్చిన మక్కల్‌ నీది కయ్యమ్‌ అధినేత కమల్‌ హాసన్‌ కూడా ఈ విషయంలో తానేం తక్కువ తినలేదంటూ హామీల వర్షం కురిపించారు. ఈ ఎన్నికల్లో ఆయన డీఎంకే ఓట్ల చీలిక మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ఒపీనియన్‌ పోల్స్‌ ప్రకారం... 234 సీట్లున్న అసెంబ్లీలో ఈసారి డీఎంకే జయభేరి ఖాయం. డీఎంకే కూటమికి 158, అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి 65 స్థానాలు లభించవచ్చని అంచనా. కాంగ్రెస్‌ పరిస్థితి పెద్ద ఆశావహంగా లేదని, డీఎంకే బలం మీద నెగ్గుకురావాల్సిందేనని సర్వేలు చెబుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు గాను 38 సీట్లను డీఎంకే కూటమి సాధించింది. ఈసారీ అదే ఊపు కొనసాగుతుందన్నది ఆ పార్టీ ధీమా. కానీ అన్నాడీఎంకే మాత్ర హ్యాట్రిక్‌ కొడతామంటోంది. మే 2న ఏ విషయమూ తేలిపోతుంది.

Updated Date - 2021-04-05T08:13:06+05:30 IST