Advertisement
Advertisement
Abn logo
Advertisement

దస్‌ కా దమ్‌

ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లతో ఎజాజ్‌ రికార్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 325  జూ న్యూజిలాండ్‌ 62 ఆలౌట్‌

వణికించిన అశ్విన్‌, సిరాజ్‌ జూ కోహ్లీసేన ప్రస్తుత ఆధిక్యం 332


అద్భుతం.. అపూర్వం.. అద్వితీయం. క్రికెట్‌లో ఎన్నో రికార్డులను చూస్తూనే ఉంటాం. కానీ శనివారం వాంఖడే మైదానంలో కివీస్‌ స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ ప్రదర్శించిన మాయాజాలం నేటి తరాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేదే. ఎందుకంటే 144 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇలాంటి ఫీట్‌ మూడో సారి మాత్రమే ఆవిష్కృతమైందంటేనే ఇది ఎలాంటి అరుదైన ఘనతో అర్థమవుతుంది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో క్రీజులోకొచ్చిన ప్రతీ బ్యాటర్‌ను అంటే అక్షరాలా 10 మందినీ అతనే పెవిలియన్‌ చేర్చాడు. 1999లో చివరిసారిగా కుంబ్లే పాక్‌పై ఇలాంటి ఘనతే సాధించాడు. అయితే ఎజాజ్‌ ఆనందాన్ని ఆవిరి చేస్తూ కివీస్‌ బ్యాటర్స్‌ చెత్త ప్రదర్శనతో.. 62 పరుగులకే కుప్పకూలారు. దీంతో భారీ ఆధిక్యంలో ఉన్న భారత్‌ రెండో రోజే మ్యాచ్‌ ఫలితం ఎలా ఉండబోతోందో చాటి చెప్పింది.


ముంబై: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ శాసించే స్థితిలో నిలిచింది. అయితే శనివారం ఆటలో అత్యంత నాటకీయ మలుపులు చోటుచేసుకున్నాయి. ముందుగా కివీస్‌ స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ (10/119) భారత్‌ వికెట్లన్నింటినీ తనే నేలకూల్చడంతో తొలి ఇన్నింగ్స్‌లో 109.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (311 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 150) భారీ సెంచరీ, అక్షర్‌ పటేల్‌ (128 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 52) అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన కివీ్‌సను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. స్పిన్నర్‌ అశ్విన్‌ (8-4-8-4) అత్యంత పొదుపైన బౌలింగ్‌తో దెబ్బతీయగా.. పేసర్‌ సిరాజ్‌ (3/19), అక్షర్‌ (2/14) సహకరించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు 28.1 ఓవర్లలో 62 పరుగులకే కుప్పకూలింది. 263 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించినప్పటికీ భారత జట్టు కివీ్‌సను ఫాలోఆన్‌ ఆడించలేదు. రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగి రోజు ముగిసే సమయానికి 21 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 69 పరుగులు సాధించింది. క్రీజులో మయాంక్‌ (38 బ్యాటింగ్‌), పుజార (29 బ్యాటింగ్‌) ఉన్నారు. మరో ఓపెనర్‌ గిల్‌ చేతి వేలికి గాయమైంది. ప్రసుతం భారత్‌ 332 పరుగుల భారీ ఆధిక్యంలో ఉన్న స్థితిలో ఇక ఈ టెస్టులో గెలవడం కివీ్‌సకు అసంభవమే.


ఎజాజ్‌ ఒక్కడే..

221/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో భారత్‌ రెండో రోజు ఆటను ప్రారంభించగా.. స్నిన్నర్‌ ఎజాజ్‌ మాత్రం కుదురుకోనీయలేదు. మిగిలిన ఆరు వికెట్లనూ పడగొట్టి పర్‌ఫెక్ట్‌ టెన్‌ సాధించాడు. మయాంక్‌, అక్షర్‌ పటేల్‌ మాత్రమే కాస్త ప్రతిఘటించగలిగారు. ఆరంభంలోనే సాహా (27), అశ్విన్‌ (0)లను వరుస బంతుల్లో తను అవుట్‌ చేశాడు. ఈ దశలో అక్షర్‌తో కలిసి మయాంక్‌ జట్టు స్కోరును పెంచాడు. ఏడో వికెట్‌కు వీరు 67 పరుగులు జోడించారు. ఈ క్రమంలో అక్షర్‌ టెస్టుల్లో తొలి అర్ధసెంచరీని కూడా సాధించాడు. అయితే రెండో సెషన్‌లో కాసేపటికే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. సరిగ్గా 150 పరుగులు చేశాక మయాంక్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో అతడి సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ముగిసినట్టయింది. ఇక ఆ తర్వాత అక్షర్‌ను కూడా ఎజాజ్‌ అవుట్‌ చేయడంతో మిగిలిన వికెట్లను పడగొట్టడం అతడికి ఏమాత్రం కష్టం కాలేదు.


