‘శ్రీకారం కొత్త సంకల్పానికి... శ్రీకారం కొత్త అధ్యాయానికి’ అంటూ పచ్చని పొలాల్లో శర్వానంద్ పాటనందుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. కిషోర్ రెడ్డి దర్శకుడు. మిక్కీ జె మేయర్ స్వరకర్తగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన టైటిల్ సాంగ్‌ను శుక్రవారం దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘ప్రపంచం మనుగడ వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. ఎన్నాళ్లైనా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదు. వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం చూపుతూ సరికొత్త పాయింట్‌తో దర్శకుడు ఈ చిత్రం తీయటం అభినందనీయం.
‘శ్రీకారం’ పాటలానే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలి’’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సగటు సినిమా కథలకు భిన్నంగా ఉండే చిత్రమిది. ఇలాంటి చిత్రాన్ని తీయాలంటే నిర్మాతలకు ధైర్యం ఉండాలి. నిర్మాణ సంస్థ ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది’’ అని అన్నారు. ‘‘నా అనుభవం నుంచి వచ్చిన పదాలతో టైటిల్ సాంగ్ రాశాను. త్రివిక్రమ్ పాటను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. నా జీవితాంతం గుర్తుండే పాట ఇది’’ అని రామజోగయ్య శాస్త్రి అన్నారు. శివరాత్రి సందర్భంగా మార్చి 11న సినిమాను విడుదల చేస్తున్నామని 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట తెలిపారు.