- అయినా రికవరీలో జాప్యం తప్పదు
- ఫిచ్ సొల్యూషన్స్ అంచనా
న్యూఢిల్లీ : భారత్‌లో వినియోగ వ్యయం 2021 సంవత్సరంలో తిరిగి సానుకూల వృద్ధిలో ప్రవేశిస్తుందని, 6.6 శాతం మేరకు వృద్ధిని నమోదు కావచ్చని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా. అయితే 2021 లేదా 2022లో మాత్రమే వినియోగ వ్యయం కొవిడ్-19 ముందు కాలం నాటి స్థితికి చేరవచ్చునని పేర్కొంది. కొవిడ్-19 విజృంభణ, దాన్ని అదుపు చేసేందుకు విధించిన లాక్డౌన్ల కారణంగా 2020లో వినియోగవ్యయం -12.6 శాతం మేరకు ప్రతికూల వృద్ధిలోకి దిగజారింది. 2021లో వినియోగ వ్యయం సానుకూల ధోరణిలో ప్రవేశించినా ఈ ఏడాది నమోదైన భారీ క్షీణత కారణంగా రికవరీ మాత్రం పలు దేశాల్లో కన్నా మందంగా ఉంటుందని ఫిచ్ తాజా నివేదికలో అంచనా వేసింది. నిరుద్యోగిత గరిష్ఠ స్థాయిల్లోనే ఉంటుందంటూ ఉపాధికి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎంతవరకు చర్యలు తీసుకోగలదనేది అనుమానాస్పదమేనని స్పష్టం చేసింది. రూపాయి విలువ ప్రకారం చేస్తూ గృహ వినియోగ వ్యయం 2019తో పోల్చితే 1.2 శాతం పెరిగి రూ.121.6 లక్షల కోట్ల నుంచి రూ.123 లక్షల కోట్లకు చేరవచ్చని, కరోనా మహమ్మారి వినియోగ వ్యయాలను ఎంత మేరకు దిగజార్చిందో తెలుసుకోవడానికి ఇదే నిదర్శమని తెలిపింది.
ఇంచుమించు అన్ని విభాగాల్లోనూ వినియోగ వ్యయాలు సాధారణ స్థాయికి చేరవచ్చునంటూ ఆహారం, నాన్ ఆల్కహాలిక్ పానీయాల విభాగం ప్రాధాన్యతా క్రమంలో అగ్రస్థానంలో ఉండవచ్చని పేర్కొంది. ఈ విభాగంలో వ్యయాల పెరుగుదల 2021లో 7.9 శాతానికి పెరగవచ్చని తెలిపింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం వినియోగదారులు నిత్యావసరం కాని వస్తువులపై ఆచితూచి ఖర్చు చేస్తున్నారని, ఈ బేస్ ఎఫెక్ట్ కారణంగా వచ్చే ఏడాది ఈ విభాగంలో కూడా బలమైన వృద్ధి నమోదు కావచ్చునని అంచనా వేసింది. ఈ ఏడాది జనవరి 20న దేశంలో తొలి కరోనా కేసు నమోదు కాగా దాన్ని అదుపులోకి తేవడానికి మార్చి 24 నుంచి మే చివరి వరకు కఠిన లాక్డౌన్లు అమలుపరిచారు. తదుపరి క్రమంగా లాక్డౌన్లు సడలిస్తూ వచ్చినా ఇంకా పూర్తి స్థాయిలో ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ జరగలేదు. అన్‌లాక్ 5.0లో భాగంగా సినిమాహాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను అనుమతించినా 50 శాతం సామర్థ్యంతోనే నడపాలనే షరతు విధించారు. ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థను పలు రిస్క్‌లు వెన్నాడుతున్నాయంటూ ఆ రిస్క్‌లు గనుక విస్తరించినట్టయితే ప్రస్తుత అంచనాలు తలకిందులు కావచ్చని హెచ్చరించింది.