Abn logo
Apr 1 2021 @ 00:45AM

అక్కరకు రాని కోచ్‌లు

  • దీర్ఘకాలంగా పెండింగ్‌లోనే క్రమబద్ధీకరణ ఫైల్‌ 
  • పట్టించుకోని  చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): క్రీడారంగానికి వెన్నుముకగా నిలిచే కోచింగ్‌ వ్యవస్థ రాష్ట్రంలో అస్తవ్యస్థంగా మారింది. క్రీడా ప్రాథికార సంస్థంటే భవిష్యత్‌లో పరిపాలన సంబంధిత అధికారులు తప్ప కోచ్‌లు కనిపించరేమోననే అనుమానం కలుగుతోంది. ‘రాష్ట్రాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా చేస్తాం.. స్పోర్ట్స్‌ సిటీ నిర్మిస్తాం.. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్‌ పాలసీని రూపొందిస్తాం’ అని ఆర్భాట ప్రకటనలు చేసే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. 1993, 1999, 2009 తర్వాత నోటిఫికేషన్‌ ద్వారా కొత్త కోచ్‌లను తీసుకున్న దాఖలాలు లేవు. 


కోచ్‌లంటే చిన్నచూపు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1989 వరకు నోటిఫికేషన్‌ ద్వారా తీసుకున్న కోచ్‌లను మూడేళ్ల సర్వీస్‌ అనంతరం వారి పనితీరు ఆధారంగా క్రమబద్ధీకరించే వారు. ఆ తర్వాత మాత్రం యాక్ట్‌-2, జీఓ-212 తాజాగా యాక్ట్‌-4 ఒప్పంద కోచ్‌ల సర్వీస్‌ క్రమబద్ధీకరణకు ప్రతిబంధకంగా ఉన్నాయని దశాబ్దాలుగా వీరి ఫైల్‌ను మరుగునపడేశారు. ఎలాంటి ప్రభుత్వ నోటిఫికేషన్‌ లేకుండా తాత్కాలికంగా తీసుకున్న క్లరికల్‌, క్లాస్‌-4కు చెందిన దాదాపు 40 మంది ఉద్యోగుల సర్వీ్‌సను 1998లో క్రమబద్ధీకరించినప్పుడు అడ్డం రాని జీఓలు నోటిఫికేషన్‌ ద్వారా విధుల్లో చేరిన కోచ్‌లకు మాత్రమే ఎలా అవరోధంగా మారాయని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో జరిగిన స్పోర్ట్స్‌ అథారిటీ 55వ పాలకమండలి సమావేశంలో 76 మంది గ్రేడ్‌-3 కోచ్‌లు అవసరమని గుర్తించారు. ఆ లెక్కల ప్రకారం రాష్ట్ర విభజననాంతరం తెలంగాణలో అధికారికంగా 37 కోచ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1993, 1999 బ్యాచ్‌లకు చెందిన కోచ్‌ల్లో ప్రస్తుతం 15 మంది మాత్రమే ఇంకా ఒప్పంద కోచ్‌లుగా విధులు నిర్వహిస్తున్నారు. వారిని క్రమబద్ధీకరించినా మరో 22 పోస్టులు మిగులుతాయి. ప్రస్తుత అవసరాల దృష్ట్యా చూస్తే దాదాపు మరో 200 మంది కోచ్‌లు అవసరముంది. 2009లో ఔట్‌సోర్సింగ్‌ ద్వారా వివిధ రకాల అపాయింట్‌మెంట్‌లతో తీసుకున్న కోచ్‌లను అర్హత బట్టి క్రమబద్ధీకరించే అవకాశమున్నా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. దీనికి స్పోర్ట్స్‌ అథారిటీలోని కొందరు ఉద్యోగులు ప్రభుత్వ పెద్దలకు ఇస్తున్న తప్పుడు నివేదికలే కారణమని తెలుస్తోంది.  పాలకమండలి ఏదీ?

నైపుణ్యం గల కోచ్‌ల లేమితో రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధి కుంటుపడింది. కరీంనగర్‌ స్పోర్ట్స్‌  స్కూల్‌లో 280 మంది పిల్లలకు ఉన్నది ఇద్దరే కోచ్‌లు. ఆదిలాబాద్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో 200 మంది పిల్లలకు శిక్షణ ఇచ్చేది ఇద్దరే. రాష్ట్ర ఆవిర్భావం నుంచి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణకు పాలకమండలి లేదు. దీంతో శాట్స్‌ సమస్యలను చర్చించే వేదిక లేకుండా పోయింది. ఒప్పంద కోచ్‌లను క్రమబద్ధీకరించడం.. తాజా అంచనాల ప్రకారం కొత్త కోచ్‌లను నియమించడం వంటి నిర్ణయాలు తీసుకునే తీరిక శాట్స్‌ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డికి కానీ, ప్రస్తుత అధికార వర్గానికి లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కిందటి ఏడాది క్రీడారంగ సర్వతోముఖాభివృద్ధికి మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. సీఎం ప్రకటించినప్పుడు హడావుడిగా ఒక్కసారి భేటీ అయిన ఉపసంఘం తర్వాత ఇంతవరకు మళ్లీ సమావేశం కాలేదు. స్పోర్ట్స్‌ అథారిటీ గతంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు పాలకమండలిలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపేది. ఇప్పుడు పాలకమండలి ఊసే లేకపోగా కేబినెట్‌ ఉపసంఘం పేరిట కాలక్షేపం చేస్తున్నారని పలువురు క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే వర్ధమాన ఆటగాళ్లకు నష్టం చేసినవారవుతారని క్రీడాపండితులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement