నిర్లక్ష్యం వద్దు..

ABN , First Publish Date - 2020-07-05T10:20:26+05:30 IST

లాక్‌డౌన్‌ తొలగించిన తర్వాత కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోందని జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

నిర్లక్ష్యం వద్దు..

కరోనా తొలగిపోయిందనే నిర్లక్ష్యంతో వైరస్‌ వ్యాప్తి

అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు

కలెక్టర్‌, అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు


గుంటూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ తొలగించిన తర్వాత కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోందని జిల్లా కలెక్టర్‌  శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కార్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్‌, అర్బన్‌, రూరల్‌ ఎస్‌పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జూన్‌ నెల 30వ తేదీ వరకు 1,095 కేసులు నమోదు అయ్యాయని, అంతకుముందు  మే నెలాఖరు వరకు 500 కేసులు మాత్రమే నమోదు అయ్యాయన్నారు. ఈ నెల నాల్గో తేదీ వరకు 2,050 కేసులు వచ్చాయన్నారు. ఇందుకు కారణం లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కరోన వైరస్‌ తొలగిపోయిందన్న భావన ప్రజల్లో కలగడమేనన్నారు.


జిల్లాలో కరోన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం భారంగా మారిందన్నారు. ప్రత్యేక గది, మరుగుదొడ్డి వసతి ఉన్న వారికి హోం ఐసోలేషన్‌కు అనుమతిస్తున్నామన్నారు. మద్యం దుకాణాల వద్ద  భౌతికదూరం పాటించాలన్నారు.  మరణించిన వ్యక్తుల్లో కరోన వైరస్‌ నాలుగు నుంచి ఆరు గంటల పాటు మాత్రమే బతికి ఉంటుందని, దీనిపై ప్రజలు లేనిపోని అపోహలకు గురి కావొద్దన్నారు. అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ లాక్‌డౌన్‌ తొలగించిన తర్వాత ప్రజలు వైరస్‌ తొలగిపోయిందనే భావనలో ఉన్నారని తెలిపారు. 


పాజిటివ్‌ వ్యక్తులందరిని క్వారంటైన్‌ సెంటర్లకు పంపించడం సాధ్యం కానందున ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించి వైరస్‌ని కట్టడి చేయాలన్నారు. రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్ని మాట్లాడుతూ ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలన్నారు. అప్పుడు కూడా మాస్కు ధరించి, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌(సచివాలయాలు) పి.ప్రశాంతి, డీఆర్‌వో సత్యన్నారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-05T10:20:26+05:30 IST