సిరాజ్‌ తొలి దెబ్బ

ఎజాజ్‌ రికార్డు బౌలింగ్‌తో పాటు భారత్‌ను ఆలౌట్‌ చేశామనే ఆనందంతో తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన కివీ్‌సకు వరుసగా షాకులు తగిలాయి. కేవలం రెండు గంటల్లోనే అంతా పెవిలియన్‌కు చేరారు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై పేసర్‌ సిరాజ్‌ టాపార్డర్‌లో యంగ్‌ (4), లాథమ్‌ (10), టేలర్‌ (1) వికెట్లను తీయడంతో పతనం ఆరంభమైంది. ఇందులో రాస్‌ టేలర్‌ (1)ను కళ్లుచెదిరే రిప్పర్‌ బంతితో క్లీన్‌బౌల్డ్‌ చేసిన తీరు ఆకట్టుకుంది. అప్పటికి స్కోరు 17 పరుగులే. ఇక ఆ తర్వాత స్పిన్నర్‌ అశ్విన్‌ మిగతా బ్యాటర్స్‌ పనిబట్టడంతో కివీస్‌ చావుదెబ్బ తిన్నది. టీ బ్రేక్‌ సమయానికి 38/6 స్కోరుతో దయనీయస్థితిలో పడింది. టెయిలెండర్లు ఇలా వచ్చి అలా వెళ్లడంతోనే సరిపోయింది. జేమిసన్‌ (17) ఒక్కడే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.


భారత్‌లో జరిగిన టెస్టుల్లో అత్యల్ప స్కోరు (62) నమోదు చేసిన తొలి జట్టుగా కివీస్‌. అలాగే భారత్‌-కివీ్‌స మధ్య జరిగిన టెస్టుల్లోనూ ఇదే లోయెస్ట్‌. అటు వాంఖడే మైదానంలో ఓ టెస్టు జట్టు అత్యల్ప స్కోరు కూడా ఇదే.


స్కోరుబోర్డు


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) బ్లండెల్‌ (బి) ఎజాజ్‌ 150; గిల్‌ (సి) టేలర్‌ (బి) ఎజాజ్‌ 44; పుజార (బి) ఎజాజ్‌ 0; కోహ్లీ (ఎల్బీ) ఎజాజ్‌ 0; శ్రేయాస్‌ (సి) బ్లండెల్‌ (బి) ఎజాజ్‌ 18; సాహా (ఎల్బీ) ఎజాజ్‌ 27; అశ్విన్‌ (బి) ఎజాజ్‌ 0; అక్షర్‌ (ఎల్బీ) ఎజాజ్‌ 52; జయంత్‌ (సి) రచిన్‌ (బి) ఎజాజ్‌ 12; ఉమేశ్‌ (నాటౌట్‌) 0; సిరాజ్‌ (సి) రచిన్‌ (బి) ఎజాజ్‌ 4; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 109.5 ఓవర్లలో 325 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-80, 2-80, 3-80, 4-160, 5-224, 6-224, 7-291, 8-316, 9-321, 10-325. బౌలింగ్‌: సౌథీ 22-6-43-0; జేమిసన్‌ 12-3-36-0; ఎజాజ్‌ 47.5-12-119-10; సోమర్‌విల్లే 19-0-80-0; రచిన్‌ 4-0-20-0; మిచెల్‌ 5-3-9-0.


న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (సి) శ్రేయాస్‌ (బి) సిరాజ్‌ 10; యంగ్‌ (సి) కోహ్లీ (బి) సిరాజ్‌ 4; మిచెల్‌ (ఎల్బీ) అక్షర్‌ 8; టేలర్‌ (బి) సిరాజ్‌ 1; నికోల్స్‌ (బి) అశ్విన్‌ 7; బ్లండెల్‌ (సి) పుజార (బి) అశ్విన్‌ 8; రచిన్‌ (సి) కోహ్లీ (బి) జయంత్‌ 4; జేమిసన్‌ (సి) శ్రేయాస్‌ (బి) అక్షర్‌ 17; సౌథీ (సి సబ్‌) సూర్యకుమార్‌ (బి) అశ్విన్‌ 0; సోమర్‌విల్లే (సి) సిరాజ్‌ (బి) అశ్విన్‌ 0; ఎజాజ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 28.1 ఓవర్లలో 62 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-10, 2-15, 3-17, 4-27, 5-31, 6-38, 7-53, 8-53, 9-62, 10-62. బౌలింగ్‌: ఉమేశ్‌ 5-2-7-0; సిరాజ్‌ 4-0-19-3; అక్షర్‌ 9.1-3-14-2; అశ్విన్‌ 8-2-8-4; జయంత్‌ 2-0-13-1. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మయాంక్‌ (బ్యాటింగ్‌) 38; పుజార (బ్యాటింగ్‌) 29; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 21 ఓవర్లలో 69/0. బౌలింగ్‌: సౌథీ 5-0-14-0; ఎజాజ్‌ 9-1-35-0; జేమిసన్‌ 4-2-5-0; సోమర్‌విల్లే 2-0-9-0; రచిన్‌ 1-0-4-0.


పర్‌ఫెక్ట్‌ 10 క్లబ్‌లోకి ఎజాజ్‌కు స్వాగతం. టెస్ట్‌ మ్యాచ్‌ ఒకటి, రెండు రోజుల్లో ఈ ఘనత అందుకోవడం ఎంతో ప్రత్యేకం.    - అనిల్‌ కుంబ్లే


ఒక జట్టులోని అన్ని వికెట్లను పడగొట్టడం ఎంతో కష్టం. వెల్‌డన్‌ పటేల్‌. -రవిశాస్త్రి

కివీస్‌ బౌలర్‌ ఈ గొప్ప ఘనత సాధించడం అమోఘం. -సైమన్‌ డౌల్‌


ఓ ఇన్నింగ్స్‌లో పది వికెట్లు సాధించడం.. అది కూడా పుట్టిన గడ్డపైనే కావడం అద్భుతం - వీవీఎస్‌ లక్ష్మణ్‌

Advertisement
Advertisement