పేస్‌కు దాసోహం..

ABN , First Publish Date - 2021-03-13T09:01:02+05:30 IST

పేస్‌కు దాసోహం..

పేస్‌కు దాసోహం..

తొలి టీ20లో భారత్‌ ఓటమి జూ చెలరేగిన ఇంగ్లండ్‌ సీమర్లు  జూ ఆర్చర్‌కు మూడు వికెట్లు


అత్యంత ఆసక్తి రేపిన ఐదు టీ20ల సిరీ్‌సను భారత జట్టు పేలవంగా ఆరంభించింది. ఇటు బ్యాటింగ్‌.. అటు బౌలింగ్‌ రెండింట్లోనూ విఫలమైంది. నిర్లక్ష్యపు షాట్లకు తోడు ఇంగ్లండ్‌కు చెందిన ఐదుగురు పేసర్ల క్రమశిక్షణాయుత బంతులకు టీమిండియా దగ్గర సమాధానమే లేకపోయింది. అదనపు బౌన్స్‌తో పాటు దాదాపు 150కి.మీ వేగంతో వచ్చిన బంతులను ఎదుర్కోలేక చతికిలపడ్డారు. ఫలితంగా మోత మోగిస్తారనుకున్న చోట బ్యాట్లెత్తేశారు. శ్రేయాస్‌ అర్ధ సెంచరీతో కాస్త పరువు కాపాడాడు. ఆ తర్వాత  పర్యాటక జట్టు 15.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. 


 అహ్మదాబాద్‌: ఐదు టీ20ల సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు ఝలక్‌ తగిలింది. అన్ని విభాగాల్లోనూ నిరాశపర్చిన భారత జట్టు మూల్యం చెల్లించుకుంది. ఫలితంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అటు మోర్గాన్‌ సేన మాత్రం పక్కా వ్యూహంతో బరిలోకి దిగి సిరీ్‌సలో 1-0 ఆధిక్యం సాధించింది. ఆదివారం ఇదే మైదానంలో రెండో మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులు చేసింది. మిడిలార్డర్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ (48 బంతుల్లో 8 ఫోర్లతో 1 సిక్స్‌తో 67) అర్ధసెంచరీ చేయగా పంత్‌ (21), పాండ్యా (19) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. ఆర్చర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్‌ ఇంకా 27 బంతులుండగానే 2 వికెట్లు కోల్పోయి 130 రన్స్‌ చేసి గెలిచింది. రాయ్‌ (49), బట్లర్‌ (28) బెయిర్‌స్టో (25 నాటౌట్‌) రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఆర్చర్‌ నిలిచాడు.

సునాయాసంగా ఆడేశారు..: ఓ మాదిరి లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ అవలీలగా ఛేదించింది. ఓపెనర్లు రాయ్‌, బట్లర్‌ను భారత బౌలర్లు ఏమాత్రం ఇబ్బందిపెట్టలేకపోయారు. ముఖ్యంగా వీరు స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకున్నారు. చాహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే రాయ్‌ 6,4 బాదగా అటు అక్షర్‌ బౌలింగ్‌లో బట్లర్‌ వరుసగా 4,6తో సత్తా చాటాడు. దీంతో పవర్‌ప్లేలోనే జట్టు 50 పరుగులు పూర్తి చేసింది. అయితే వీరి ధాటికి ఎనిమిదో ఓవర్‌లో బ్రేక్‌ పడింది. చాహల్‌ వేసిన ఈ ఓవర్‌లో రాయ్‌ 4,6తో జోరు చూపినా ఆరో బంతికి బట్లర్‌ వికెట్‌ కోల్పోయింది. అప్పటికే తొలి వికెట్‌కు 72 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత 11వ ఓవర్‌లో సుందర్‌ తొలి బంతికే రాయ్‌ను ఎల్బీగా అవుట్‌ చేశాడు. అయితే మలాన్‌ (24 నాటౌట్‌) బంతికో పరుగు చొప్పున సాధించినా బెయిర్‌స్టో మాత్రం 13వ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. టెస్టుల్లో విఫలమైన అతడు ఇక్కడ మాత్రం తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక, మలాన్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 


