జోరుగా ‘అలిపిరి-చెర్లోపల్లె’ రహదారి పనులు

ABN , First Publish Date - 2021-08-07T07:36:28+05:30 IST

అలిపిరి - చెర్లోపల్లె ఫోర్‌ లేన్‌ రోడ్డు నిర్మాణ పనులు జోరందుకున్నాయి.

జోరుగా ‘అలిపిరి-చెర్లోపల్లె’ రహదారి పనులు
శరవేగంగా జరుగుతున్న నిర్మాణ పనులు

త్వరలోనే అందుబాటులోకి రానున్న ఫోర్‌ లేన్‌ రోడ్డు


తిరుపతి(కొర్లగుంట), ఆగస్టు 6: అలిపిరి - చెర్లోపల్లె ఫోర్‌ లేన్‌ రోడ్డు నిర్మాణ పనులు జోరందుకున్నాయి. గతంలో ఈ మార్గంలో టూ లేన్‌ రోడ్డు ఉండటంతో తరచూ ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడేది. దీనివల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. మధ్యలో డివైడర్‌ లేకపోవడంతో రాత్రివేళలో ప్రమాదాలు అధికంగా సంభవించేవి. ద్విచక్ర వాహనదారులైతే ఈ మార్గంలో వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. దీన్ని గుర్తించిన టీటీడీ ఈ రహదారి విస్తరణకు సంకల్పించింది. సర్వే చేయించి ఫోర్‌ లేన్‌ రోడ్డు నిర్మాణానికి అంచనాలను, ప్రణాళికలు రూపొందించింది. రూ.13కోట్లతో ఏడాది కాలపరిమితితో టెండర్‌ ఖరారు చేసింది. 21మీటర్ల వెడల్పు, 6.3 కిలోమీటర్ల పొడవుతో ఫోర్‌ లేన్‌ రోడ్డు నిర్మాణం గత ఏడాది మే 12న ప్రారంభమైంది. విస్తరణ స్థలంలో ఎర్రచందనం చెట్లు ఉండడం, వాటిని తొలగించడానికి అనుమతి, దుంగల తరలింపులో జాప్యం ఇలా కొన్ని నెలలు గడిచాయి. దీనివల్ల పనులు మందకొడిగా సాగుతూ చివరకు నిలిపేయాల్సి వచ్చింది. కాలపరిమితి కూడా ముగిసి రెండో ఏడాది కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మార్గంలో పలు ప్రమాదాలు జరిగాయి. దాంతో టీటీడీ ఉన్నతాధికారులు స్పందించారు. రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న సమస్యలను పరిష్కరించారు. ఆ వెంటనే కాంట్రాక్టర్‌ కూడా పనులను పునః ప్రారంభించారు. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే జోరును కొనసాగిస్తే దాదాపు రెండు నెలల్లోనే పనులన్నీ పూర్తవుతాయి. ఆ తర్వాత ఈ మార్గంలో ఎదురయ్యే ప్రయాణ సమస్యలు శాశ్వతంగా తొలగిపోనున్నాయి. 

Updated Date - 2021-08-07T07:36:28+05:30 IST