స్పై కామ్‌లపై నిఘా ఉండాల్సిందే!

ABN , First Publish Date - 2020-09-10T05:30:00+05:30 IST

కంటికి కనిపించని నిఘా కెమెరాలు మహిళల భద్రతను హరించి వేస్తున్నాయి. షాపింగ్‌ మాల్స్‌, హాస్టళ్లు, హోటల్స్‌... ఎక్కడైనా ఇలాంటి రహస్య కెమెరాలు ఉండొచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఈ రహస్య కెమెరాలు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి...

స్పై కామ్‌లపై నిఘా ఉండాల్సిందే!

కంటికి కనిపించని నిఘా కెమెరాలు మహిళల భద్రతను హరించి  వేస్తున్నాయి. షాపింగ్‌ మాల్స్‌, హాస్టళ్లు, హోటల్స్‌... ఎక్కడైనా ఇలాంటి రహస్య కెమెరాలు ఉండొచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఈ రహస్య కెమెరాలు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. అడ్డూ అదుపూ లేని వీటి కొనుగోళ్లకు అడ్డుకట్ట వేయడం కోసం పెద్ద పోరాటమే చేస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన ‘హెవెన్‌ హోమ్స్‌ సొసైటీ’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు వరలక్ష్మి. ఆ విశేషాలు ‘నవ్య’తో పంచుకున్నారు.


మహిళల భద్రత గురించి అందరూ మాట్లాడతారు. కానీ ఆచరణలో మాత్రం ఫలితాలు రావడం లేదు. కఠిన చట్టాలు రూపొందించామని చెబుతున్నా మహిళలపై ఆగడాలు తగ్గడం లేదు. ఇటీవల కాలంలో రహస్య కెమెరాలతో చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం స్పై కెమెరాలు మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తుండటమే. ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే నేరుగా స్పై కెమెరా ఇంటికే వచ్చేస్తుంది. మార్కెట్లలోనూ రూ.200 నుంచి 30 వేల రూపాయలకు స్పై కెమెరాలు లభిస్తున్నాయి. భద్రత కోసం వినియోగించాల్సిన ఈ కెమెరాలను కొందరు తప్పు దారిలో ఉపయోగిస్తున్నారు. పెరిగిన సాంకేతికత మహిళల భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. స్పై కెమెరాల అమ్మకాలపై ఆంక్షలు లేవు. ‘‘నిఘా కెమెరాలు విచ్చల విడిగా అమ్ముతున్నారు. వాటివల్ల మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. వీటి అమ్మకాలపై నియంత్రణ ఉండాలి’’అంటారు వరలక్ష్మి. స్పై కెమెరాల అమ్మకాల నియంత్రణ, కఠిన చట్టాల అమలుపై ఆమె చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు.


యాంటీ రెడ్‌ ఐ

మహిళల భద్రతకు పెనుముప్పుగా పరిణమిస్తున్న స్పై కెమెరాల మీద ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘యాంటీ రెడ్‌ ఐ’ పేరుతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు వరలక్ష్మి. వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులతో కలిసి వీడియోలు రూపొందిస్తూ, అవగాహన పెంచేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ‘‘దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా సాగుతున్న స్పై కెమెరాలపై అమ్మకాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. వాటిని ఎవరు కొనుగోలు చేస్తున్నారు? ఎందుకోసం కొనుగోలు చేస్తున్నారు? కొనుగోలు చేస్తున్న వారి వివరాలు కచ్చితంగా పోలీసుల దగ్గర ఉండాలి. షాపింగ్‌ మాల్స్‌లో స్పై కెమెరాలు పెట్టిన సంఘటనలు కొన్ని బయటపడ్డాయి. ఇలాంటి సంఘటనలు జరిగితే ఆయా వ్యాపారసంస్థల యాజమాన్యాన్ని బాధ్యులను చేయాలి. అప్పుడే అలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి’’ అంటున్నారు వరలక్ష్మి. 


ఇదీ మహిళల వాయిస్‌!

మహిళల సాధికారత, భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి! ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలు ఏమిటి? ఇలాంటి అంశాలను ఒక దగ్గర చేరుస్తూ ‘వాయిస్‌ ఆఫ్‌ భారత్‌ 2020’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖుల అభిప్రాయాలు, సంతకాలు సేకరిస్తూ వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను చేపట్టారు. మహిళలపై వేధింపులు ఆగాలంటే పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలంటారామె. ‘‘ప్రైవేటు సంస్థల్లో, బాలికల సంరక్షణా కేంద్రాల్లో, హాస్టళ్లలో తప్పనిసరిగా సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అనుమతి లేకుండా మహిళల ఫొటోలు తీయడం, సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలి. కఠినమైన చట్టాలు రూపొందించి అమలు చేయాలి’’ అని అంటారు వరలక్ష్మి. స్పై కెమెరాల అమ్మకాల నియంత్రణ, పోర్న్‌ సైట్లపై నిషేధం విధించేందుకు కఠినమైన చట్టాలను రూపొందించాలని వరలక్ష్మి గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిశారు కూడా. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే చిన్న వయసులోనే అందరిలో అవగాహన కల్పించాలని అంటారామె.

Updated Date - 2020-09-10T05:30:00+05:30 IST