రోజుకో రొట్టెతో వారాలు గడిపా!

ABN , First Publish Date - 2021-10-27T05:30:00+05:30 IST

మోడలింగ్‌ మీద ఇష్టంతో మంగళూరు నుంచి ముంబయికి వెళ్లింది. రోజుకో బ్రెడ్‌ ముక్కతో నాలుగైదు వారాలు గడిపింది. ఆ ప్రయత్నం... ఆ కష్టం... వాటి ఫలాలను ఇప్పుడు ఆస్వాదిస్తోంది. ..

రోజుకో రొట్టెతో వారాలు గడిపా!

మోడలింగ్‌ మీద ఇష్టంతో మంగళూరు నుంచి ముంబయికి వెళ్లింది. 

రోజుకో బ్రెడ్‌ ముక్కతో నాలుగైదు వారాలు గడిపింది. 

ఆ ప్రయత్నం... ఆ కష్టం... వాటి ఫలాలను ఇప్పుడు ఆస్వాదిస్తోంది. 

మోడల్‌గా మొదలై... సినిమా తారై... బుల్లితెరపై ‘రౌడీ గారి పెళ్లాం’గా అలరిస్తున్న 

నటి అమీతా సదాశివ ‘నవ్య’తో పంచుకున్న అనుభవాలివి...


 ‘‘నాకు అప్పుడు పదమూడేళ్లనుకుంటా... టీవీలో ఫ్యాషన్‌ షోలు వస్తుంటే వదిలిపెట్టేదాన్ని కాదు. విభిన్న డిజైన్లు... వినూత్న డ్రెస్‌లు... పదివేల ఓల్టుల కాంతుల్లో ర్యాంప్‌లపై మోడళ్లు అలా నడిచి వస్తుంటే... ఆ దృశ్యాలు చూస్తూ నన్ను నేను మరిచిపోయేదాన్ని. ఎప్పుడో అప్పుడు వారిలా నేనూ ఫ్యాషన్‌ దుస్తులు ధరించి... క్యాట్‌వాక్‌లతో అదరగొట్టాలని కలలు కనేదాన్ని. కాలం పరిగెత్తుతోంది. మోడల్‌ కావాలన్న కోరిక నాలో బలపడుతోంది. రెండేళ్లు గడిచాయి. కల కలగానే మిగలకూడదు. అలా కాకూడదంటే..? కర్ణాటకలోని మంగళూరు మా సొంతూరు. అక్కడ నేను కోరుకొనే రంగంలో పెద్దగా అవకాశాలు ఉండవు. మరి ఏంచేయాలి? ఆ క్షణం మదిలో మెదిలిన ఆలోచన... ముంబయి. అమ్మా నాన్నలకు చెప్పాను... ముంబయి వెళతానని. వాళ్లిద్దరూ ఉద్యోగస్తులు. నేనడిగితే ఏదీ కాదనలేదు. కానీ ముంబయికి మాత్రం వద్దన్నారు. ఆ పరిశ్రమ మనలాంటి వారికి కాదని, సంపన్నులకని ఏవేవో చెప్పారు. వాళ్ల భయాలు వాళ్లకు ఉంటాయి కదా! 

ఏమీ తెలియకుండానే... 

అమ్మా నాన్న మాట వినలేదు. పంతం వీడలేదు. చేసేది లేక నాన్న సరేనన్నారు. నన్ను ముంబయిలో దించి  వెళ్లారు. ఉత్సాహంగా ముంబయి వెళ్లాను కానీ అక్కడ పరిశ్రమతో పరిచయాలున్నవారు ఎవరూ నాకు తెలియదు. ఎక్కడికి వెళ్లి, ఎవర్ని సంప్రతించాలన్న కనీస అవగాహన గానీ, మార్గనిర్దేశనం చేసేవారు గానీ లేరు. ఆడిషన్‌, పోర్ట్‌ఫోలియో లాంటి పదాలకు అర్థాలు కూడా తెలియవు. అయినా ఏదో మొండి ధైర్యం. నాపై నాకు నమ్మకం. ప్రయత్నించాలన్న పట్టుదల. ఫ్యాషన్‌ హౌస్‌ల చుట్టూ తిరిగాను. 

ఆత్మవిశ్వాసమే అండగా... 

ముంబయిలో నేను పడిన కష్టాలు మాటల్లో చెప్పలేను. కొంత కాలానికి చేతిలో డబ్బులు అయిపోయాయి. తిండికి కూడా లేవు. రోజుకో బ్రెడ్డు ముక్క తింటూ నెలంతా గడిపాను. నాన్నని అడిగితే ఇస్తారు. ముంబయిలో బంధువులూ ఉన్నారు. కానీ నా పరిస్థితి తెలిస్తే వెంటనే ఇంటికి వచ్చేయమంటారు. అందుకే ఎవరికీ చెప్పేదాన్ని కాదు. ఒక లక్ష్యాన్ని చేరే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. వాటన్నిటినీ తట్టుకొంటేనే కదా నిలబడగలిగేది. ఎప్పటికైనా విజయం సాధిస్తానన్న ఆత్మవిశ్వాసం నాకు. అదే నా బలం. చివరకు నా ప్రయత్నం ఫలించింది. మోడలింగ్‌ ఆడిషన్‌ జరుగుతుందని తెలిసి వెళ్లాను. ఎంపికయ్యాను. అలా నా పదిహేడేళ్ల వయసులో మోడల్‌ కావాలన్న కల నెరవేర్చుకున్నాను. మోడలింగ్‌లో కేటలాగ్స్‌, ఫ్యాషన్‌ షోలు ఎక్కువగా చేసేదాన్ని. 

