ప్రత్యేక రైళ్ల నిర్వహణ గాలికి!

ABN , First Publish Date - 2022-01-15T09:53:08+05:30 IST

సంక్రాంతి ప్రత్యేక రైళ్ల నిర్వహణను దక్షిణ మధ్య రైల్వే(ఎ్‌ససీఆర్‌) గాలికి వదిలేసింది.

ప్రత్యేక రైళ్ల నిర్వహణ గాలికి!

బోగీల్లో సౌకర్యాలు కరువు

పండుగ వేళ ప్రయాణికుల పాట్లు 

పట్టించుకోని అధికారులు


హైదరాబాద్‌ సిటీ, జనవరి 14(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి ప్రత్యేక రైళ్ల నిర్వహణను దక్షిణ మధ్య రైల్వే(ఎ్‌ససీఆర్‌) గాలికి వదిలేసింది. పండుగ నేపథ్యంలో సాధారణ, మధ్య తరగతి ప్రజల సౌకర్యార్థం వందలాది ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామంటున్న అధికారులు బోగీల్లో కనీస సౌకర్యాలను మాత్రం విస్మరించారు. దీంతో వివిధ స్టేషన్ల నుంచి వేలాది మంది ఇబ్బంది పడుతూనే సొంతూళ్లకు వెళ్లారు. నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లిన సువిధ ప్రత్యేక రైలులోని పలు బోగీల్లో నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రయాణికులు కనీస అవసరాలు తీర్చుకునేందుకు అవస్థలు పడ్డారు. గురువారం రాత్రి హైదరాబాద్‌ నుంచి కాకినాడ టౌన్‌కు వెళ్లిన మరో సువిధలోని ఏసీ టూ టైర్‌, త్రీ టైర్‌ కోచ్‌ల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్యాసింజర్లు గంటల తరబడి ఆందోళనకు గురయ్యారు. రైల్వే టోల్‌ ఫ్రీ నెంబరు ద్వారా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఎస్‌సీఆర్‌ జనవరి 5 నుంచి 25వ తేదీ వరకు దాదాపు 220 ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. వీటికి తోడు 282 రెగ్యులర్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.తనిఖీలు లేకుండానే పట్టాలపైకి..దసరా, దీపావళి కంటే సంక్రాంతికి సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ జంట నగరాలతోపాటు బెంగళూరు, ముంబై, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నుంచి లక్షలాది మంది తమ సొంతూళ్లకు వెళ్తుంటారు


. దీంతో జన్‌సాధారణ్‌, సువిధ స్పెషల్‌ పేరిట ప్రత్యేక రైళ్లను ఎస్‌సీఆర్‌ అందుబాటులో ఉంచుతోంది. ఆయా డివిజన్ల పరిధిలోని ప్యాసింజర్‌ రైళ్లను స్పెషల్‌ కింద తిప్పుతుంటారు. ప్రతి రైలును ప్రారంభ స్టేషన్‌లో క్యారేజీ అండ్‌ వ్యాగన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఅండ్‌డబ్ల్యూ) సిబ్బంది పరిశీలించాలి. బోగీల్లో విద్యుత్తు, నీటి సరఫరాలను తనిఖీ చేయాలి. అయితే, పండుగ సందర్భంగా పలు రైళ్లను పరిశీలించకుండానే పట్టాలపైకి పంపించడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కోచ్‌లను సరిగా శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తోందని, నీటి సరఫరా లేదని రైల్వే కంట్రోల్‌ రూమ్‌కు ఇప్పటికే ఫిర్యాదులు అందినట్లు తెలిసింది.చార్జీలు సైతం ఎక్కువ..సాధారణ రైళ్లలో కంటే సంక్రాంతి ప్రత్యేక రైళ్లలో చార్జీలు 5-10ు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ టౌన్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ ట్రెయిన్‌లోని ఏసీ టూ టైర్‌ టికెట్‌ ధర రూ.2,200. ప్రస్తుతం నడిపిస్తున్న సువిధ స్పెషల్‌లో రూ.3,000 వసూలు చేస్తున్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తూ ఆదాయాన్ని పెంచుకుంటున్న అధికారులు సౌకర్యాలను పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగ తర్వాత ఈ నెల 16 నుంచి తిరుగు ప్రయాణంలోనైనా సౌకర్యాలను మెరుగుపరచాలని కోరుతున్నారు.

Updated Date - 2022-01-15T09:53:08+05:30 IST