Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎజాజ్‌ లా జవాబ్‌!

ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం:


ఎజాజ్‌ పటేల్‌..స్పిన్‌కు సహకరించే వాంఖడే పిచ్‌పై సత్తా చాటుతాడని భావించారు కానీ ఇలా ఏకంగా భారత తొలి ఇన్నింగ్స్‌ వికెట్లన్నీ తన ఖాతాలో వేసుకుంటాడని అంచనా వేయలేదు. కానీ 33 ఏళ్ల ఈ కివీస్‌ స్పిన్నర్‌ అద్భుతం చేశాడు. 144 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో స్పిన్నర్లు జిమ్‌ లేకర్‌ (ఇంగ్లండ్‌), అనిల్‌ కుంబ్లే తర్వాత 10/10 సాధించిన మూడో బౌలర్‌గా రికార్డు పుటలకెక్కాడు. అంతేకాదు..దిగ్గజ పేసర్‌ సర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ (9/52)ని అధిగమించి సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన కివీస్‌ బౌలర్‌గానూ మరో రికార్డును అందుకున్నాడు. ఎజాజ్‌ క్రికెట్‌లో అడుగుపెట్టడం ఆసక్తికరమైతే..స్పిన్నర్‌గా మారడం అతడి కెరీర్‌ను మార్చి వేసింది. ముంబైకి చెందిన ఎజాజ్‌కు ఎనిమిదేళ్ల వయస్సులో.. అంటే 1996లో అతడి కుటుంబం న్యూజిలాండ్‌ తరలి వెళ్లింది. అక్కడి వాతావరణమే క్రికెట్‌పట్ల పటేల్‌ ఆకర్షితుడయ్యేలా చేసింది. ఐదడుగుల ఆరంగుళాల ఎజాజ్‌ 20 ఏళ్ల వయస్సులో పేసర్‌గా క్రికెట్‌లో అడుగుపెట్టాడు. కానీ అప్పటి న్యూజిలాండ్‌ అండర్‌-19 కోచ్‌ దీపక్‌ పటేల్‌ సలహాతో స్పిన్నర్‌గా మారిపోయాడు. తొలుత ఆక్లాండ్‌ ‘ఎ’ తరపున బరిలోకి దిగినా పెద్దగా రాణించలేకపోయాడు. ఆపై 2012లో సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ టీమ్‌ తరపున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేశాక ఎజాజ్‌ దశ తిరిగింది. దేశవాళీల్లో పదహారుసార్లు ఐదేసి వికెట్లు, ముసార్లు పది వికెట్లు పడగొట్టిన ఎజాజ్‌ ప్రతిభకు గుర్తింపుగా 2018లో కివీస్‌ జాతీయ జట్టుకు పిలుపు లభించింది. అప్పటికే స్పిన్నర్లుగా శాంట్నర్‌, ఇష్‌ సోధీల స్థానం జట్టులో సుస్థిరం. వారినుంచి గట్టి పోటీ ఎదుర్కొని తుది జట్టులో చోటు దక్కించుకున్న ఎజాజ్‌..ఇప్పుడు ఏకంగా పది వికెట్ల హాల్‌తో ఔరా అనిపించాడు.  


గ్రహాలు అనుకూలించాయి..

కల నిజమైంది. పదికి పది వికెట్లు  పడగొట్టడం కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం. నేను పుట్టిన గడ్డ ముంబైలో ఈ ఘనత అందుకొనేలా గ్రహాలు అనుగ్రహించాయి. కుంబ్లే  వంటి గొప్ప బౌలర్ల సరసన చేరడం గౌరవంగా భావిస్తున్నా.   - ఎజాజ్‌ పటేల్‌

Advertisement
Advertisement