రెచ్చిపోయిన బిలియనీర్.. హైవేపై గంటకు 414 కిలోమీటర్ల వేగంతో కారు డ్రైవింగ్..

ABN , First Publish Date - 2022-01-22T03:04:49+05:30 IST

ప్రధాన రహదారిపై గంటకు 414 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన ఓ బిలియనీర్ విమర్శల పాలయ్యారు. ఏకంగా ప్రభుత్వం చేతిలోనే మొట్టికాయలు తిన్నారు.

రెచ్చిపోయిన బిలియనీర్.. హైవేపై గంటకు 414 కిలోమీటర్ల వేగంతో కారు డ్రైవింగ్..

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాన రహదారిపై గంటకు 414 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన ఓ బిలియనీర్ విమర్శల పాలయ్యారు. ఏకంగా ప్రభుత్వం చేతిలోనే మొట్టికాయలు తిన్నారు. కాగా.. ఆయన వేగంగా కారు నడుపుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. జెకొస్లోవేకియా దేశానికి చెందిన అపర కుబేరుడు రాడిమ్ పాసర్.. జర్మనీలోని ఆటోబాన్ రహదారిపై ఇలా ప్రమాదకరమైన రీతిలో డ్రైవింగ్ చేశారు. అత్యంత వేగవంతమైన కారుగా పేరున్న బుగ్గాటీ షిరాన్‌లో ఆయన ఇంతటి వేగాన్ని అందుకోగలిగారు. గతేడాది..బెర్లిన్ నుంచి హనోవర్‌కు వెళుతుండగా ఆయన ఇలా రాష్ డ్రైవింగ్ చేశారు. ఇటీవలే దాన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. రహదారిపై పెద్దగా ట్రాఫిక్ లేదని నిర్ధారించుకున్నాకే కారు వేగం పెంచానని, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని ఆయన తన వీడియో క్యాప్షన్లో పేర్కొన్నారు. 


అయితే.. జర్మనీ రవాణా మంత్రిత్వ శాఖ మాత్రం ఆయన తీరును ఖండించింది. ఇతరులు ప్రమాదంలో పడే రీతిలో డ్రైవింగ్ చేయడం తప్పని మందలించింది. కాగా.. ఎటువంటి స్పీడ్ లిమిట్ లేని ఆటోబాన్ రహదారులు ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. ఆ రహదారులపై వాహనాలు సగటున గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. రహదారిపై ఉన్న రద్దీని బట్టి డ్రైవర్లు తమ వేగాన్ని మార్చుకుంటుంటారు. అయితే.. వేగంపై ఎటువంటి పరిమితులు లేకపోయినప్పటికీ వాహనదారులు ఇతరుల భద్రతను దృష్టిలో పెట్టుకోవాలని, కారు నిత్యం అదుపులో ఉండేలా డ్రైవింగ్ చేయాలని జర్మనీ చట్టాలు చెబుతున్నాయి.    



Updated Date - 2022-01-22T03:04:49+05:30 IST