లక్షలు వ్యయం.. నెరవేరని లక్ష్యం!

ABN , First Publish Date - 2021-01-16T05:02:24+05:30 IST

కూరగాయల మార్కెట్‌ తరలించాలనే ఉద్దేశంతో ఏఎంసీలో నిర్మించిన గోదాము అలంకారప్రాయంగా మారింది. అక్కడ కేటాయించిన స్థలంలో పిచ్చిమొక్కలు దర్శన మిస్తున్నాయి. దీనిపై స్థానికులు పెదవి విరుస్తున్నారు.

లక్షలు వ్యయం.. నెరవేరని లక్ష్యం!
నిరుపయోగంగా గోదాము

 అలంకారప్రాయంగా గోదాము

 పిచ్చిమొక్కలతో  నిండిన ఏఎంసీకి కేటాయించిన స్థలం 

  యథాస్థానంలోనే కూరగాయల మార్కెట్‌ 

రామభద్రపురం:  కూరగాయల మార్కెట్‌  తరలించాలనే ఉద్దేశంతో ఏఎంసీలో నిర్మించిన గోదాము అలంకారప్రాయంగా మారింది. అక్కడ కేటాయించిన స్థలంలో పిచ్చిమొక్కలు దర్శన మిస్తున్నాయి. దీనిపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. వాస్తవంగా  ఎస్‌.చింతలవలస పరిధిలో దశాబ్దకాలం కిందట బలహీనవర్గాల ఇళ్ల కోసం ఒక లేఅవుట్‌ నిర్మించారు. అప్పట్లో లక్షలాది రూపాయలతో  వాటర్‌ ట్యాంకు, రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టారు. అయితే ఇందులో సుమారు ఏడెకరాల స్థలాన్ని తమకు అప్పగించాలని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు కోరారు. రామభద్రపురం కూరగాయల మార్కెట్‌ను ఇక్కడకు తరలించి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అప్పటి జిల్లా అధికారులు ఏడెకరాల స్థలాన్ని ఏఎంసీకి కేటాయించారు. మౌలిక సౌకర్యాల కల్పన కోసంరూ.98 లక్షలను కూడా విడుదల చేశారు. యుద్ధప్రాతిపదికన ఒక షెడ్డు, ప్రహరీ నిర్మాణాలు చేపట్టారు. రామభద్రపురం కూరగాయల మార్కెట్‌ను అక్కడికి తరలించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినప్పటికీ వ్యాపారులు, రైతులు అక్కడికి వెళ్లడానికి ససేమిరా అన్నారు.  అప్పటి నుంచి ఈ ఏఎంసీకి కేటాయించిన స్థలంతోపాటు షెడ్డు కూడా అలంకారప్రాయంగానే మిగిలింది. దీనిపై ఏఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. రైతులకు కూడా నచ్చజెప్పే నాథుడే కరువవడంతో కూరగాయల మార్కెట్‌ యథాస్థానంలోని కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు  స్పందించి తగు చర్యలు తీసుకోవాలని  ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై ఏఎంసీ సెక్రటరీ సతీష్‌ను వివరణ కోరగా కూరగాయల మార్కెట్‌ను అక్కడికి తరలించడానికి గ్రామ పంచాయతీ అడ్డుచెప్పడంతో పాటు వ్యాపారులు, రైతులు కూడా నిరాకరించారని తెలిపారు. అయితే అక్కడ నిర్మించిన గోదామును వినియోగించుకోవడానికి చర్యలు తీసుకుంటామన్నారు. 


 

 

Updated Date - 2021-01-16T05:02:24+05:30 IST