Advertisement
Advertisement
Abn logo
Advertisement

లసిత్ మలింగ సంచలన నిర్ణయం

కొలంబో: శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఫలితంగా 16 ఏళ్లపాటు సుదీర్ఘంగా సాగిన అంతర్జాతీయ కెరియర్‌కు ముగింపు పలికాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 38 ఏళ్ల మలింగ 2011లో టెస్టులు, 2019లో వన్డేల నుంచి తప్పుకున్నాడు. తాజా నిర్ణయంతో టీ20 క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నట్టు అయింది. 


మలింగ ఇప్పటి వరకు 30 టెస్టులు, 226 వన్డేలు, 84 వన్డేలలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 101, వన్డేల్లో 338, టీ20లలో 107 వికెట్లు కలిపి మొత్తం 546 వికెట్లు తీసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడి జాబితాలో ఇప్పటికీ అతడిదే పైచేయి. అంతేకాదు, పొట్టి ఫార్మాట్‌లో 100 వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ కూడా అతడే.

 

‘‘ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం. నా టీ20 కెరియర్‌లో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. టీ20 బౌలింగ్ షూస్‌కు 100 శాతం విశ్రాంతి ఇవ్వాలని ఈ రోజు నిర్ణయించుకున్నాను’’ అంటూ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అలాగే, శ్రీలంక క్రికెట్ బోర్డు, ముంబై ఇండియన్స్ జట్టు, ఆటగాళ్లు, మరీ ముఖ్యంగా దాని యజమానులు, అధికారులు, మెల్‌బోర్న్ స్టార్స్, కెంట్ క్రికెట్ క్లబ్, రంగ్‌పూర్ రైడర్స్, గయానా వారియర్స్, మరాఠా అరేబియన్స్, మాంట్రియల్ టైగర్స్‌కు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని మలింగ పేర్కొన్నాడు. 


‘‘నేను మీతో ఆడుతూ ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నాను. భవిష్యత్తులో నా అనుభవాన్ని యువ క్రికెటర్లతో పంచుకోవాలనుకుంటున్నాను’’ అని మలింగ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో పేర్కొన్నాడు.


ఐపీఎల్‌లోనూ మలింగకు ఘనమైన రికార్డు ఉంది. ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న మలింగ 122 మ్యాచుల్లో 170 వికెట్లు పడగొట్టాడు. మలింగ సారథ్యంలోని శ్రీలంక జట్టు 2014లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండుసార్లు నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసుకున్న ఏకైక బౌలర్ కూడా మలింగనే. అంతేకాదు, వన్డేల్లో మూడుసార్లు, టీ20ల్లో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్ కూడా మలింగ పేరు రికార్డులకెక్కింది.

Advertisement
Advertisement