బాబోయ్‌..జైలు జీవితం!

ABN , First Publish Date - 2022-05-12T10:23:41+05:30 IST

బాబోయ్‌..జైలు జీవితం!

బాబోయ్‌..జైలు జీవితం!

బెంబేలెత్తుతున్న బెకర్‌


లండన్‌ : విమానాల్లో ఖరీదైన ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణం..విలాసవంతమైన హోటళ్లలో బస..ఇక సొంత ఇంట్లోనైతే అంతకుమించి రాజభోగాలు..ఇదీ టెన్నిస్‌ దిగ్గజం బోరిస్‌ బెకర్‌ ఒకనాటి జీవితం..కానీ ఓడలు బండ్లవుతాయన్నట్టు... ప్రస్తుతం బెకర్‌ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. దివాలా కేసులో దోషిగా తేలి ప్రస్తుతం లండన్‌లో రెండున్నరేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న బోరి్‌సకు..కారాగార జీవితం అత్యంత దుర్భరంగా ఉందట ! ముఖ్యంగా అక్కడి ఆహారం తినడం అతడివల్ల కావడంలేదట !! రెస్టారెంట్లలో పసందైన వంటకాలు భుజించడం బెకర్‌కు ఇష్టం. క్యూబా సిగార్లంటే ఈ వరల్డ్‌ మాజీ నెంబర్‌ వన్‌కు తెగ మక్కువ. అలాగే బార్లలో నాణ్యమైన వైన్‌ తాగే బెకర్‌కు ప్రస్తుతం జైలులో వారానికి లభిస్తున్న అలవెన్స్‌ కేవలం రూ. 956 ! ఆ డబ్బుతో చాక్లెట్లు, బిస్కెట్లు, అరటి పండ్లు కొనుక్కుని తింటున్నాడు. జైల్లో ఉన్న బెకర్‌ గురించి అతని సన్నిహితుడొకరు మాట్లాడుతూ... ‘జైలులో బెకర్‌ నానా ఇక్కట్లు పడుతున్నాడు. ముఖ్యంగా అక్కడి భోజనం అతడికి ఏమాత్రం సరిపడడంలేదు. జైలులో ఆహారం నాణ్యత ఇలా ఉంటుందా.. గదులు ఇంత చిన్నగా ఉంటాయా..అని బెకర్‌ విస్మయం వ్యక్తంచేస్తున్నాడు. అలాగే కిక్కిరిసిన ఖైదీలు, అపరిశుభ్ర పరిసరాలతో ఉన్న జైలును చూసి కంగుతిన్నాడు’ అని అన్నాడు. రాత్రి 8 గంటలకు గదికి తాళం వేస్తే..మళ్లీ తెల్లారి 7 గంటలకుగానీ తీయరని, పైగా తోటి ఖైదీల గోలతో అతడికి రాత్రుళ్లు అసలు నిద్రపట్టడంలేదని కూడా వెల్లడించాడు. 


కుటుంబం బాధ వర్ణనాతీతం..

భర్త జైలు జీవితం తమ కుటుంబంపై.. ముఖ్యంగా 12 ఏళ్ల్ల కుమారుడు అమాడియ్‌సపై ఎంతో ప్రభావం చూపుతోందని బెకర్‌ రెండో భార్య లిల్లీ బెకర్‌ తీవ్ర ఆవేదన చెందింది. కోర్టు విషయాల గురించి కుమారుడికి చెప్పలేదని..కానీ బెకర్‌ జైలుకు వెళ్లిన విషయాన్ని అమాడియ్‌సకు చెప్పక తప్పలేదని తెలిపింది. 

Read more