Abn logo
Jul 19 2021 @ 15:27PM

అంతరిక్షంలో మరోసారి మన ముద్ర

వర్జిన్‌ గ్యాలక్టిక్‌ అంతరిక్ష యాత్రలో మన తెలుగమ్మాయి కీలక పాత్ర పోషించి వార్తల్లోకెక్కిన విషయం మనందరికీ తెలుసు. అయితే రేపు అంతరిక్షంలోకి వెళ్లనున్న  న్యూ షెపర్డ్‌ అంతరిక్ష వ్యోమనౌక నిర్మాణంలోనూ కీలక భూమిక పోషించింది మరో భారతీయ వనిత. ఆమే మహారాష్ట్రలోని కళ్యాణ్‌కు చెందిన మరాఠా మహిళ సంజల్‌ గవాండే! 


అమెరికా వ్యాపారవేత్త, బిలియనీర్‌ జెఫ్‌ బెజోస్‌ అతి కొద్ది మంది వ్యోమగాములతో కలిసి రేపు అంతరిక్షంలోకి దూసుకుపోబోతున్నాడు. ఆయన ప్రయాణించే రాకెట్‌ న్యూ షెపర్డ్‌ రూపకల్పనలో పాల్గొన్న బృందంలో 30 ఏళ్ల సిస్టం ఇంజనీర్‌ సంజల్‌ గవాండే ఒకరు. కమర్షియల్‌ స్పేస్‌ఫ్లైట్‌ కంపెనీ బ్లూ ఆరిజన్‌లో వ్యోమగాములను అంతరిక్షంలోకి చేర్చే సబ్‌ ఆర్బిటల్‌ స్పేస్‌ రాకెట్‌ న్యూ షెపర్డ్‌ నిర్మాణంలో సంజల్‌ పాత్ర ఉంది. 


ప్రయాణం సాగిందిలా...

ముంబై యూనివర్శిటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసిన సంజల్‌, మాస్టర్‌ డిగ్రీ కోసం అమెరికా వెళ్లింది. అక్కడ మిషిగాన్‌ టెక్నలాజికల్‌ యూనివర్శిటీలో, ఏరోస్పేస్‌ ప్రధానంగా మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని టయోటా రేసింగ్‌ డెవలప్‌మెంట్‌లో మెకానికల్‌ డిజైన్‌ ఇంజనీర్‌గా నాలుగేళ్ల పాటు సేవలందించింది. ఆ ఉద్యోగంలో ఉన్న సమయంలోనే వారాంతాల్లో ఫ్లైయింగ్‌ పాఠాలూ నేర్చుకుంది. అలా జూన్‌, 2016లో పైలట్‌ లైసెన్సు కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆరెంజ్‌ కౌంటీలోని, కాలిఫోర్నియా చాప్టర్‌ ఆఫ్‌ నైన్టీనైన్‌ అనే, మహిళా పైలట్ల అంతర్జాతీయ సంస్థ నుంచి ‘పైలట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2021’ అవార్డును కూడా దక్కించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్లూ ఆరిజన్‌లో సిస్టం ఇంజనీర్‌గా బాధ్యతలు అందుకుంది. అయితే అంతరిక్ష రంగం పట్ల తనకున్న ఆసక్తితో ఇంజనీర్‌గా మొదట నాసాకు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు, పౌరసత్వ అవాంతరాలు ఎదురయ్యాయి. దాంతో ఇదే రంగంలో ఎదగాలనే పట్టుదలతో సియాటిల్‌లోని బ్లూ ఆరిజన్‌లో, సిస్టం ఇంజనీర్‌గా అప్లై చేసి, చోటు దక్కించుకుంది. అలా రాకెట్‌ నిర్మాణ బృందంలో ఫ్రేమ్‌వర్క్‌ ఇంజనీర్‌గా న్యూ షెపర్డ్‌ తయారీలో కీలక పాత్ర పోషించింది. 


అమ్మాయికి ఇంజనీరింగ్‌ ఎందుకు అన్నారు

సంజల్‌ గురించి ఆమె తల్లి మాట్లాడుతూ... ‘‘సంజల్‌ బాల్యం నుంచీ నెమ్మదస్తురాలు, చదువులో మాత్రం ముందుండేది. తను మెకానికల్‌ ఇంజనీరింగ్‌ ఎంచుకున్నప్పుడు అమ్మాయికి, ఆ సబ్జెక్టు అవసరమా? అన్నారు.’’ అంటూ చెప్పుకొచ్చారామె. వారి అనుమానాలనూ, అభ్యంతరాలనూ పటాపంచలు చేస్తూ సంజల్‌ అంతరిక్ష రంగంలో భారతీయ మహిళల సత్తా చాటడం విశేషం. సంజల్‌ తండ్రి, మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగి అయిన అశోక్‌ గావండే మాట్లాడుతూ... ‘‘వ్యోమనౌక నిర్మించడం సంజల్‌ కల. అందుకే మిషిగాన్‌ టెక్నాలజీ యూనివర్శిటీలో మాస్టర్‌ డిగ్రీ కోసం ఏరోస్పేస్‌ను ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకుంది. ఇన్నాళ్లకు తను అనుకున్నది సాధించింది’’ అంటూ చెప్పుకొచ్చారు. న్యూ షెపర్డ్‌ గురించి మాట్లాడుతూ, ‘‘నా చిన్ననాటి కల నెరవేరబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. బ్లూ ఆరిజన్‌ బృందంలో సభ్యురాలిగా ఎంతో గర్వపడుతున్నాను’’ అంటూ సంజల్‌ ఆనందం వ్యక్తం చేస్తోంది. 


రేపు నింగిలోకి న్యూ షెపర్డ్‌

జెఫ్‌ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్‌, వేలంపాట విజేత ఆలిమన్‌ డేమర్‌, 82 ఏళ్ల లెజెండరీ పైలట్‌, వాలీ హంక్‌ అనే మహిళ న్యూ షెపర్డ్‌లో ఈ నెల 20న, 11 నిమిషాల నిడివి కలిగిన అంతరిక్ష ప్రయాణం చేయబోతున్నారు. 60 అడుగుల పొడవుండే న్యూ షెపర్డ్‌ రాకెట్‌ స్వయంప్రతిపత్తి కలిగినది. ఇది పూర్తి ఆటోమేటిక్‌ రాకెట్‌ క్యాప్స్యూల్‌ కాంబో. స్పేస్‌క్రాఫ్ట్‌ లోపలి నుంచి దీన్ని ఆపరేట్‌ చేయడం వీలుపడదు. దీన్లో ప్రయాణించే నలుగురూ సాధారణ పౌరులే! బ్లూ ఆరిజన్‌ ఉద్యోగులు, సిబ్బంది వ్యోమగాముల్లో ఏ ఒక్కరూ ఈ బృందంలో లేకపోవడం విశేషం.