8 వికెట్లా.. 111 పరుగులా..?

ABN , First Publish Date - 2022-01-14T09:22:49+05:30 IST

8 వికెట్లా.. 111 పరుగులా..?

8 వికెట్లా.. 111 పరుగులా..?

ఆసక్తికరంగా మూడో టెస్టు

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 198 ఆలౌట్‌

రిషభ్‌ పంత్‌ శతకం

దక్షిణాఫ్రికా లక్ష్యం 212.. ప్రస్తుతం 101/2


కేప్‌టౌన్‌: చరిత్రాత్మక సిరీ్‌సను అందుకోవాలనే ఆశతో ఉన్న టీమిండియాకు ఈ టెస్టులోనూ గెలుపు సందేహమే. 212  పరుగుల సునాయాస లక్ష్య ఛేదనలో గురువారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 29.4 ఓవర్లలో 2 వికెట్లకు 101 పరుగులు చేసింది. క్రీజులో పీటర్సన్‌ (48 బ్యాటింగ్‌) ఉన్నాడు. కెప్టెన్‌ ఎల్గర్‌ (30) రాణించాడు. బుమ్రాకు రెండు వికెట్లు దక్కగా.. మరో 111 పరుగులు చేయాల్సిన స్థితిలో ఈ టెస్టు నాలుగో రోజే ముగియనుంది. అంతకుముందు భారత బ్యాటర్లు విఫలమైన వేళ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (139 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో 100 నాటౌట్‌) మాత్రం కెరీర్‌లో గుర్తుండిపోయే శతకం సాధించాడు. దీంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 67.3 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్‌ కాగా జట్టుకు 211 పరుగుల ఆధిక్యం లభించింది. కోహ్లీ (29), రాహుల్‌ (10) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. జాన్సెన్‌కు 4, ఎన్‌గిడి.. రబాడలకు మూడేసి వికెట్లు దక్కాయి.


పుజార, రహానె మరోసారి..: 57/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌కు ఆరంభంలోనే ఝలక్‌ తగిలింది. తొలి ఓవర్‌లో పుజార (9)ను షార్ట్‌పిచ్‌ బాల్‌తో జాన్సెన్‌ అవుట్‌ చేయగా.. మరుసటి ఓవర్‌లో రహానె (1) తన దారుణ ఫామ్‌ను కొనసాగిస్తూ రబాడ ఓవర్‌లో నిష్క్రమించాడు. ఇక, ఒక్క పరుగు తేడాతో రెండు వికెట్లు కోల్పోవడంతో కోహ్లీ-పంత్‌ జోడీ బాధ్యత తీసుకుంది. విరాట్‌ జాగ్రత్తతో బౌలర్ల సహనాన్ని పరీక్షించగా.. పంత్‌ స్వేచ్ఛగా ఆడాడు. అడపాదడపా ఫోర్లతో బంతికో పరుగు చొప్పున సాధిస్తూ వెళ్లాడు. లంచ్‌ బ్రేక్‌కు ముందు భారీ సిక్సర్‌తో అర్ధసెంచరీ సైతం పూర్తి చేసుకున్నాడు.


పంత్‌ ఎదురుదాడి: రెండో సెషన్‌లో పంత్‌ మరింత జోరుతో దూసుకెళ్లినా మరో ఎండ్‌లో టపటపా వికెట్లు పడుతుండడంతో అతడి శతకంపై ఉత్కంఠ నెలకొంది. సెషన్‌ ఆరంభంలోనే కేశవ్‌ ఓవర్‌లో పంత్‌ వరుసగా రెండు సిక్సర్లతో 15 పరుగులు సాధించాడు. కానీ ఈ దశలో ఎన్‌గిడి విజృంభించి మూడు వికెట్లు తీశాడు. 143 బంతులను ఓపిగ్గా ఎదుర్కొన్న కోహ్లీ మరోసారి ఆఫ్‌ స్టంప్‌ ఆవల బంతిని ఆడబోయి వికెట్‌ సమర్పించుకున్నాడు. దీంతో ఐదో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ వికెట్‌తో పాటు స్వల్ప వ్యవధిలోనే అశ్విన్‌ (7), శార్దూల్‌ (5)ను సైతం ఎన్‌గిడి పెవిలియన్‌కు చేర్చాడు. 7 వికెట్లు కోల్పోవడంతో అప్పటికి 77 రన్స్‌వద్ద ఉన్న పంత్‌ శతకం అయ్యేలా కనిపించలేదు. కానీ వ్యూహం మార్చిన అతడు స్ట్రయికింగ్‌ ఎక్కువగా తానే తీసుకున్నాడు. 58వ ఓవర్‌లో 6,4తో దాడి ఆరంభించాడు. మధ్యలో ఉమేశ్‌ (0), షమి (0) వికెట్లు కోల్పోగా పంత్‌ 88 దగ్గర ఉన్నప్పుడు బవుమా క్యాచ్‌ను వదిలేశాడు. చివర్లో బుమ్రా (2) వికెట్‌ను ఆసరా చేసుకుంటూ పంత్‌ అజేయ శతకాన్ని పూర్తి చేశాడు. జాన్సెన్‌ ఆఖరి వికెట్‌ తీయడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.


