ద్రౌపది నిన్ను ఆరో భర్తగా స్వీకరిస్తుందన్న శ్రీకృష్ణుడి మాటలకు కర్ణుడి సమాధానాలివి..!

ABN , First Publish Date - 2021-09-29T22:19:46+05:30 IST

మహాభారతంలో శ్రీకృష్టుడు, పాండవులు, కౌరవులకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. అంతే ప్రాముఖ్యత కర్ణుడికి కూడా ఉంటుంది. ఇందులో కర్ణుడి పాత్ర ఎంతో కీలమనే విషయం అందరికీ తెలిసిందే. దానవీరశూర కర్ణగా పేరుగాంచిన కర్ణుడు.. ఎన్నో

ద్రౌపది నిన్ను ఆరో భర్తగా స్వీకరిస్తుందన్న శ్రీకృష్ణుడి మాటలకు కర్ణుడి సమాధానాలివి..!

మహాభారతంలో శ్రీకృష్టుడు, పాండవులు, కౌరవులకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. అంతే ప్రాముఖ్యత కర్ణుడికి కూడా ఉంటుంది. ఇందులో కర్ణుడి పాత్ర ఎంతో కీలమనే విషయం అందరికీ తెలిసిందే. దానవీరశూర కర్ణగా పేరుగాంచిన కర్ణుడు.. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. అలాగే సాధించుకున్న విద్యలన్నీ వివిధ కారణాలతో అతనికి దూరమవుతాయి. మరోవైపు తనకు పుట్టుకతో వచ్చిన కవచ కుండలాలను కూడా దానం చేస్తాడు. అంతటి దానగునం కలిగిన వాడిగా పేరుగాంచాడు.. కర్ణుడు. అయితే పలు సందర్భాలలో ఎంతో మంది ఇచ్చిన శాపాలన్నీ.. చివరి నిముషంలో చుట్టుముట్టి కర్డుడి మరణానికి దారితీస్తాయి. లేదంటే యుద్ధంలో కర్ణుడి ముందు ఎవరూ నిలవలేరనే విషయం శ్రీకృష్ణుడికి తెలుసు. తక్కువ కులానికి చెందిన వాడిగా ముద్రపడి అవమానాలు భరించిన కర్ణుడిని దుర్యోధనుడు చేరదీస్తాడు. దీంతో దుర్యోధనిడికి విధేయుడిగా ఉంటూ.. తన జీవితాన్నే అంకితం చేస్తాడు. అయితే కురుక్షేత్ర యుద్ధానికి ముందు కర్ణుడి జన్మ వృత్తాంతాన్ని తెలియజేసి, పాండవుల వైపు తీసుకొచ్చేందుకు శ్రీకృష్ణుడు ప్రయత్నిస్తాడు. 


 యుద్ధానికి సిద్ధపడితే జరగబోవు పరిణామాలను.. కౌరవసభలో శ్రీకృష్ణుడు వివరించినా ఫలితం లేకుండా పోతుంది. కర్ణుని అండ చూసుకుని దుర్యోధునుడు యుద్ధాన్ని ఒక క్రీడగా తీసుకుంటున్నాడని అందరికీ అర్థమవుతుంది. దీంతో కృష్ణుడు సభకు నమస్కరించి, సెలవు తీసుకుని బయలుదేరతాడు. కుంతీదేవి మందిరానికి వెళ్లి, రాయబార విశేషాలను ఆమెకు వివరిస్తాడు. క్షాత్రధర్మం పాటించి పాండుపుత్రులను తమ శౌర్య ప్రతాపాలను ప్రదర్శించమని నా మాటగా చెప్పమంటుంది కుంతి. శౌరి రథాన్ని అనుసరించి దుర్యోధనాదులు వస్తుండగా, కృష్ణుడు సవినయంగా వారిని నిలిపుతాడు. ఒక్క కర్ణుని మాత్రం హస్తిన పొలిమేరలదాకా రావల్సిందిగా కోరాడు. కర్ణుడికి తన చేయి అందించి ఆప్యాయంగా తన రథంలోకి ఆహ్వానించాడు. కర్ణునితో సహా కృష్ణ రథం ఉపప్లావ్యానికి బయలు దేరింది.హస్తిన రాజవీధిలో పురజ నులు కృష్ణునిపై పూలవాన కురిపించారు. కృష్ణుడు సభ నుంచి విష్క్రమించాక ధృతరాష్ట్రుడు, భీష్మ ద్రోణాదులు నిరాశ చెందారు. కడసారిగా దుర్యోధునికి చెప్పి చూశారు. ‘‘ధర్మరాజ సముద్రానికి యీ నాటితో చెలియల కట్ట తెగిపోయినట్టే’’ అని కురు వృద్ధులు నిట్టూర్చారు. మీ క్షేమం, వంశక్షేమం కోరి యింతగా చెబుతున్నాం గాని మే మెవ్వరం యుద్ధానికి భయపడుతున్నామని భావించ వద్దని స్పష్టం చేసి గురువృద్ధులు తమ నివాసాలకు వెళ్లిపోయారు. రథం హస్తిన హద్దులు దాటుతుండగా, ఒక అనువైన ప్రదేశంలో ఆపించాడు కృష్ణుడు.


