దుర్గాదేవి విగ్రహ నిమజ్జనానికి వెళ్తున్న భక్తులపై నుంచి దూసుకెళ్లిన కారు

ABN , First Publish Date - 2021-10-16T01:10:14+05:30 IST

నవరాత్రులల్లో భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజించిన భక్తులు విగ్రహ నిమజ్జనానికి తీసుకెళ్తున్న సమయంలో

దుర్గాదేవి విగ్రహ నిమజ్జనానికి వెళ్తున్న భక్తులపై నుంచి దూసుకెళ్లిన కారు

రాయ్‌పూర్: నవరాత్రులల్లో భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజించిన భక్తులు విగ్రహ నిమజ్జనానికి తీసుకెళ్తున్న సమయంలో దారుణం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.


చత్తీస్‌గఢ్‌లోని జాస్పూర్ జిల్లా పాతల్‌గావ్‌లో జరిగిందీ ఘటన. ఈ ఘటనలో ఒకరు మరణించారని, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారని జాస్పూర్ ఎస్పీ విజయ్ అగర్వాల్ తెలిపారు. క్షతగాత్రుల్లో ఇద్దరి ఎముకలు విరిగిపోవడంతో ఇతర ఆసుపత్రులకు వైద్యులు రెఫర్ చేసినట్టు చెప్పారు.  


ఈ ఘటన తర్వాత ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనంపైకి దూసుకెళ్లిన కారు డ్రైవర్‌ను పట్టుకుని చితక్కొట్టారు. పాతల్‌గావ్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లిన స్థానికులు ఆందోళనకు దిగారు. జనంపై నుంచి దూసుకెళ్లిన కారులో పెద్ద ఎత్తున గంజాయి ఉన్నట్టు ఆరోపించారు. నిందితులు బబ్లూ విశ్వకర్మ (21), శిశుపాల్ సాహు (26)లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిది మధ్యప్రదేశ్ అని, చత్తీస్‌గఢ్ మీదుగా వెళ్తుండగా ఘటన జరిగిందని చెప్పారు.  


దుర్గాదేవి విగ్రహ నిమజ్జనానికి వెళ్తున్న భక్తులపై నుంచి కారు దూసుకెళ్లిన ఘటనపై చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పందించారు. ఇది చాలా విషాద ఘటన అని పేర్కొన్న సీఎం.. నిందితులను వెంటనే అరెస్ట్ చేశామని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ట్వీట్ చేశారు. నిందితులు ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా చ్యలు తీసుకుంటామన్నారు.  



Updated Date - 2021-10-16T01:10:14+05:30 IST