వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2020-06-01T10:25:24+05:30 IST

ఒడిశా నుంచి కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్‌ జిల్లాలో పని చేసేందుకు వచ్చిన వలస కార్మికులను వారి

వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు

కరీంనగర్‌ స్టేషన్‌ నుంచి మూడు రైళ్లలో ఆరు వేల మంది తరలింపు

నేడు రాత్రి 8 గంటలకు మొదటి రైలు

ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం


కరీంనగర్‌, మే 31 (ఆంద్రజ్యోతి ప్రతినిధి): ఒడిశా నుంచి కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్‌ జిల్లాలో పని చేసేందుకు వచ్చిన వలస కార్మికులను వారి ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ఈ రైళ్లు బయలు దేరుతాయి. కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, జిల్లాలలో ఉన్న సుమారు ఆరు వేల మంది ఒడిశా వలస కార్మికులు ఆ రాష్ట్రంలోని బాలంకిడ్‌, నౌల్‌పాడ్‌, కర్లి, బాలఘడ్‌ జిల్లాలకు వెళ్లేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వారి కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు ఒక రైలు, పది గంటలకు, పన్నెండు గంటలకు మరో రెండు రైళ్లు బయలు దేరి వెళ్లే విధంగా ఏర్పాటు చేసింది.


నాలుగు జిల్లాల్లో ఉన్న వలస కార్మికులను సోమవారం ఉదయం సుమారు రెండు వందల బస్సుల్లో కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న రంగినేని గార్డెన్స్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడ వారందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి భోజన సౌకర్యం కల్పించడంతో పాటు వారు ఇంటికి చేరేంత వరకు అవసరమయ్యే భోజనాన్ని కూడా తయారు చేసి అందించనున్నారు. వైద్య పరీక్షల్లో కరోనా లక్షణాలు ఉన్న వారిని ఇక్కడే ఆపి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్‌, వైద్య ఆరోగ్యశాఖ ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.


వారు ఒడిశాకు వెళుతున్న వలస కార్మికుల వివరాలను నమోదు చేసి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రైల్వే స్టేషన్‌కు పంపిస్తారు. ఆదివారం అదనపు కలెక్టర్‌ శ్యాంప్ర సాద్‌లాల్‌ నేతృత్వంలో ఏసీపీ విజయసారథి, ట్రాఫిక్‌ ఏసీపీ శంకర్‌రాజు, ఆర్డీవో ఆనంద్‌కుమార్‌, తహసీల్దార్లు సుధాకర్‌, వెంకట్‌రెడ్డి, సురేష్‌, ఆర్టీసీ అధికారులు అవసరమైన ఏర్పాట్లను చేశారు.

Updated Date - 2020-06-01T10:25:24+05:30 IST