అప్పుడు కర్ణుడితో.. శ్రీకృష్ణుడు.. ‘‘కర్ణా! ఎన్నాళ్లుగానో నీకొక సత్యం చెప్పాలని వువ్విళ్లూరుతున్నాను. ఇన్నాళ్లకు నిన్నిట్లా కలిసే అవకాశం లభించింది. ధర్మ సూక్ష్మాలెరిగిన మహా మనిషివి నువ్వు. సదాచార వేత్తలపట్ల నీకున్న గౌరవం నాకు తెలియనిది కాదు. ఇవన్ని శుష్క ప్రియాలుగా నీకు తోచవచ్చు. అందుకే అసలు విషయానికి వస్తాను. కర్ణా, నీ జన్మ రహస్యం నువ్వు తెలుసుకోవాలని నా అభిలాష. సూర్యదేవుని వరప్రభావంతో కుంతీ దేవికి ప్రప్రథమంగా ఉదయించిన తేజోరాశివి నువ్వు. అంటే, పాండు మహీపతి జ్యేష్ట కుమారుడవు.’’ అంటున్న కృష్ణుని మాటలను తలదించుకుని వింటున్నాడు కర్ణుడు. ముఖంలో ఎలాంటి భావాలు ప్రస్ఫుటం కావడం లేదు. కృష్ణుడు తన సంభాషణ సాగిస్తూ, ‘‘కర్ణా! ఇప్పుడు యీ రహస్యం నా నోటివెంట వింటే, ధర్మరాజు నీ పాదాలపై వాలతాడు. మిగిలిన వారు అన్నగారిని అనుసరిస్తారు. ఆపై నీ ఆజ్ఞలను భయ భక్తులతో శిరసావహించగలరు. సామ్రాజ్య పట్టాభిషేకంతో గౌరవించి, వారైదుగురు నీకు అనుచరులై సేవించగలరు. నీ పట్టాభిషేక మహోత్సవం నేనే స్వయంగా నిర్వర్తిస్తాను. ధర్మజుడు నీకు వింజామర వీస్తాడు. భీముడు నీ వెనుక నిలబడి వెల్లగొడుగు పడతాడు. సవ్యసాచి సదా నీ రథసారధిగా చరిస్తాడు. నకుల సహదేవులు నీ కనుసైగలలో నీ సేవకులై మెలగుతారు. మిత్రదేశాధీశులు నీకు లోబడి, నీ ఆజ్ఞాను వర్తులై వుంటారు. ఇంకొక్క మాట... ద్రౌపది నిన్నారవ భర్తగ నిండు మనసుతో స్వీకరించగలదు. ఇకపై పంచపాండువులన్న మాట పాండవహాష్టిగా ప్రాచుర్యం పొందగలదు. ఇంతకన్న ఎవరైనా అభిలషించేదేముంటుంది. నీ మాతృమూర్తి కుంతీదేవి నీ వైభవం చూసి ఎంత ఆనందిస్తుందో ఆలోచించు’’ అంటూ కర్ణుని వెన్నుతట్టాడు చనువుగా.


రాధేయుడు ప్రసంగాన్ని సావధానంగా విని, కృష్ణుడుని సూటిగా చూస్తూ, ‘‘యాద వేశ్వరా! నీవు చెప్పిన వృత్తాంతం గతంలో నేను కర్ణాకర్ణిగా విన్నదే. నన్ను కనగానే లోకానికి వెరచి నన్ను ఏటిపాలు చేసింది కుంతి. సూతదంపతులు నన్ను రక్షించి, దరికి చేర్చి, పెంచి పెద్ద చేశారు. సూతకళత్రము పాలు త్రాగి, సూతుని అన్నం తిని, నేటికొక రాజ కుమారుడనని ప్రకటించుకోవడం ఏమి ధర్మం. సదాచార వేత్తల పట్ల గౌరవం వుందని, ధర్మసూక్ష్మాలు తెలిసిన వాడిననీ నాకు ముందే నా గురించి ఎరుక పరిచావు. నాకు తెలిసి నా జనని రాధాదేవి, నా తండ్రి అతిరథుడు. తమ కుల ధర్మానుసారంగా పసితనం నుంచి నాకు సమస్త సంస్కారాలు వారే చేయించారు. విద్యా ప్రదర్శన నాడు కూడా నా పుట్టుపుర్వోత్తరాలను ఒక్కరైననూ చెప్పలేదే! నాటి నుంచి నేటివరకు సహోదరులందరికంటే వాత్సల్యంతో నన్ను ఆదరిస్తున్నాడు. సూత పుత్రుడననే భావన ఎన్నడూ కల్గించలేదు. ఆ స్నేహాన్ని నేను తెంపుకుని బయటపడలేను.


‘‘ఈ బాంధవ్యాలు, పట్టాభిషేకాలు, పచ్చలగద్దెల కంటె ఒక అనామకుని నామకుని చేసిన దుర్యోధన వర్గమే నాకు ముఖ్యం. ధర్మ సమ్మతం కూడా. అర్జునుని కదనరంగంలో నిలువరించ గలననే నమ్మకంతోనే రారాజు నీ మాటలు పెడచెవిన పెట్టాడు. తుది శ్వాస వీడేదాకా అటువంటి ఆప్తుని వీడను. కృష్ణా, నాదొక విన్నపం. ఈ నిగూఢ రహస్యాన్ని మనలోనే వుండిపోనీ. ధర్మజునికి తెలిస్తే, రాజ్యపాలనకే అంగీకరించడు. ఆ మహనీయుడు పృథ్వీ మండలాన్ని న్యాయ నిష్ఠతో పాలించగల సమర్థుడు. ఇక రణయజ్ఞం ప్రారంభం కానున్నది. కౌరవ కుమారులు బలిపశువులు కాగలరు. నీవే ఉపద్రష్టవై యజ్ఞవిధిని నడిపిస్తావు. ధర్మజుడు సోమయాజి. సోదరులు ఋత్విజులు. ఆ యజ్ఞంతో మరణించిన మా లాంటి వారందరికీ ఉత్తమలోకాలు సంప్రాప్తించగలవు’’ అని సమాధానమిస్తాడు.. కర్ణుడు.

Updated Date - 2021-09-29T22:19:46+05:30 IST