శ్రీ లక్ష్మీ కటాక్షం

ABN , First Publish Date - 2020-03-10T09:50:14+05:30 IST

కుండిన నగరాధిపతి చిత్రవర్తనునికి మధ్యవయస్సులో లేక లేక ఒక కుమారుడు పుట్టాడు. పేరు దగ్గర నుండి కొత్తదనాన్ని కోరుకునే రాజు.. అతడికి సమీరచంచలుడు అని పేరు పెట్టాడు. కుమారునికి యుక్త వయస్సు వచ్చేసరికి రాజు వృద్ధుడయ్యాడు

శ్రీ లక్ష్మీ కటాక్షం

కుండిన నగరాధిపతి చిత్రవర్తనునికి మధ్యవయస్సులో లేక లేక ఒక కుమారుడు  పుట్టాడు. పేరు దగ్గర నుండి కొత్తదనాన్ని కోరుకునే రాజు.. అతడికి సమీరచంచలుడు అని పేరు పెట్టాడు. కుమారునికి యుక్త వయస్సు వచ్చేసరికి రాజు వృద్ధుడయ్యాడు. అయితే, యువరాజుకి ఏ విద్యలూ అబ్బలేదు. నెమ్మదిగా అతని చుట్టూ దుష్టులు చేరారు. జూదం, పరస్త్రీ వ్యామోహం, వేట, దైవదూషణ, ఇతరుల వస్తువులను లాక్కుని అనుభవించడం, ఇతరులను బాధపెట్టడం, అశ్లీలంగా, పరుషంగా మాట్లాడటం, మద్యపానం అనే సప్తవ్యసనాలు రాజ్యమంతా వ్యాపించాయి. దారిద్య్రం పెరిగిపోయింది. ఈ పరిస్థితిని చూసిన మహారాణి శాలినీదేవి.. తమ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలంటూ పొరుగున ఉన్న మహాకోసలకు రాజైన తన సోదరుడైన విక్రమవర్మకు వర్తమానం పంపింది. సోదరి వర్తమానాన్ని అందుకున్న విక్రమవర్మ చాలా తేలిగ్గా కుండిన రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. అనంతరం.. విక్రమవర్మ కుమార్తె కల్యాణ రాగిణి కుండిన రాజ్యంలో పర్యటన చేపట్టింది. జనపదాలవారీగా, గ్రామాలవారీగా మహిళలతో సభలు నిర్వహించింది. తాగుబోతులు, జూదరులైన భర్తలకు తిండి పెట్టవద్దని, మద్యం తాగి ఇంటికివస్తే తలుపు తీయొద్దని చెప్పింది. మర్యాద, మన్ననతో మాట్లాడటం ఎలాగో పిల్లలకు నేర్పాలని సూచించింది. రాజధానిలో, అన్ని గ్రామాల్లో, అందరి ఇళ్లలో ఆగ్నేయ దిశలో అఖండ దీపాలను వెలిగించాలని ఆదేశించింది. ఫాల్గుణ మాసంలో శ్రీ లక్ష్మీ ఉత్సవాలను ఘనంగా నిర్వహింపజేసింది. క్రమంగా రాజ్యంలో జూదగృహాలను, పానశాలలను మూయించింది. ఈ చర్యలన్నింటివల్ల.. ఆరునెలల కాలంలోనే కుండిన రాజ్యానికి కొత్త కళ వచ్చింది. రాజ్యంలోనే కాదు.. రాజకుమారుడు సమీర చంచలునిలో కూడా కల్యాణ రాగిణి క్రమంగా మార్పు తీసుకొని రాగలిగింది. ఆమె ప్రోత్సాహంతో అతడు చెడుస్నేహాలు వీడి.. రాజోచిత విద్యలను తగువిధంగా నేర్చుకున్నాడు. ఒక శుభ ముహూర్తాన విక్రమవర్మ తన కుమార్తెను సమీరునికిచ్చి వివాహం జరిపించాడు. రాజ్యాన్ని చిత్రవర్తనునికిచ్చి.. రాజ్యం మేలు కోసం తన సోదరి శాలినీదేవి పడిన తపన గురించి ఇలా చెప్పాడు..


‘‘బావా.. మీ రాజ్యం అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో నా సోదరి శాలినీదేవి రాజగురువు శాండిల్యుని దగ్గరకు వెళ్లి తరుణోపాయం చెప్పాల్సిందిగా కోరింది. అందుకు శాండిల్యుడు.. ‘మహారాణీ, నువ్వు సమయానికి వచ్చావు. ఇది ఫాల్గుణ మాసం. శ్రీ మహాలక్ష్మి పాలసముద్రం నుంచి పుట్టిన దివ్యమైన రోజు ఫాల్గుణ పూర్ణిమ. నువ్వు ఈ ఫాల్గుణ మాసం నుంచి వచ్చే ఫాల్గుణం వరకూ శ్రీ మహాలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు. సప్తవ్యసనాలతో నిండిన రాజ్యంలో లక్ష్మి నిలువదు. రాజ్యాన్ని శత్రువులెవరో ఆక్రమించడానికి ముందే నీ సోదరుడికే ఆ పని అప్పజెప్పు. రాజ్యంలో సప్తవ్యసనాలను దూరం చేయడానికి నీ మేనకోడలు కల్యాణ రాగిణిని నియమించు’ అని సూచించాడు. తరువాత జరిగిన కథ మీకు తెలిసిందే’’ అని విక్రమవర్మ వివరించాడు. చిత్రవర్తనుడు, సమీరచంచలుడు తమ తప్పిదాలకు సిగ్గు పడ్డారు. ఈ విషయం తెలిసిన రాజ్య ప్రజలందరూ కర్మశీలురై.. శుచి, శుభ్రతలతో నిత్యం మహాలక్ష్మీ ఉపాసన చేసి ఆ తల్లి కటాక్షానికి పాత్రులయ్యారు. రాజ్యం సుభిక్షమై, సుఖశాంతులకు నిలయమైంది.

- ఆచార్య రాణి సదాశివ మూర్తి 

(నేడు లక్ష్మీ జయంతి)

Updated Date - 2020-03-10T09:50:14+05:30 IST