పోలీసులు వేధిస్తున్నారని యువకుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-09-27T09:46:31+05:30 IST

ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు వేధిస్తున్నారంటూ బోరబండ శ్రీరాంనగర్‌కు చెందిన భార్గవరామ్‌ అనే యువకుడు

పోలీసులు వేధిస్తున్నారని యువకుడి ఆత్మహత్యాయత్నం

అమీర్‌పేట, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు వేధిస్తున్నారంటూ బోరబండ శ్రీరాంనగర్‌కు చెందిన భార్గవరామ్‌ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈఎ్‌సఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన కథనం, పోలీసుల వివరాల ప్రకారం... ఇటీవల రహమత్‌నగర్‌ డివిజన్‌ ఇందిరానగర్‌లోని 137 గజాల స్థలంలో కొందరు దేవతా విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఖైరతాబాద్‌ తహసీల్దారు ఈనెల 24న ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు పోలీసుల రక్షణతో ఈ స్థలంలోని విగ్రహాన్ని తొలగించి, ప్రభుత్వ భూమిగా బోర్డు ఏర్పాటు చేశారు.


ఆలయానికి చెందినదిగా పేర్కొనే ఈ స్థలంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకోవడంతో భార్గవరామ్‌ ట్విటర్‌లో నిరసన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో భార్గవరామ్‌తో పాటు అతడి సోదరుడు రతన్‌కుమార్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. తాను సామాజిక మాధ్యమాల్లో స్పందించినందుకు తనతో పాటు తన సోదరున్నీ పోలీసులు వేధిస్తున్నారని, స్టేషన్‌కు పిలిపించి దూషించారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని విషం తాగడంతో భార్గవరామ్‌ను కుటుంబ సభ్యులు ఈఎ్‌సఐ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు: సీఐ సైదులు

రహ్మత్‌నగర్‌ డివిజన్‌ ఇందిరానగర్‌లోని ప్రభుత్వ భూమిలో ఓ దేవతా విగ్రహం ఏర్పాటు చేశారని తహసీల్దార్‌ చేసిన ఫిర్యాదు మేరకే భార్గవరామ్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఆర్‌నగర్‌ సీఐ సైదులు తెలిపారు. విగ్రహం తొలగించి ప్రభుత్వ భూమిని ఆక్రమణ నుంచి కాపాడేందుకు రెవెన్యూ అధికారులకు రక్షణ కల్పించామన్నారు. ఈ విషయాన్ని భార్గవరామ్‌ అనే యువకుడు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడని సున్నితమైన అంశం, ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుందనే అతన్ని స్టేషన్‌కు పిలిచి మందలించామన్నారు. తాను వేధించానని చెప్పడంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. యువకుడు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడని వెల్లడించారు.

Updated Date - 2020-09-27T09:46:31+05:30 IST