కోవిడ్‌ ఆస్పత్రిగా ‘శ్రీపద్మావతి’

ABN , First Publish Date - 2020-03-27T10:04:10+05:30 IST

స్విమ్స్‌కు అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి మహిళా వైద్యకళా ఆసుపత్రిని కోవిడ్‌-19 (కరోనా) ఆస్పత్రిగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కోవిడ్‌ ఆస్పత్రిగా ‘శ్రీపద్మావతి’

సందర్శించిన కలెక్టర్‌ భరత్‌గుప్తా 

మరిన్ని క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు  చేస్తామని వెల్లడి 


తిరుపతి (వైద్యం), మార్చి 26: స్విమ్స్‌కు అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి మహిళా వైద్యకళా ఆసుపత్రిని కోవిడ్‌-19 (కరోనా) ఆస్పత్రిగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు గురువారం స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ, వైద్యాధికారులతో కలిసి కలెక్టర్‌ భరత్‌ గుప్తా మహిళా వైద్యకళాశాల ఆస్పత్రిలోని ఐసొలేషన్‌ వార్డును పరిశీలించారు. ఆస్పత్రి భవనంలో గదులు, పడకలు, ఐసీయూ గదులు, సరిపడా వైద్యులు, సిబ్బంది ఉన్నారా అంటూ కలెక్టర్‌ ఆరా తీశారు. ప్రస్తుతం పద్మావతి మెడికల్‌ కళాశాలలో 750 పడకలు, 106 వెంటిలేషన్‌ గదులు ఉన్నట్టు గుర్తించారు. ముందస్తు వైద్య సేవల కోసమే కోవిడ్‌ ఆసుపత్రిగా పద్మావతిని ఎంపిక చేసిన ట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ పెంచలయ్య తెలిపారు. దీంతోపాటు రుయా కూడా కోవిడ్‌ ఆస్పత్రిగా ఉంటుందన్నారు.


సత్యసాయి సేవా సమితి జిల్లా నాయకులు వరప్రసాద్‌, కృష్ణవేణి, ఎస్‌బీఎన్‌ రావు ఆధ్వర్యంలో 2వేల మాస్కులును కలెక్టర్‌ చేతుల మీదుగా అందించారు. త్వరలో మరో 10వేల మాస్కులు ఇస్తామని వారు చెప్పారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో వైద్యాధికారులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. జిల్లాలో మరిన్ని క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటికి ప్రైవేటు ఆస్పత్రులనూ గుర్తించాలన్నారు. ఎంబీబీఎస్‌ డాక్టర్లు, ల్యాబ్‌ సిబ్బంది ఎంత మంది అవసరమో గుర్తించి నియమించుకోవాలన్నారు. శ్రీకాళహస్తి ఘటన నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వాళ్లను ఎలాంటి ఫంక్షన్లకు అనుమతివ్వకూడదని, అలాంటి వారిపై నిఘా ఉంచాలన్నారు.  ఈ సమావేశంలో స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంగమ్మ, ఆర్‌ఎంవో డాక్టర్‌ కోటిరెడ్డి, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ పెంచలయ్య, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ రవిరాజు,  ఆప్నా అధ్యక్షుడు డాక్టర్‌ బలరామరాజు, కార్యదర్శి డాక్టర్‌ పార్థసారథిరెడ్డి, ఆర్డీవో కనకనరసారెడ్డి ఉన్నారు. 

Updated Date - 2020-03-27T10:04:10+05:30 IST