Abn logo
Aug 15 2020 @ 04:25AM

మంచిని పాటించడమే ఆధ్యాత్మికత

ఆధ్యాత్మికత అంటే అది కేవలం భక్తి అనో, మతానికి సంబంధించిన అంశమనో చాలా మంది అనుకుంటారు. లేదా.. అది జీవితం చివరిదశలో అవసరమైన విషయంగా భావిస్తారు. కానీ, మానవ జీవన విధానాన్ని ఒక ఉత్తమమైన మార్గంలో నడిపే మార్గదర్శే ఆధ్యాత్మికత అని తెలుసుకోలేరు. ఆధ్యాత్మికత అంటే ముక్కు మూసుకుని జపం చేసుకోవడమో.. మనసు నిండా కోరికలతో పూజలు, జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు చేయడమో కాదు. అది ఒక జీవన విధానం. పెద్దలను గౌరవించడం, తోటివారికి చేతనైనంత సాయం చేయడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, మనకన్నా బలహీనులను హింసించకుండా ఉండడం.. ఇదంతా ఆధ్యాత్మికతే. ప్రపంచంలో చాలా దేశాలు సాంకేతికత విషయంలో, ఇతరత్రా కొన్ని విషయాల్లో మనదేశం కంటే బాగా ముందు ఉన్నప్పటికీ.. భారతీయ జీవనవిధానానికి, మన సంస్కృతికి అబ్బురపడతాయి. చేతులెత్తి మొక్కుతాయి.


చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానందుడి ద్వారా మన ఆధ్యాత్మిక జీవనవిధానం గురించి తెలుసుకున్న ఎందరో పాశ్చాత్యులు ఆ తర్వాతికాలంలో భారతదేశానికి వచ్చి ఇక్కడి సంస్కృతీసంప్రదాయాల గురించి తెలుసుకున్నారు. దీనికి కారణం మనకున్న గొప్ప ఆధ్యాత్మిక సంపద. ప్రపంచంలో చాలా దేశాలకు లేని అరుదైన ఆధ్యాత్మిక సంపద భారతదేశానికి ఉంది. నాలుగు వేదాలు, అష్టాదశ పురాణాలు, పది ముఖ్యమైన ఉపనిషత్తులు, మూడు గొప్ప ఇతిహాసాలు, పురణాలు.. ఇలా మన ఆధ్యాత్మిక సంపద ఎంతో గొప్పది, విభిన్నమైనది. సృష్టి అంతా నిండి ఉన్న చైతన్యం ఒక్కటేనని.. ఆ చైతన్యమే పరమాత్మ అని మన సంస్కృతి చెబుతుంది. అందుకే సృష్టిలో ప్రతిదీ మనకు పూజనీయమే. ఉదాహరణకు.. మన జీవన విధానంలో భూమాత మనకు అనేక విధాలుగా సాయపడుతుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకూ సౌకర్యవంతంగా, సుఖంగా జీవించడానికి అవసరమైన వనరులను ఎన్నింటినో పుడమితల్లి అందిస్తుంది. అందుకే మనం భూమిని దేవతగా గౌరవిస్తాం. పూజిస్తాం. అలాగే.. ప్రాణాధారమైన నీటిని, గాలిని.. ఇలా పంచభూతాలనూ దైవాలుగా భావించి కొలుస్తాం. అలాగే.. ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను మాతృదేవో భవ, పితృదేవో భవ అని గౌరవిస్తాం. మన బలాలను, బలహీనతలను గుర్తించి.. మన అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని పంచి, మన భవిష్యత్తు కోసం చక్కటి బాట వేసే గురువులను.. ఆచార్యదేవో భవ అని గౌరవిస్తాం. ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించడమే కాక.. వారిని కూడా దైవాలుగా భావించే అపురూపమైన సంస్కృతి మనది.


మన జీవన విధానానికి అవసరమైన ప్రతి ఒక్కటీ ప్రకృతి ఒడి నుంచి లభించేదే. అందుకే ప్రకృతిని కూడా దైవంలా భావిస్తాం. ఇలా పుట్టినప్పటి నుంచి మరణించేవరకూ షోడశ సంస్కరణల ద్వారా మనకు రుజువర్తనను అలవడేలా చేసింది మన భారతదేశానికి ఉన్న గొప్ప ఆధ్యాత్మిక సంపదే. ఇలా నిత్యజీవితంలో మనం ఆచరించే మంచి అంతా ఆధ్యాత్మికత కిందకే వస్తుంది. చిన్నప్పటి నుంచే పిల్లలకు రామాయణ, మహాభారత, భాగవతాల్లోని ఘట్టాలను వినిపించడం ద్వారా.. పెద్దల నుంచి నేర్చుకున్న సంస్కారాన్ని మన పిల్లలకు నేర్పడం ద్వారా మనకున్న గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం. భవిష్యత్‌ తరాలు కూడా  మన ఆధ్యాత్మిక సంపద విలువ తెలుసుకుని, ఆచరణలో పెట్టి ఆ వారసత్వాన్ని కొనసాగించాలని ఆశిద్దాం.


- నోముల చంద్రశేఖర్‌, 9866669859

Advertisement
Advertisement
Advertisement