పెళ్లికి రెడీనే! కానీ...

ABN , First Publish Date - 2020-11-22T05:36:00+05:30 IST

బుల్లితెరపై రాములమ్మ! వెండితెరపై కుందనపు బొమ్మ! త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. అందులో నిజమెంత? ప్రేమ, పెళ్లిపై ఆమె అభిప్రాయాలేంటి?...

పెళ్లికి రెడీనే! కానీ...

బుల్లితెరపై రాములమ్మ! వెండితెరపై కుందనపు బొమ్మ! త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. అందులో నిజమెంత? ప్రేమ, పెళ్లిపై ఆమె అభిప్రాయాలేంటి?...  ‘క్రేజీ అంకుల్స్‌’ సినిమా లొకేషన్‌లో ‘నవ్య’తో సంభాషించిన శ్రీముఖి, తన మనసులో మాటలను వెల్లడించారిలా!


మీ పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజమెంత?

నా జీవితంలోకి ఎవరో వచ్చారని, పెళ్లి ఖాయమైందని రాశారు. నేనూ రెండు మూడు ఆర్టికల్స్‌ చదివా. నాకేమీ అర్థం కాలేదు. నాకు తెలియకుండా ఎవరొచ్చారా!  అని!


అంటే... మీ జీవితంలో ఇప్పుడు ఎవరూ లేరా?

నేనిప్పుడు సింగిలే! ప్రస్తుతానికి నా జీవితంలో ఎవరూ లేరు. నిజాయతీగా చెబుతున్నా... మంచి అబ్బాయి దొరికితే బావుంటుందనుకుంటున్నా. 


అయితే... ఇంట్లో సంబంధాలు చూస్తున్నారా?

మమ్మీవాళ్లు చూస్తున్నారు. ఐయామ్‌ రెడీ ఫర్‌ మ్యారేజ్‌! చేసుకుంటే... లవ్‌ కమ్‌ అరేంజ్డ్‌ మ్యారేజ్‌ చేసుకుంటా! నేను ఠక్కున పెళ్లి చేసుకోను. రెండు మూడేళ్లు (అబ్బాయితో, వాళ్ల కుటుంబంతో) ప్రయాణం చేశాక, మా కుటుంబాలు కలిశాక, అంతా సెట్‌ అయ్యాక పెళ్లి చేసుకుంటా. అదీ రెండు మూడేళ్ల తర్వాతే! ఏమో... నేను ఎవరినైనా చూసి, త్వరలో కన్ఫర్మ్‌ చేస్తానేమో అనిపిస్తుంది.


గతంలో పెళ్లి ఆలోచనలు ఎప్పుడైనా వచ్చాయా?

ఒకానొక సమయంలో ఆరేడు టీవీ షోలు చేశా. రెండు మూడేళ్లు క్షణం తీరిక లేకుండా గడిచాయి. అలసట చెందిన సందర్భాలున్నాయి. ఆడపిల్లను కదా! మూడ్‌ స్వింగ్స్‌ ఉంటాయి. ఓసారి నాన్నకు ఫోన్‌ చేసి ‘వచ్చేస్తాను. నాకు ఇంకేం వద్దు. పెళ్లి చేసేయండి. నిద్రపోవడానికి కూడా టైమ్‌ సరిపోవడం లేదు’ అని చెప్పేశాను. ఎందుకంటే... సినిమాల్లో కాల్షీట్లు ఉంటాయి. టీవీల్లో... చిత్రీకరణకు ఈ రోజు ఉదయం వెళితే, మర్నాడు తెల్లారి వచ్చిన సందర్భాలున్నాయి.  కాసేపు నిద్ర పోయి మళ్లీ వెంటనే వేరే ఛానల్‌కి వెళ్లిన రోజులూ ఉన్నాయి. అప్పుడే నాన్నకు ఫోన్‌ చేసి ‘నాకు ఈ రోబో లైఫ్‌ వద్దు. పెళ్లి చేయండి’ అన్నాను.


