పాకిస్థాన్‌లో వికృతం: శ్రీలంక మేనేజర్‌కి చిత్రహింసలు.. సజీవంగా కాల్చివేత

ABN , First Publish Date - 2021-12-04T02:43:01+05:30 IST

పాకిస్థాన్‌‌లో శుక్రవారం జరిగిన ఓ దారుణం దేశవ్యాప్తంగా సంచలనమైంది. పాకిస్థాన్‌ జాతీయుడైన ఓ ఫ్యాక్టరీ

పాకిస్థాన్‌లో వికృతం: శ్రీలంక మేనేజర్‌కి చిత్రహింసలు.. సజీవంగా కాల్చివేత

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌‌లో శుక్రవారం జరిగిన ఓ దారుణం దేశవ్యాప్తంగా సంచలనమైంది. శ్రీలంక జాతీయుడైన ఓ ఫ్యాక్టరీ మేనేజర్‌పై దాడిచేసి చావబాదారు. ఆపై సజీవంగా తగలబెట్టేశారు. ‘డాన్.కామ్’ కథనం ప్రకారం.. సియోల్‌కోట్‌లోని వజీరాబాద్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో శ్రీలంకకు చెందిన ప్రియాంత కుమార (40) ఎక్స్‌పోర్టు మేనేజరుగా పనిచేస్తున్నారు. 


ఆయన కార్యాలయానికి సమీపంలోని గోడపై తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) అనే ఇస్లామిస్ట్ పార్టీకి చెందిన పోస్టర్ అంటించి ఉంది. దానిపై ఖురాన్ పద్యాలు ముద్రించి ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తించని ప్రియాంత ఆ పోస్టరును చింపేసి చెత్తబుట్టలో పడేశారు. ఇది గమనించిన ఇద్దరు కార్మికులు విషయాన్ని తోటి కార్మికులకు చెప్పడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.


ప్రియాంత దైవదూషణకు పాల్పడ్డారంటూ వందలాదిమంది కార్మికులు అక్కడికి చేరుకుని నినదించారు. ఆపై ప్రియాంతపై మూకుమ్మడిగా దాడిచేశారు. కొన ఊపిరితో ఉండగానే తగలబెట్టేశారు. ఓ వైపు కిరాతకం జరుగుతుంటే మరోవైపు ఆ ఘటనను తమ సెల్‌ఫోన్లలో బంధించేందుకు పదుల సంఖ్యలో పోటీ పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  


దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. సియోల్‌కోట్ ఫ్యాక్టరీ‌లో జరిగిన దాడిని భయంకరమైన విజిలెంట్ దాడిగా అభివర్ణించారు. శ్రీలంక మేనేజర్‌ను సజీవ దహనం చేయడం పాకిస్థాన్‌కే అవమానకరమన్నారు. ఈ దర్యాప్తును తాను పర్యవేక్షిస్తున్నానని, బాధ్యులను ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. చట్టప్రకారం అందిరినీ శిక్షిస్తామని ట్వీట్ చేశారు. 


ఇది చాలా విషాదకరమైన ఘటన అని పంజాబ్ మఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని సియోల్‌కోట్ పోలీసు అధికారులు తెలిపారు. కాగా, 2010లోనూ సియోల్‌కోట్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. పోలీసుల సమక్షంలోనే ఇద్దరు అన్నదమ్ములను బందిపోటు దొంగలుగా పేర్కొంటూ ఓ గుంపు కొట్టి చంపేసింది.

Updated Date - 2021-12-04T02:43:01+05:30 IST