కోచ్‌ల నిరసనతో హోరెత్తిన ఎల్బీ

ABN , First Publish Date - 2021-04-07T09:42:58+05:30 IST

ఉద్యోగాల క్రమబద్ధీకరణ విషయంలో రెండు దశాబ్దాలుగా అణిచివేతకు గురవుతున్న తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) కాంట్రాక్ట్‌ కోచ్‌లు నిరసనగళంతో కదంతొక్కారు...

కోచ్‌ల నిరసనతో హోరెత్తిన ఎల్బీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఉద్యోగాల క్రమబద్ధీకరణ విషయంలో రెండు దశాబ్దాలుగా అణిచివేతకు గురవుతున్న తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) కాంట్రాక్ట్‌ కోచ్‌లు నిరసనగళంతో కదంతొక్కారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలోని శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి కార్యాలయం ముందు వంద మందికిపైగా కోచ్‌లు బైఠాయించి తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఆందోళన నిర్వహించారు. నిరసన క్రమంలో అప్పటివరకు పెద్దఎత్తున నినాదాలు చేసిన తెలంగాణ కాంట్రాక్ట్‌ కోచ్‌ల సంఘం అధ్యక్షురాలు సత్యవాణి సొమ్మసిల్లి పడిపోవడంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కోచ్‌ల ఆందోళన మరింత ఉధృతమవడంతో రవీంద్రభారతిలోని వైఏటీసీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరాజు కార్యాలయంలో వెంకటేశ్వర్‌ రెడ్డి, శాట్స్‌ ఏఓ సుజాత కలిసి వారితో చర్చలు జరిపారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ చర్చల్లో రెండు దశాబ్దాలకు పైగా కోచ్‌లకు జరుగుతున్న అన్యాయం.. 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కోచ్‌ల క్రమబద్ధీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు.. సంబంధం లేని జీఓలను అడ్డంకిగా చూపిస్తూ కొందరు అధికారులు ఇన్నాళ్లూ తాత్సారం చేసిన వైనాన్ని ఈ సమావేశంలో కోచ్‌లు ఎండగట్టారు. వీటన్నింటిని సావధానంగా విన్న వెంకటేశ్వర్‌ రెడ్డి, శ్రీనివాసరాజు సమస్యను క్రీడా మంత్రి దృష్టికి తీసుకెళ్లి రెండు వారాల్లో పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక, త్వరలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ పెద్దలు, రాష్ట్ర క్రీడా సంఘాలు, క్రీడాకారులతో కలిసి రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు కాంట్రాక్ట్‌ కోచ్‌ల సంఘం తెలిపింది.


Updated Date - 2021-04-07T09:42:58+05:30 IST