వశిష్ఠ వారధి కల తీరేనా?

ABN , First Publish Date - 2020-08-05T17:26:50+05:30 IST

ఉభయగోదావరి జిల్లా వాసుల చిరుకాల వాంఛ అయిన వశిష్ఠ వారధికి ముందడుగు పడింది. నరసాపురం పట్టణం తూర్పుగోదావరి జిల్లా

వశిష్ఠ వారధి కల తీరేనా?

రూ. 330 కోట్లు అంచనాతో డీపీఆర్‌ రిపోర్టు

ఉభయ గోదావరి జిల్లాల మధ్య కిలోమీటరున్నర వంతెన 

ప్రభుత్వం ఆమోదిస్తే పనులకు టెండర్లు 


నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా): ఉభయగోదావరి జిల్లా వాసుల చిరుకాల వాంఛ అయిన వశిష్ఠ వారధికి ముందడుగు పడింది. నరసాపురం పట్టణం  తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి గ్రామాల మధ్య వేలాది మంది పంటు, పడవలపై నిత్యం గోదావరిలో ప్రయాణిస్తుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు వారధి నిర్మించాలని రెండు జిల్లాల ప్రజలు ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు. దీనిని గుర్తించిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారిధి నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా గతేడాది డిసెంబర్‌లో సర్వే పనులను డెహ్రాడూన్‌కు చెందిన ఒక ఇంజనీరింగ్‌ సంస్థకు అప్పగించింది. ఈ మేరకు కంపెనీ ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో  పలు చోట్ల సర్వే చేపట్టి రూ. 330 కోట్లు అంచనా వ్యయంతో సమగ్ర నివేదికను రూపొందించింది. 


లక్ష్మణేశ్వరం-రాజుల్లంక మధ్యలో వారధి

మండలంలోని లక్ష్మణేశ్వరం- రాజుల్లంక గ్రామాల మధ్య వారధి నిర్మాణానికి అనువైన ప్రదేశంగా గుర్తించింది. రెండు జిల్లాల మధ్య గోదావరిలో 1.35 కిలోమీటర్ల మేర వారిధి నిర్మాణంతో పాటు ఒక వైపున  4.75 కిలోమీటర్లు, మరో వైపున 11 కిలోమీటర్ల మేర అప్రోచ్‌ రోడ్‌ను అభివృద్ధి చేయాలని నివేదికలో పేర్కొంది. ఈ అప్రోచ్‌ రోడ్ల వల్ల గోదావరికి వరదలు వచ్చినా రాకపోకలకు ఇబ్బందులు తలెత్తవని సూచించింది. ఇక వంతెన వనులకు రూ. 207 కోట్లు, అప్రోచ్‌ ఇతర పనులకు రూ. 123 కోట్లు వరకు అంటే మొత్తం రూ. 330 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. దీనిని ప్రభుత్వం ఆమోదిస్తే  పనులకు టెండర్లను ఆహ్వానించనున్నారు. అయితే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఈ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందా ? అన్నది సస్పెన్ప్‌గా మారింది.  


13 ఏళ్లు.. రూ. 200 కోట్లు ..ఇదీ పెరిగిన వ్యయం

రాష్ట్ర విభజనకు ముందు 2007లో వారధి నిర్మాణానికి అప్పటి ముఖ్యమంతి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.  రూ. 100 కోట్లు వ్యయంతో  మైతాస్‌ కంపెనీ పనులను ప్రారంభించింది. అయితే పనుల ఆరంభంలోనే  కంపెనీ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇటు రాష్ట్ర రాజకీయ పరిణామాల మారడంతో పనులు పెండింగ్‌లో పడ్డాయి.ఈ లెక్కన 13 ఏళ్లలో సుమారు రూ. 200 కోట్ల వ్యయం పెరిగింది.


త్వరలో  టెండర్లు : ఎమ్మెల్యే ప్రసాదరాజు

చాలాకాలంగా పెండింగ్‌ పడుతూ వస్తున్న వారధి నిర్మాణం చేపట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. త్వరలో డీపీఆర్‌ రిపోర్టు పరిశీలించి టెండర్లు ఆహ్వానిస్తాం.  వచ్చే ఐదేళ్లలో వంతెన కల నేరవేరుస్తాం.

Updated Date - 2020-08-05T17:26:50+05:30 IST