ఏసీబీకి చిక్కిన ఎస్‌ఆర్‌నగర్‌ ఎస్సై

ABN , First Publish Date - 2021-02-23T08:39:55+05:30 IST

సీజ్‌ చేసిన వాహనాన్ని విడుదల చేసేందుకు రూ. 25 వేలు లంచం డిమాండ్‌ చేసిన ఎస్‌ఆర్‌నగర్‌ ఎస్సై బెల్లన భాస్కర్‌రావును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీకి చిక్కిన ఎస్‌ఆర్‌నగర్‌ ఎస్సై

రూ. 25 వేలు తీసుకుంటుండగా పట్టివేత

హైదరాబాద్‌ సిటీ/ అమీర్‌పేట్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి):  సీజ్‌ చేసిన వాహనాన్ని విడుదల చేసేందుకు రూ. 25 వేలు లంచం డిమాండ్‌ చేసిన ఎస్‌ఆర్‌నగర్‌ ఎస్సై బెల్లన భాస్కర్‌రావును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన 2009 బ్యాచ్‌ ఎస్సై బెల్లన భాస్కర్‌రావు.. పంజాగుట్ట పీఎస్‌ నుంచి ఏడాదిన్నర క్రితం ఎస్‌ఆర్‌నగర్‌కు బదిలీ అయ్యాడు. గత నెల 12న మహమ్మద్‌ ఖాసీం అనే వ్యక్తి బల్కంపేట్‌లోని ఓ రేషన్‌ దుకాణం నుంచి ట్రాలీలో క్వింటాల్‌ గోధుమలు తీసుకుని వెళ్తుండగా.. స్థానికులు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్సై భాస్కర్‌రావు నేతృత్వంలో దర్యాప్తు కొనసాగించారు. ఖాసీంను అరెస్టు చేసి, ఆటో ట్రాలీని సీజ్‌ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన ఖాసీం.. తన వాహనాన్ని విడిపించుకునేందుకు పోలీ్‌సస్టేషన్‌ చుట్టూ తిరిగేవాడు. ఈ క్రమంలో ఎస్సై భాస్కర్‌రావు అతడిని పిలిపించి.. ‘‘రూ. 25 వేలు లంచం ఇస్తే.. సివిల్‌ సప్లయ్స్‌ అధికారులతో బెడద లేకుండా.. నీ ట్రాలీని ఇచ్చేస్తాను. లేకుంటే.. ట్రాలీని తిరిగి ఇచ్చేది లేదు’’ అని తేల్చి చెప్పాడు. దీంతో ఖాసీం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం రాత్రి ఖాసీం.. ఎస్సైకి రూ. 25వేలు అందజేశాడు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు భాస్కర్‌రావును అరెస్టు చేశారు.  కాగా.. త్వరలో జరిగే ఎస్సైల పదోన్నతుల జాబితాలో భాస్కర్‌రావు పేరు ఉండడం గమనార్హం..!

Updated Date - 2021-02-23T08:39:55+05:30 IST