వికెట్లు టపటపా: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభం నుంచే షాక్‌లు తగిలాయి. శ్రేయాస్‌ అయ్యర్‌ మినహా ఎవరూ ఆధిపత్యం చూపలేకపోయారు. అటు ఇంగ్లండ్‌ పేసర్లు అదనపు బౌన్స్‌తో పాటు పదునైన బంతులతో ఇబ్బందిపెట్టారు. రెండో ఓవర్‌ నుంచే వికెట్ల వేట సాగింది. ఆర్చర్‌ వేసిన ఈ ఓవర్‌లో బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని మిడిల్‌ స్టంప్‌ను పడగొట్టడంతో రాహుల్‌ (1) అవుటయ్యాడు. మరుసటి ఓవర్‌లోనే రషీద్‌ ఝలక్‌ ఇస్తూ కెప్టెన్‌ కోహ్లీని డకౌట్‌ చేశాడు. ఈ దశలో నాలుగో నెంబర్‌లో పంత్‌ను బరిలోకి దించగా తానెదుర్కొన్న మూడో బంతినే ఫోర్‌గా మలిచాడు. ఇక ఆర్చర్‌ ఓవర్‌లో రివర్స్‌ స్కూప్‌ ద్వారా బాదిన అతడి సిక్స్‌ హైలైట్‌గా నిలిచింది. కానీ మరోవైపు ధవన్‌ (4)ను పేసర్‌ మార్క్‌ వుడ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో 20/3 స్కోరుతో కష్టాల్లో పడింది. అటు పంత్‌ దూకుడు కూడా ఎక్కువ సేపు సాగలేదు. పదో ఓవర్‌లోనే అతణ్ణి స్టోక్స్‌ తన స్లో బాల్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. 


ఆదుకున్న శ్రేయాస్‌: పరిస్థితి ఇబ్బందికరంగా మారిన దశలో శ్రేయాస్‌ అయ్యర్‌ ఎలాంటి ఒత్తిడి లేకుండా జట్టును ఆదుకునే ప్రయ త్నం చేశాడు. కళాత్మక షాట్లతో ఆకట్టుకున్న అతడు చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ 36 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అతడికి హార్దిక్‌ పాండ్యా (19) సహకరిస్తూ 15వ ఓవర్‌లో వరుసగా 6,4 బాదాడు. అయితే డెత్‌ ఓవర్లలో ఇంగ్లండ్‌ మరింత కట్టడి చేసింది. 18వ ఓవర్‌లో పాండ్యా, శార్దూల్‌ (0)లను ఆర్చర్‌ వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. శ్రేయా్‌స-హార్దిక్‌ మధ్య ఐదో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. చివరి ఓవర్‌లో శ్రేయా్‌సను జోర్డాన్‌ అవుట్‌ చేయడంతో భారత్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.


ధవన్‌కు చోటిచ్చారు..

భారత ఓపెనర్లుగా రోహిత్‌ ఖాయమే.. మరో ఆటగాడెవరేది తేలాల్సి ఉందని ఇన్నాళ్లూ చర్చ సాగింది. మ్యాచ్‌కు ముందు రోజు కెప్టెన్‌ కోహ్లీ ఈ విషయంలో స్పష్టతనిస్తూ రాహుల్‌ ఆడతాడని, ధవన్‌ రిజర్వ్‌ ఓపెనర్‌ అని స్పష్టం చేశాడు. తీరా మ్యాచ్‌ ఆరంభమయ్యేసరికి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రోహిత్‌కు విశ్రాంతినివ్వగా ధవన్‌, రాహుల్‌ క్రీజులోకి వచ్చారు. అయితే వీరిద్దరూ విఫలం కావడం భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది.


స్కోరుబోర్డు

భారత్‌: రాహుల్‌ (బి) ఆర్చర్‌ 1; ధవన్‌ (బి) వుడ్‌ 4; కోహ్లీ (సి) జోర్డాన్‌ (బి) రషీద్‌ 0; పంత్‌ (సి) బెయిర్‌స్టో (బి) స్టోక్స్‌ 21; శ్రేయాస్‌ (సి) మలాన్‌ (బి) జోర్డాన్‌ 67; హార్దిక్‌ (బి) రషీద్‌ (బి) ఆర్చర్‌ 19; శార్దూల్‌ (సి) మలాన్‌ (బి) ఆర్చర్‌ 0; సుందర్‌ (నాటౌట్‌) 3; అక్షర్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు: 2; 20 ఓవర్లలో 124/7. వికెట్ల పతనం: 1-2, 2-3, 3-20, 4-48, 5-102, 6-102, 7-117. బౌలింగ్‌: రషీద్‌ 3-0-14-1; ఆర్చర్‌ 4-1-23-3; వుడ్‌ 4-0-20-1; జోర్డాన్‌ 4-0-27-1; స్టోక్స్‌ 3-0-25-1; సామ్‌ కర్రాన్‌ 2-0-15-0.

ఇంగ్లండ్‌: రాయ్‌ (ఎల్బీ) సుందర్‌ 49; బట్లర్‌ (ఎల్బీ) చాహల్‌ 28; మలాన్‌ (నాటౌట్‌) 24; బెయిర్‌స్టో (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 15.3 ఓవర్లలో 130/2. వికెట్ల పతనం: 1-72, 2-89. అక్షర్‌ 3-0-24-0; భువనేశ్వర్‌ 2-0-15-0; చాహల్‌ 4-0-44-1; శార్దూల్‌ 2-0-16-0; పాండ్యా 2-0-13-0; సుందర్‌ 2.3-0-18-1.

Read more