సాఫీగా సఫారీ ఇన్నింగ్స్‌: 212 పరుగుల ఛేదన కోసం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన సఫారీలు ఆఖరి సెషన్‌ను ఇబ్బంది లేకుండా ఆడారు. ఓపెనర్‌ మార్‌క్రమ్‌ (16)ను షమి త్వరగానే అవుట్‌ చేసినా కెప్టెన్‌ ఎల్గర్‌, పీటర్సన్‌ బౌలర్లను చక్కగా ఎదుర్కొంటూ బౌండరీలు బాదారు. ఫీల్డర్ల వైఫల్యంతోనూ అదనపు పరుగులు సమకూరాయి. చూస్తుండగానే స్కోరు వందకు చేరగా.. సెషన్‌ ఆఖరి ఓవర్‌లో ఎల్గర్‌ను బుమ్రా అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.


టీమిండియా అసహనం..

అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌లో కెప్టెన్‌ ఎల్గర్‌ ఎల్బీ అయినట్టు అంపైర్‌ ప్రకటించాడు. అయితే తను రివ్యూ కోరడంతో అక్కడ కూడా బంతి కచ్చితంగా మిడ్‌ వికెట్‌ను తాకుతుందనే అనిపించింది. కానీ బాల్‌ ట్రాకింగ్‌లో కనిపించిన దృశ్యాన్ని మాత్రం అంతా నమ్మలేనట్టుగా చూశారు. బంతి ఇన్‌లైన్‌లో పడి.. ఓవర్‌ ది స్టంప్‌ వెళుతున్నట్టుగా తేలడంతో కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్‌ ఎరాస్మస్‌ సైతం ఇది ఎలా సాధ్యం? అనే రీతిలో చూసినా చివరకు నాటౌట్‌గా ప్రకటించాడు. అసంతృప్తిని అణుచుకోలేని కోహ్లీ ఆ ఓవర్‌ ముగిశాక వికెట్‌ మైక్‌ దగ్గరికి వచ్చి ఏదో అనడం కనిపించింది. అలాగే పదకొండు మంది ఆటగాళ్లతో దేశం మొత్తం ఆడుతున్నట్టుందని రాహుల్‌ అనడం వినిపించింది.


స్కోరుబోర్డు



భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 223

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 210


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) జాన్సెన్‌ 10; మయాంక్‌ (సి) ఎల్గర్‌ (బి) రబాడ 7; పుజార (సి) పీటర్సన్‌ (బి) జాన్సెన్‌ 9; కోహ్లీ (సి) మార్‌క్రమ్‌ (బి) ఎన్‌గిడి 29; రహానె (సి) ఎల్గర్‌ (బి) రబాడ 1; పంత్‌ (నాటౌట్‌) 100; అశ్విన్‌ (సి) జాన్సెన్‌ (బి) ఎన్‌గిడి 7; శార్దూల్‌ (సి) వెర్రెన్‌ (బి) ఎన్‌గిడి 5; ఉమేశ్‌ (సి) వెర్రెన్‌ (బి) రబాడ 0; షమి (సి) డుస్సెన్‌ (బి) జాన్సెన్‌ 0; బుమ్రా (సి) బవుమా (బి) జాన్సెన్‌ 2; ఎక్స్‌ట్రాలు: 28; మొత్తం: 67.3 ఓవర్లలో 198 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-20, 2-24, 3-57, 4-58, 5-152, 6-162, 7-170, 8-180, 9-189, 10-198. బౌలింగ్‌: రబాడ 17-5-53-3; ఒలివియెర్‌ 10-1-38-0; జాన్సెన్‌ 19.3-6-36-4; ఎన్‌గిడి 14-5-21-3; కేశవ్‌ మహరాజ్‌ 7-1-33-0.


దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ (సి) రాహుల్‌ (బి) షమి 16; ఎల్గర్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 30; పీటర్సన్‌ (బ్యాటింగ్‌) 48; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 29.4 ఓవర్లలో 101/2. వికెట్ల పతనం: 1-23, 2-101. బౌలింగ్‌: బుమ్రా 9.4-3-29-1; షమి 7-0-22-1; ఉమేశ్‌ 2-0-5-0; శార్దూల్‌ 5-1-17-0; అశ్విన్‌ 6-1-22-0.  

Updated Date - 2022-01-14T09:22:49+05:30 IST