ఇండియా ఓపెన్‌లో కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-01-14T09:18:09+05:30 IST

ఇండియా ఓపెన్‌లో కరోనా కలకలం

ఇండియా ఓపెన్‌లో  కరోనా కలకలం

శ్రీకాంత్‌ సహా ఏడుగురు షట్లర్లకు పాజిటివ్‌


న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌లో ఆడుతున్న ప్రపంచ మాజీ నెంబర్‌ వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ సహా ఏడుగురు భారత షట్లర్లకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. శ్రీకాంత్‌తో పాటు అశ్విని పొన్నప్ప, రితికా రాహుల్‌, ట్రీసా జాలీ, మిథున్‌ మంజునాథ్‌, సిమ్రాన్‌ అమన్‌ సింగీ, ఖుషీ గుప్తాకు పాజిటివ్‌గా తేలారు. వీరిలో పొన్నప్ప, రాహుల్‌, ట్రీసా, సిమ్రన్‌ డబుల్స్‌ షట్లర్లు కావడంతో వారి భాగస్వాములు కూడా టోర్నీ నుంచి తప్పుకొన్నట్టు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) తెలిపింది. 


డబుల్స్‌ క్రీడాకారిణిపై విమర్శలు: ఈ టోర్నీలో ఆడుతున్న హైదరాబాద్‌కు చెందిన ఒక యువ డబుల్స్‌ క్రీడాకారిణి భాగస్వామి వల్లే ఇంతమంది వైరస్‌ బారిన పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనెల 8న హైదరాబాద్‌లో సదరు క్రీడాకారిణికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా తేలింది. అయినా సరే ఆమె టోర్నీలో ఆడేందుకు ఢిల్లీ రావడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. హైదరాబాద్‌లో ఆ అమ్మాయి సాధన చేసే ఒక ప్రముఖ అకాడమీలోనే పలువురు స్టార్‌ ప్లేయర్లు కూడా టోర్నీ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్‌ చేశారని తెలుస్తోంది. కొవిడ్‌ పాజిటివ్‌ అని తెలిసినా ఆమె టోర్నీలో ఆడడానికి రావడం, ఈ విషయం బాయ్‌ ప్రధాన కార్యదర్శి అజయ్‌ సింఘానియాకు తెలియజేసినా ఆయన పట్టించుకోలేదని పలువురు షట్లర్ల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2022-01-14T09:18:09+05:30 IST