మరి, ఇప్పుడు ఏం అనిపిస్తుంది?

ఇప్పుడు... నాన్నవాళ్లే ‘నువ్వు పెళ్లి చేసుకోమ్మా’ అనే పరిస్థితి వచ్చేసింది (నవ్వులు). వయసు వచ్చేసింది కాబట్టి!  జీవిత భాగస్వామి కావాలనే ఫీలింగ్‌ నాకూ వచ్చింది. జీవితంలో మద్దతు  ఉండాలి కదా! అందుకని, పెళ్లి చేసుకోవాలి. అలాగని, నా పనిలో ఎవరూ వేలు పెట్టడం నాకిష్టం ఉండదు. టైమ్‌ని బట్టి అన్నీ జరుగుతాయనేది నా ఫీలింగ్‌!




పెళ్లి చేసుకోబోయే వర్కింగ్‌ ఉమెన్‌కి ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ పరంగా  మీరిచ్చే సలహా!

కష్టపడి సంపాదించినప్పుడు ప్రతి రూపాయి ముఖ్యమే. అలాగనీ నేను పిసినారి అని చెప్పను. నాకంటూ ఓ చెక్‌ లిస్ట్‌ ఉంది. మంచి ఇల్లు తీసుకోవాలి. మమ్మీడాడీ కంటూ ఒక ఇల్లు ఉండాలి. తమ్ముడు, కజిన్స్‌ని సెటిల్‌ చేయాలి. తమ్ముడి కోసమే లగ్జరీ కారు కొన్నా. పెళ్లైన తర్వాత భర్త మీద అస్సలు ఆధారపడకూడదు. ఎందుకంటే... ఇన్నేళ్లు సొంతంగా సంపాదించి బతికినప్పుడు, పెళ్లయ్యాక ‘ఏవండీ! నాకిది కావాలి’ అని అడిగే పరిస్థితి రాకూడదు. అందుకని, కొంత మొత్తాన్ని ఎఫ్‌డి (ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌) చేయాలనుకుంటున్నా.  

ఆడపిల్లలకు ముందు నుంచీ ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ మీద ఓ స్పష్టత ఉంటుంది. అందులోనూ కష్టపడి సంపాదిస్తున్నారంటే మరింత జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. మీరు నమ్ముతారో... లేదో? ఒక్కోసారి కరెంట్‌ బిల్లు ఈ నెల ఎంత వచ్చింది, గత నెల ఎంత వచ్చింది? అని చెక్‌ చేసుకుంటా!


కరోనా మిమ్మల్ని ఎలా మార్చింది?

ముందు చెప్పాను కదా... ‘పని మానేసి విశ్రాంతి తీసుకోవాలనిపించింది’ అని!   చాలా పెద్ద బ్రేక్‌ దేవుడే ఇచ్చాడనిపించింది. లాక్‌డౌన్‌ తర్వాత నేను ఇంట్లో ఖాళీగా కూర్చోలేనని అర్థమైంది. ఇప్పుడు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వరుసగా వారం పని చేస్తే ఒక రోజు విశ్రాంతి తీసుకునేలా చూసుకుంటున్నా. కుటుంబానికి ప్రాముఖ్యం ఇస్తూ, వాళ్లతో కొంత సమయం గడపడం ముఖ్యమని తెలిసింది. యుట్యూబ్‌లో ‘వుమెనియా’ షో నాఅంతట నేనే ప్రొడ్యూస్‌ చేశా. పొస్ట్‌ ప్రొడక్షన్‌, ఎడిటింగ్‌ పనులు దగ్గరుండి చూసుకున్నా. మనం అనుకుంటే చాలా చేయగలుగుతామని అర్థమైంది. 


- సత్య పులగం


Updated Date - 2020-11-22T05:36:00+05:30 IST