ముచ్చటగా మూడు

ABN , First Publish Date - 2021-03-23T08:58:49+05:30 IST

ముచ్చటగా మూడు

ముచ్చటగా మూడు

మిక్స్‌డ్‌లో రెండు స్వర్ణాలు

పురుషుల స్కీట్‌లో మరో పసిడి

ప్రపంచకప్‌ షూటింగ్‌లో మనోళ్ల హవా


న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌లో భారత టీనేజ్‌ షూటర్ల హవా కొనసాగుతోంది. సోమవారంనాడు 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌, ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగాల్లో వారు రెండు స్వర్ణ పతకాలు కొల్లగొట్టారు. ఇక పురుషుల స్కీట్‌ టీమ్‌ కేటగిరీలోనూ మన షూటర్లు మరో పసిడి పతకంతో మెరిశారు. ఈ మూడు స్వర్ణాలతో కలిపి చాంపియన్‌షి్‌పలో భారత్‌ సాధించిన పసిడి పతకాల సంఖ్య ఆరుకు చేరింది. అలాగే నాలుగేసి రజత, కాంస్యాలతో మొత్తం 14 పతకాలతో పట్టికలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా మూడు స్వర్ణ, రెండు రజత, ఒక కాంస్య పతకంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో 18 ఏళ్ల సౌరబ్‌ చౌధురి, 19 ఏళ్ల మను భాకర్‌ 16-12 స్కోరుతో ఇరాన్‌ ద్వయం సెభాతొల్లాయ్‌, జావెద్‌ ఫొరౌఘీని ఓడించింది. భారత జోడీకి ఇది మిక్స్‌డ్‌ టీమ్‌లో ఐదో ప్రపంచకప్‌ పసిడి పతకం. ఇదే విభాగంలో యశస్వినీసింగ్‌, అభిషేక్‌ వర్మ జోడీ టర్కీకి చెందిన సెవల్‌, ఇస్మాయిల్‌ ద్వయాన్ని 17-13 స్కోరుతో చిత్తుచేసి కాంస్య పతకం సొంతం చేసుకుంది.


వరల్డ్‌ నెం.1 జోడీకి భారత్‌ షాక్‌: ఉదయం జరిగిన 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో భారత ద్వయం దివ్యాన్ష్‌ సింగ్‌ పన్వర్‌, ఎలావెనిల్‌ వలారివన్‌ 16-10 స్కోరుతో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ హంగేరీ జంట ఇస్ట్‌వాన్‌ పెనీ, ఇస్టర్‌ డెని్‌సకు షాకిచ్చి బంగారు పతకం చేజిక్కించుకుంది. అమెరికా జోడీ కాంస్య పతకం నెగ్గింది. సాయంత్రం జరిగిన  పోటీలో పురుషుల స్కీట్‌ టీం ఈవెంట్‌లో గుర్‌జోత్‌, మైరాజ్‌ అహ్మద్‌, అంగద్‌ వీర్‌సింగ్‌తో కూడిన భారత త్రయం ఖతార్‌ జట్టును 6-2తో చిత్తుచేసి బంగారు పతకం అందుకున్నది. మహిళల స్కీట్‌ టీం ఫైనల్లో పరినాజ్‌ ధలీవాల్‌, కార్తికీసింగ్‌ షకావత్‌, గనెమత్‌ సెఖాన్‌ల భారత జట్టు కజకిస్థాన్‌ చేతిలో ఓడి రజత పతకానికి పరిమితమైంది. 

Updated Date - 2021-03-23T08:58:49+05:30 IST