నాటక రంగం వైపు... 

మోడలింగ్‌ చేస్తున్న రోజుల్లో నటనపై ఆసక్తి కలిగింది. నటి కావాలనుకున్నాను. కానీ నటనలో ఏబీసీడీలు తెలియవు. ముందు ఒకటి రెండు ఆడిషన్స్‌కు వెళ్లి చూద్దామనుకున్నాను. అక్కడికి వెళ్లాక నటించగలననే నమ్మకం ఏర్పడింది. నిదానంగా మోడలింగ్‌ నుంచి నాటక రంగం వైపు అడుగులు వేశాను. ఒక థియేటర్‌ గ్రూప్‌లో చేరాను. మొదట్లో హెల్పర్‌గా పని. సెట్‌లో టీలు అందించేదాన్ని. వారితో ఉంటూ అవగాహన పెంచుకున్నాను. నా ఆసక్తి గమనించి షోస్‌లో చిన్న చిన్న పాత్రలు ఇచ్చారు. తరువాత తరువాత ప్రధాన పాత్రలు పోషించే స్థాయికి ఎదిగాను. మా బృందంతో కలిసి వివిధ ప్రాంతాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చాం. 

సినిమాల్లో ఎంట్రీ... 

దాదాపు రెండేళ్లు నాటక రంగమే నా లోకం. అదే సమయంలో ‘ఆ ఎరడు వర్షగళు’ కన్నడ సినిమా కోసం నన్ను సంప్రతించారు. ఆడిషన్స్‌కు రమ్మన్నారు. సెలెక్ట్‌ అయ్యాను. 2017లో ఆ చిత్రం విడుదలైంది. అనూహ్య ఆదరణ లభించింది. తరువాత ‘గిఫ్ట్‌ బాక్స్‌’, మరో చిత్రం చేశాను. తొలి రెండు సినిమాల్లో నేను పోషించిన పాత్రలు చాలా క్లిష్టమైనవి. అన్ని డైమన్షన్స్‌ ఉంటాయి. నాటకాల అనుభవం అక్కడ బాగా పనికొచ్చింది. 

కరోనా నేర్పిన పాఠం... 

వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సమయంలో కరోనా కుదిపేసింది. దాంతో సినిమాలు ఆగిపోయాయి. నిన్న మొన్నటి వరకు థియేటర్లు కూడా తెరుచుకోలేదు. అందరూ ఖాళీ. అప్పుడు 

‘జీ తెలుగు’ నుంచి పిలుపు వచ్చింది. ‘రౌడీ గారి పెళ్లాం’ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ చేయమని అడిగారు. సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. ఖాళీగా కూర్చొనే కంటే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమం అనిపించి ఓకే చెప్పాను. ఈ సీరియల్‌ ‘జీ తెలుగు’లో గత నెల ప్రారంభమైంది. రేటింగ్స్‌ బాగున్నాయి. తెలుగులో చేస్తానని నేనసలు ఊహించలేదు. ఇది పెద్ద పరిశ్రమ. అలాంటి పరిశ్రమలో అవకాశం రావడం సంతోషంగా ఉంది. 

విమర్శించినవారే... 

వాస్తవానికి 

‘జీ తెలుగు’లో ‘రౌడీ గారి పెళ్లాం’ ప్రోమో వచ్చినప్పుడు చాలామంది విమర్శించారు. ముఖ్యంగా నా మీద రకరకాలుగా కామెంట్స్‌ చేశారు. అయితే ముంబయి లాంటి మహానగరంలో ఉండి వచ్చినదాన్ని. ఆ నగరం, అక్కడి జీవన విధానం నాకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పింది. నిజాయతీగా పని చేసి సహనంతో వ్యవహరిస్తే వేటికైనా కాలమే సమాధానం చెబుతుంది. అదే జరిగింది. ఒక్కసారి సీరియల్‌ మొదలయ్యాక... నాడు బాగోలేదన్నవారే నా నటన అద్భుతమంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సీరియల్‌లో నాది స్కూల్‌ టీచర్‌ ‘ఈశ్వరి’ పాత్ర. ఆమె చదువుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. తప్పు జరిగితే ప్రశ్నిస్తుంది.’’ 

                                                                                                                         హనుమా


పర్సనల్‌ టచ్‌ 

 మోడలింగ్‌లోకి రాకముందు సాఫ్ట్‌వేర్‌లో స్థిరపడాలనుకుంది 

 నటి కాకుంటే ఫుల్‌టైమ్‌ యోగ టీచర్‌ కావాలనుకుంది 

 నచ్చే నటులు... నవీన్‌ పోలిశెట్టి, 

విజయ్‌ దేవరకొండ 

 ఆమె బలం... చేసే పని పట్ల అంకితభావం... ఆత్మవిశ్వాసం  

యోగా టీచర్‌ని కూడా..

కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో నేను డిగ్రీ చదివాను. ఆ సమయంలోనే భరతనాట్యం నేర్చుకున్నాను. తరువాత యోగ సాధన చేశాను. ఇప్పుడు అది నా జీవన శైలిలో భాగమైంది. ఖాళీ సమయాల్లో యోగ పాఠాలు చెబుతాను. పీసీఓడీ వంటి సమస్యలు ఉన్నవారికి తరగతులు నిర్వహిస్తున్నాను. ఇప్పుడు నాకున్నది ఒకటే లక్ష్యం... నటిగా మరింత ఎత్తుకు ఎదగాలి. అందరికీ గుర్తిండిపోయే పాత్రలు చేయాలి. తెలుగు సినిమాల్లోనూ నటించాలి.

Updated Date - 2021-10-27T05:30:00+05:30 IST