Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆధ్యాత్మికం.. ఆహ్లాదం

 పూల మొక్కలు, గ్రీనరీతో అభివృద్ధి 

 పచ్చదనంతో అబ్బురపరుస్తున్న యాదాద్రి 

 తుది దశకు చేరిన క్యూలైన్ల నిర్మాణంపూర్తికావొచ్చిన విష్ణుపుష్కరిణి నిర్మాణం 


లక్ష్మీనరసంహస్వామి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదాన్ని కల్పించేందుకు వైటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రికొండ కింద వైకుంఠద్వారం ఎదుట సర్కిల్‌ ఆకారంలో వివిధ రకాల పూల మొక్కలు, గ్రీనరీని పొందుపరిచారు. కొండపైన, రింగురోడ్డుకు ఇరువైపులా, రింగుసర్కిళ్లలో దేవతామూర్తులకు చెందిన మొక్కలు, అరుదైన వృక్షజాతులతో కొండంతా పచ్చదనం పరిఢవిల్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా స్వయంభువులను దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్ల నిర్మాణం కొనసాగుతుంది. దేశంలో మరెక్కడా లేని విధంగా వేడి, చల్లదనం, వర్షాన్ని తట్టుకునేలా ప్రత్యేక రీతిలో రూపొందిస్తున్నారు. 

యాదాద్రిటౌన్‌


వచ్చే ఏడాది మార్చి 28న స్వయంభువులు కొలువుదీరిన ప్రధానాల య ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో పచ్చదనం ఉట్టిపడేలా, భక్తులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంతోపాటు పలు ప్రాంతాల్లో సుమారు 98రకాల వివిధ జాతులకు చెందిన 4లక్షలకు పైగా మొక్కలు నాటారు. యాదాద్రికి విచ్చేసే యాత్రికులను ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు సుమారు రూ.12.3కోట్లతో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కొండ చుట్టూ ఆరులేన్ల రింగురోడ్డులోని నాలుగురింగు సర్కిళ్లను ఆకట్టుకునేరీతిలో తీర్చిదిద్దుతున్నారు. భక్తులు మొట్టమొదటగా కొండకింద వైకుంఠద్వారం చెంత మొక్కులు సమర్చించడం సంప్రదాయం. అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న వైకుంఠద్వారం ముందు ఓ సర్కిల్‌ను తయారు చేసి, అక్కడ వివిధ రకాల మొక్కలు నాటారు. అదేవిధంగా వైకుంఠద్వారం వద్ద అద్భుత శిల్పకళాకృతులతో పంచతల గాలిగోపురాన్ని నిర్మించారు. 


యాదాద్రి క్షేత్రంలో తుదిదశకు దర్శన క్యూలైన్లు

యాదాద్రిక్షేత్రంలో దర్శన క్యూలైన్ల పనులు తుదిదశకు చేరాయి. హరిహరుల ఆలయాల్లో శివకేశవ సంప్రదాయాలను తెలియజేసేలా దర్శన క్యూలైన్లు ఏర్పాటుచేస్తున్నారు. ప్రధానాలయంలో కొలువుదీరిన స్వయంభువులను దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. యాదాద్రి కొండకు ఈశాన్య భాగంలో దర్శన క్యూకాంప్లెక్స్‌ నిర్మాణం పూర్తయింది. అత్యున్నత ప్రమాణాలతో దర్శన క్యూలైన్ల నిర్మాణ పనులను నిష్ణాతులైన కళాకారులు నిర్వహిస్తున్నారు. ప్రధానాలయ తూర్పు రాజగోపురం ముందు ఆధ్యాత్మికత, పాంచరాత్రాగమ శాస్త్రం ఉట్టిపడేలా ఇత్తడి, అల్యూమినియం మిశ్రమలోహంతో రూపొందించిన క్యూలైన్‌ బాక్సులను అమర్చుతున్నారు. సుమారు 410అడుగుల మేర వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం, ఇండోర్‌ శిల్పకళా కేంద్రంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయించిన విడి భాగాలను యాదాద్రిక్షేత్రానికి తరలించి అమర్చే పనులు నిర్వహిస్తున్నారు. ఒక్కో క్యూలైన్‌ బాక్సు ఎనిమిది అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తు, నాలుగున్నర, ఆరున్నర అడుగుల వెడల్పులో తయారు చేశారు. 12 అడుగుల వెడల్పు, 12అడుగుల పొడవులో రెండు బాక్సులు, 16 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పులో ఒక బాక్సును తయారు చేసి అమర్చారు. అయితే క్యూలైన్లలోకి ప్రవేశించిన భక్తుల సౌకర్యార్థం అత్యవసర మార్గాలను ఈ బాక్సులకు ఏర్పాటుచేశారు. ఆలయ గోపుర ఆకారాన్ని పోలినట్లు తీర్చిదిద్దిన లోహపు క్యూలైన్‌ బాక్సుకు నాలుగు వైపులా శంకు, చక్ర, తిరునామాలు, జయవిజయుల విగ్రహరూపాలు, ఆగమశాస్త్రాన్ని తెలియజేసే రూపాలతో క్యూలైన్‌ నిర్మించారు. కొండపైన ఆరుబయట క్యూలైన్‌ వస్తుండటంతో వేడి, చల్లదనాన్ని, వర్షాన్ని తట్టుకునేలా ప్రత్యేక రీతిలో రూపొందిస్తున్నారు. భారతదేశంలో మరే దేవాలయంలోనూ లేని విధంగా ఈ క్యూలైన్‌ బాక్సులను రూపొందించామని, యాదాద్రి క్షేత్రానికి ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని వైటీడీఏ అధికారులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు బంగారు వర్ణంలో క్యూలైన్‌ బాక్సులను రూపొందించగా అమర్చే పనులు తుదిదశకు చేరాయి. హరిహరక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శివాలయంలో శైవాగమ సంప్రదాయరీతిలో దర్శన క్యూలైన్లను, ముఖమండపానికి ఇత్తడి గ్రిల్స్‌, ఆలయాల ద్వారాలకు ఇత్తడి తొడుగుల పనులు కొనసాగుతున్నాయి. 


