Advertisement
Advertisement
Abn logo
Advertisement

వీసా మళ్లీ రద్దు

జొకోవిచ్‌కు ఝలకిచ్చిన ఆసీస్‌ ఇమ్మిగ్రేషన్‌ శాఖ

మూడేళ్లు బహిష్కరణకు గురయ్యే అవకాశం


మెల్‌బోర్న్‌: కోర్టులో కేసు గెలిచినా ప్రపంచ టెన్నిస్‌ నెంబర్‌వన్‌ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌కు తిప్పలు తప్పడం లేదు. మరో మూడ్రోజుల్లో జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు సిద్ధమవు తున్న తరుణంలో ఈ సెర్బియా స్టార్‌ వీసాను ఆస్ట్రేలియా ప్రభుత్వం రెండోసారి రద్దు చేసింది. ఈ మేరకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ శాఖ మంత్రి అలెక్స్‌ హాక్‌ తన విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తూ శుక్రవారం వీసా రద్దు నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోకుండానే అతడు దేశంలోకి అడుగుపెట్టడంతో.. దేశ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని  ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి అలెక్స్‌ ప్రకటించారు. ఈ ప్రకటనను ఆసీస్‌ ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌ కూడా స్వాగతించారు. రెండోసారి వీసా రద్దుతో జొకోవిచ్‌ మూడేళ్లు ఆస్ట్రేలియాలోకి అడుగుపెట్టకుండా బహిష్కరణకు గురయ్యే అవకాశముంది. కాగా.. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ జొకోవిచ్‌ లాయర్లు మళ్లీ కోర్టులో అప్పీలు చేసే అవకాశముంది. 


వివాదం ఇలా..:

మొదటి నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న 34 ఏళ్ల జొకోవిచ్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడేందుకు నిర్వాహ కుల ప్రత్యేక అనుమతితో ఈనెల 4న దేశంలోకి అడుగుపెట్టాడు. అయితే, వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలు లేవన్న కారణంతో జొకో వీసాను రద్దుచేసిన ప్రభుత్వం అతడిని ఇమ్మిగ్రేషన్‌ డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించారు. దీనిపై కేసు వేసిన జొకో.. గతనెల 16న తనకు కరోనా సోకినందున తక్షణమే వ్యాక్సిన్‌ అవసరం లేదంటూ తన లాయర్ల ద్వారా కోర్టులో వాదనలు వినిపించాడు. అనుమతి తీసుకున్నా ఇలా చేయడం సరికాదంటూ అతడి వీసాను పునరుద్ధరించాలంటూ ఫెడరల్‌ కోర్టు జొకోకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో జొకో డిటెన్షన్‌ సెంటర్‌ నుంచి విడుదలై.. సోమవారం మొదలయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ కోసం ఇప్పటికే ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టాడు. అయితే, తాజాగా ఇమ్మిగ్రేషన్‌ శాఖ స్వతంత్ర అధికార నిర్ణయంతో మళ్లీ వీసా రద్దవడంతో జొకోకు భారీ షాక్‌ తగిలింది.


ఇప్పుడేం చేస్తాడు..?  

కోర్టులో కేసు గెలవడంతో టోర్నీలో ఆడేందుకు మార్గం సుగమమైందన్న కారణంతో నిర్వాహకులు జొకోవిచ్‌కు మెయిన్‌ డ్రాలో చోటు కల్పించారు. సోమవారం జరిగే తొలిరౌండ్లో అతడు తన దేశానికే చెందిన కెమనోవిచ్‌తో తలపడాల్సి ఉంది. కానీ, ఇప్పుడు రెండోసారి వీసా రద్దవడంతో ఇమ్మిగ్రేషన్‌ శాఖ ఆదేశాలతో జొకో తక్షణమే ఆస్ట్రేలియాను వీడాల్సి ఉంటుంది. ఇక్కడి నిబంధనల ప్రకారం వీసా రద్దయిన వ్యక్తి మూడేళ్లు దేశంలోకి అడుగుపెట్టకుండా బహిష్కరణకు గురవుతాడు. ఇదే గనక జరిగితే జొకో 2023, 2024 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ ఆడేందుకు అవకాశముండదు.   

Advertisement
Advertisement