కోరలు చాచిన కరోనా

ABN , First Publish Date - 2020-07-07T09:40:26+05:30 IST

కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఆరంభంలో వలస కార్మికులకు ఎక్కువగా సోకిన ఈ వైరస్‌ ఇప్పుడు అనేక శాఖల ఉద్యోగులకు

కోరలు చాచిన కరోనా

అన్ని శాఖలకు వ్యాప్తి

ఉద్యోగులు విలవిల

అనేక కార్యాలయాలు మూసివేత

కొత్తగా హౌసింగ్‌ కార్పొరేషన్‌,

రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయం, వీఎంఆర్‌డీఏ ప్లానింగ్‌ విభాగం...


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఆరంభంలో వలస కార్మికులకు ఎక్కువగా సోకిన ఈ వైరస్‌ ఇప్పుడు అనేక శాఖల ఉద్యోగులకు సంక్రమిస్తోంది. కొందరు ఆటోలలో విధులకు హాజరుకావడం, మరికొందరు జనసమ్మర్థమైన ప్రాంతాలకు వెళ్లడం వల్ల కరోనా వచ్చినట్టు చెబుతున్నారు. తాజాగా ఎంవీపీ కాలనీ రైతుబజారుకు చెందిన ఓ డ్వాక్రా మహిళకు, ఆమె భర్తకు పాజిటివ్‌ రావడంతో బజారును తాత్కాలికంగా మూసివేశారు. అక్కడున్న రైతులు అందరినీ సమీపంలోనే వున్న ఏఎస్‌ రాజా మైదానంలోకి తరలించారు. బజారులో రైతులందరికీ పరీక్షలు నిర్వహించారు. సీతమ్మధార ఆక్సిజన్‌ టవర్స్‌లో రెండు కేసులు నమోదు కావడంతో పక్కనే వున్న రైతుబజారును కూడా మూసేశారు. మద్దిలపాలెంలోని కృష్ణా కాలేజీలో తాత్కాలిక రైతుబజారు నడుపుతున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన డ్వాక్రా మహిళకు అక్కడ దుకాణం ఉండడంతో ఆ బజారును కూడా మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.


తహసీల్దార్‌ కార్యాలయాలు మూసివేత

పక్కనే పాజిటివ్‌ కేసులు రావడంతో రెండు రోజుల క్రితం సీతమ్మధారలోని అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని మూసేశారు. తాజాగా విశాఖ వేలీ స్కూల్‌ సమీపానున్న రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ వీఆర్‌ఓకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో ఆ కార్యాలయాన్ని కూడా మూసేశారు. ప్రజలను ఎవరినీ రానివ్వడం లేదు. మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒకరికి కరోనా రావడంతో ఆ కార్యాలయాన్ని కూడా మూసేసిన సంగతి తెలిసిందే. స్టీల్‌ప్లాంటు ఆస్పత్రిలో ఒక వైద్యురాలికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ ఆస్పత్రికి వెళ్లేందుకు ఉద్యోగులు భయపడుతున్నారు.


వీఎంఆర్‌డీఏలో...

విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ)లోని ప్లానింగ్‌ సెక్షన్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఒక మహిళకు పాజిటివ్‌ వచ్చింది. దాంతో సోమవారం ఆ విభాగాన్ని మూసేశారు. సుమారుగా 40 మంది సిబ్బందిని జీవీఎంసీకి పంపించి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీఎంఆర్‌డీఏలో మిగిలిన విభాగాల సిబ్బంది కూడా పరీక్షలు నిర్వహించాలని సిబ్బంది కోరుతున్నారు.

 

 ‘హౌసింగ్‌’ అధికారికి పాజిటివ్‌:కార్పొరేషన్‌ కార్యాలయం మూసివేత

హౌసింగ్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయన భార్య, కుమార్తెలకు కూడా వైరస్‌ సోకడంతో ముగ్గురినీ సోమవారం గీతం ఆస్పత్రికి తరలించారు. దీంతో ఉషోదయ జంక్షన్‌లో వున్న హౌసింగ్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని మూడు రోజులపాటు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం కార్యాలయంలో సోడియం హైడ్రో క్లోరైడ్‌ పిచికారీ చేశారు. మంగళవారం కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. 

Updated Date - 2020-07-07T09:40:26+05:30 IST