యాలీ పిల్లర్లపై శంకు, చక్ర, తిరునామాలు 

యాదాద్రికి వచ్చిన భక్తులు నడకదారిన మొక్కులు చెల్లించుకునేందుకు వైకుంఠగాలి గోపురం నుంచి కొండపైకి చేరుకుంటారు. నడక దారి ప్రాంతానికి ఆధ్మాత్మిక హంగులను అద్దుతూ యాలీ పిల్లర్లపై శంకు, చక్ర, తిరునామాలతో నారసింహ విగ్రహాలతో స్వాగత తోరణం నిర్మించారు. ఈ స్వాగత తోరణం ముందుగల 25 మీటర్ల వ్యాసంలోని రింగు సర్కిల్‌ను తామర పువ్వు ఆకృతిలో గ్రీనరీని అభివృద్ధిచేసి సీజనల్‌ పూల మొక్కలను నాటారు. ఈ రింగు సర్కిల్‌లో బంతి, చామంతి, పిటోనియా వంటి పుష్ప జాతికి చెందిన మొక్కలతో తీర్చిదిద్దారు. అదేవిధంగా వైకుంఠద్వారం చెంత మెట్ల మార్గానికి ఇరువైపులా పచ్చదనంతో తీర్చిదిద్దనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

 

తుది దశకు విష్ణు పుష్కరిణి పునర్నిర్మాణం

యాదాద్రిక్షేత్రంలో విష్ణు పుష్కరిణి పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మహిమాన్విత పుణ్యజలాలు కేవలం స్వామివారి నిత్య కైంకర్యాలకు మాత్రమే వినియోగించాలని వైటీడీఏ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో భక్తుల పుణ్యస్నానా ల కోసం కొండకింద గండి చెరువు సమీపంలో లక్ష్మీ పుష్కరిణిని ఏర్పాటు చేస్తున్నారు. కొండపైన విష్ణు పుష్కరిణిని సుమారు రూ.11 కోట్లతో పునర్నిర్మాణం చేస్తున్నారు. పుష్కరిణికి నాలు గు వైపులా కృష్ణరాతి శిలలతో మెట్లు, పుష్కరిణి మధ్యలో 3 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో తెప్పోత్సవ మండపాన్ని నిర్మించారు. ఈ తెప్పోత్సవ మండపం పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించారు. పుష్కరిణి జలాలు ఎప్పటికప్పుడు శుద్ధి చేసేందుకు ఈశాన్య దిశలో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను నిర్మించారు. ఆలయ ఉద్ఘాటన సమయం సమీపిస్తుండటంతో విష్ణుపుష్కరిణి అభివృద్ధి పనులను అధికారులు వేగిరం చేశారు. విష్ణుపుష్కరిణి ప్రహరీపై అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన బటర్‌ఫ్లై విద్యుద్దీపాలను అమర్చారు. పురాణ ప్రాశస్త్యం కల విష్ణు పుష్కరిణి (విష్ణుకుండము) ప్రహరీపై విద్యుద్దీపాలంకరణ పనులు ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా చేపడుతున్నారు. పుష్కరిణి ప్రహరీపై సుమారు 16 అధునాతన విద్యుద్దీపాలను అమర్చనున్నారు. ఈ ఎల్‌ఈడీ విద్యుదీపాలను లోహపు దిమ్మెలో రూపొందించారు. పాంచరాత్రాగమ శాస్త్రాన్ని తెలియజేసే విధంగా శంకు, చక్ర, తిరునామాలను పొందుపరిచారు. ఆలయ ఉద్ఘాటన అనంతరం విష్ణు పుష్కరిణి పుణ్య జలాలను స్వామివారి నిత్యకైంకర్యాలకు మాత్రమే వినియోగించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

Advertisement
Advertisement