18 నుంచి ప్రత్యేక రైళ్లలో తగ్గనున్న చార్జీలు

ABN , First Publish Date - 2021-11-16T18:21:20+05:30 IST

రైల్వేమంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంతో నైరుతి రైల్వేజోన్‌ పరిధిలో ఈ నెల 18 నుంచి సాధారణ ప్రయాణీకుల నుంచి వసూలు చేస్తున్న ప్రత్యేక చార్జీలకు బ్రేక్‌ పడనుంది. పలు ఎక్స్‌ప్రెస్‌, ప్రత్యేక రైళ్ళలో జనరల్‌ బోగీల

18 నుంచి ప్రత్యేక రైళ్లలో తగ్గనున్న చార్జీలు

బెంగళూరు(Karnataka): రైల్వేమంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయంతో నైరుతి రైల్వేజోన్‌ పరిధిలో ఈనెల 18 నుంచి సాధారణ ప్రయాణీకుల నుంచి వసూలు చేస్తున్న ప్రత్యేక చార్జీలకు బ్రేక్‌ పడనుంది. పలు ఎక్స్‌ప్రెస్‌, ప్రత్యేక రైళ్ళలో జనరల్‌ బోగీలలో ప్రయాణించే ప్రయాణీకులు సైతం కోవిడ్‌ అవధిలో తమ టికెట్లను ముందుగా రిజర్వుచేసుకోవాల్సి వచ్చేది. ఇప్పటికీ ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ప్రత్యేక రైళ్ళ పేరుతో అదనంగా వసూలు చేస్తున్న 30 శాతం చార్జీల నుంచి ప్రయాణీకులకు వెసలు బాటు లభించబోతున్నది. జనరల్‌ బోగీల్లో సీట్ల రిజర్వేషన్‌ను దశల వారీగా ఉపసంహరించనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ ఉన్నతాధి కారి ఒకరు నగరంలో సోమవారం మీడియాకు సమాచారం అందించారు. కోవిడ్‌కు ముందు ఉన్న చార్జీలు మళ్ళీ అమల్లోకి రానుండటంతో సామాన్య ప్రయాణీకులకు ఒకింత ఊరట లభించనుంది. కాగా సీజన్‌టికెట్లను ఇప్పట్లో పునరుద్ధరించబోరని సదరు అధికారి వెల్లడించారు. కోవిడ్‌కు ముందు ఉన్న చార్జీలోనే ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీలలో ప్రయాణీకులు ఎంచక్కా ప్రయాణించవచ్చునన్నారు. అయితే కోవిడ్‌ నియమాలను మాత్రం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నారు. 


క్రమేపీ పెరుగనున్న రైళ్ళ సంచారం

   నైరుతి రైల్వేజోన్‌ పరిధిలో కోవిడ్‌కు ముందు 169 మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ ఫాస్ట్‌ రైళ్ళు, 141 పాజింజర్‌ రైళ్ళు సంచరించేవి. కోవిడ్‌ అనంతరం వీటిలో అత్యధిక భాగం రైళ్ళను రద్దుచేశారు. కోవిడ్‌ పరిస్ధితి క్రమేపీ మెరుగుపడ్డాక ప్రత్యేక రైళ్ళ పేరుతో 260 రైళ్ళను దేశంలోని వివిధ ప్రాంతాలకు నడిపారు. వీటిలో 70 ప్రత్యేక రైళ్ళలో ప్రయాణ చార్జీలను కూడా 30 శాతం పెంచారు. ఈ 70 రైళ్ళలో 18 నుంచి ప్రత్యేక రైళ్ళు అనే ట్యాగ్‌ను పూర్తిగా తొలగించి కోవిడ్‌కు ముందు ఉన్న చార్జీలనే జనరల్‌ బోగీల్లో ప్రయాణించే వారి నుంచి వసూలు చేస్తామన్నారు. తక్కువ చార్జీలతో రానున్న రోజుల్లో మరిన్ని రైళ్ళను నడిపే ఆలోచన ఉందన్నారు.

Updated Date - 2021-11-16T18:21:20+05:30 IST