ప్రాణాలు తీసిన ‘స్పిరిట్’

ABN , First Publish Date - 2020-06-01T15:16:42+05:30 IST

మద్యం ధరలను విపరీతంగా పెంచేయడంతో మందుబాబులు..

ప్రాణాలు తీసిన ‘స్పిరిట్’

కశింకోటలో ముగ్గురి మృతి

ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం

మద్యం ధరలు విపరీతంగా పెంచేయడంతో స్పిరిట్‌ను ఆశ్రయించిన మందుబాబులు

మద్యం తరహాలో కిక్కు ఇస్తుందని సేవించిన వైనం

వికటించడంతో మృత్యువాత

ఫార్మా సిటీలోని ఓ పరిశ్రమ నుంచి స్పిరిట్‌ తెచ్చుకున్నట్టు పోలీసుల అనుమానం


కశింకోట(విశాఖపట్నం): మద్యం ధరలను విపరీతంగా పెంచేయడంతో మందుబాబులు తక్కువ ధరకు లభించే, నాటుసారా, ఇతర మత్తు పదార్థాలను ఆశ్రయిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ తరహాలోనే కశింకోటకు చెందిన ఐదుగురు మందుబాబులు చౌకగా లభించిన స్పిరిట్‌ను మద్యానికి ప్రత్యామ్నాయంగా భావించి పూటుగా సేవించారు. వీరిలో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు. ఇందుకు సంబంధించి అనకాపల్లి రూరల్‌ సీఐ నరసింహారావు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.


కశింకోట పూసర్లవీధికి చెందిన కూనిశెట్టి ఆనంద్‌(48) పరవాడలోని ఫార్మా సిటీలో స్పిరిట్‌ తయారు చేసే ఓ కంపెనీలో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. అక్కడి నుంచి ఇటీవల 2.25 లీటర్ల స్పిరిట్‌ తెచ్చాడు. పెతకంశెట్టి అప్పారావు(45), వడిసెల నూకరాజు(61), వడ్లమూరి మాణిక్యం, పంచాయతీ పారిశుధ్య కార్మికుడు దొరబాబు ఇతని స్నేహితులు. అందరూ కలిసి శనివారం రాత్రి ఆనంద్‌ ఇంట్లో పార్టీ చేసుకుని స్పిరిట్‌ తాగారు. రాత్రి పది గంటల తరువాత ఆనంద్‌ మినహా మిగిలిన వారు తమ ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.


కాగా ఆనంద్‌ ఆదివారం ఉదయం తన ఇంటి గుమ్మం వద్ద నిర్జీవంగా పడివుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని తెలియజేశారు. పెతకంశెట్టి అప్పారావు ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో అపస్మారక స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. వడిసెల నూకరాజు(61) కూడా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు అనకాపల్లి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే మృతిచెందాడు.


వడ్లమూరి మాణిక్యం, పారిశుధ్య కార్మికుడు దొరబాబు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మృతుల్లో కూనిశెట్టి ఆనంద్‌ అవివాహితుడు, ఇతను గతంలోలారీ క్లీనర్‌గా పనిచేశాడు. అప్పారావు, నూకరాజు ఆటో తోలుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అనకాపల్లి రూరల్‌ సీఐ నరసింహారావు, ఎస్‌ఐ ఎల్‌.హిమగిరి కశింకోట చేరుకుని వివరాలు సేకరించారు.


ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ఎక్కువ మత్తు కలిగిస్తుందన్న ఉద్దేశంతో అతిగా స్పిరిట్‌ తాగివుంటారని, దీంతో పరిస్థితి విషమించి ముగ్గురు చనిపోయారని చెప్పారు. ఆనంద్‌ ఇంట్లో స్పిరిట్‌ వున్న బాటిల్‌ లభ్యమైందని, దీనిని పరీక్షలు నిమిత్తం ల్యాబ్‌కి పంపుతున్నామని చెప్పారు. కాగా నూకరాజు, ఆనంద్‌ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. కశింకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-06-01T15:16:42+05:30 IST