Abn logo
Jul 24 2021 @ 00:47AM

ఆధ్యాత్మికాన్నీ ప్రక్షాళించాలి!

కంచి పరమాచార్య, శృంగేరి అభినవ విద్యాతీర్థులు, పెజావర్ విశ్వేశతీర్థుల ధర్మానుష్ఠానం, దైవోపాసనా శక్తికి వేలమంది జాతి, మత బేధం లేకుండా నమస్కరించారు. వీరు రాగ-ద్వేషాలకు, లౌకిక- రాజకీయ వ్యవహారాలకు, శారీరక- మానసిక లోభాలకు దూరంగా ఉండేవారు. వీరే సిద్ధయోగులు, అవతారపురుషులు. కానీ, నేటి గురువులు ‘శిష్యుడు ఎంత ఇవ్వగలడు? వేటిని సమకూర్చగలడు? ఏ విఐపిని తీసుకునిరాగలడు?’ అనే చూస్తున్నారు. ఇంకొకరికి పోటీగా ఎదగడమే లక్ష్యం తప్ప సనాతన ధర్మరక్షణ ఏ కోశాన కనిపించట్లేదు. సనాతన హిందూధర్మ పవిత్రతని కాపాడేవిధంగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు చర్యలు తీసుకోవాలి. 


ప్రపంచంలో గురువుని తప్ప ఎవరినీ నమ్మవద్దు అని సుప్రసిద్ధ హితోక్తి. అయితే, ఎల్లప్పుడూ విఐపిలు సందర్శిస్తే ఆయన నమ్మకమైన గురువా? పెద్దెత్తున కార్యక్రమాలు, యాగాలు చేస్తే జగద్గురువా? నిత్యం టీవీల్లో కనపడితే మహాస్వామియా? విదేశాలు తిరిగితే యోగులా? ఆభరణాలు సృష్టిస్తే అవతారపురుషుడా? పెద్దెత్తున కట్టడాలు కడితే పరమహంస పరివ్రాజకుడా? కోట్ల ధనం వసూలు చేస్తే సిద్ధులా? రాగద్వేషాలు కలవారు, లాబీయింగ్ చేసేవారు పీఠాధిపతులా? ఎవరు నిజమైన గురువు?


నేటి గురువులు ‘శిష్యుడు ఎంత ఇవ్వగలడు? వేటిని సమకూర్చగలడు? ఏ విఐపిని తీసుకునిరాగలడు?’ అనే చూస్తున్నారు. ఇంకొకరికి పోటీగా ఎదగడమే లక్ష్యం తప్ప సనాతన ధర్మరక్షణ ఏ కోశాన కనిపించట్లేదు. ఆశ్చర్యమేమంటే, వీరు తలబెట్టే కార్యక్రమాలు మాత్రం సంప్రదాయబద్ధంగానే ఉంటాయి. అయితే అవి జనాకర్షణ, ధనార్జన కోసమే. తమ ఆశ్రమవాసులను పవిత్రంగా ఉన్నతస్థితిలోకి తీసుకురాలేరు కాని లోకానికి ప్రవచనాలు చెప్తుంటారు. 


సనాతనధర్మాన్ని నిక్కచ్చిగా ఆచరించే గురువులు ఈ కర్మభూమిని దాటివెళ్ళక నిషేధం పాటిస్తారు. బ్రహ్మనిష్ఠుడై, బ్రహ్మచర్యం పాటిస్తూ పంచేంద్రియాలపై నియంత్రణ ఉండి, అరిషడ్వర్గాలని జయించి, నిజాయితీ, న్యాయబుద్ధి కలవారై ఉంటారు. ప్రతి ఏడాది చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారు. ఇవన్నీ పాటించలేని గురువులు వక్రభాష్యాలతో ప్రజలని నమ్మిస్తుంటారు. సనాతనధర్మంలోని పవిత్రమైన గురు-పరంపర వ్యవస్థపై ప్రజల అవగాహనలోపాన్ని ఆసరాగా తీసుకుని, మనసులో గందరగోళం సృష్టించి, భక్తికన్నా భయాన్ని పెంచి, ఆధ్యాత్మికం పేరుతో తమచుట్టూ తిప్పించుకుంటూ, మన సంపదని వారి పేరు-ప్రఖ్యాతులకి ఉపయోగించుకుంటున్నారు. ఉద్దండపండితులు, నిజాయితీగల అధికారులు ఈ రకం ఆశ్రమాలు సంపాదనకోసమే అన్నారంటే సామాన్యులు ఎంతటి మూర్ఖత్వంలో ఉన్నారో తెలుస్తోంది.


ఒకరిని గురువుగా స్వీకరించేముందు ప్రజలు చూడాల్సింది ఆ పీఠం గురు-పరంపర చరిత్ర తప్ప కట్టడాలు, వనాలు, భవనాలు కాదు. భగవద్గీత 4వ అధ్యాయం 1-3 శ్లోకాలలో శ్రీకృష్ణుడు అర్జునుడుకి, ముండకోపనిషత్తు 1వ అధ్యాయం 20వ శ్లోకం, స్కందపురాణం గురుగీత 62వ శ్లోకంలో ఈశ్వరుడు పార్వతికి గురు-పరంపర వైశిష్ట్యం వివరించారు. కృష్ణయజుర్వేదం తైత్తిరీయ ఉపనిషత్తులో, గురు-పరంపరలోని గురుశిష్య బం ధం, శిష్యుడు రాబోయే తరానికి ఎలా గురువు కాగలడనే విషయం ఉంది. మాతృదేవోభవ ఐనప్పటికీ తల్లిని పరమగురువుగా చేసి, ఏ వ్యక్తి గురుత్వం పొందలేడు.


సనాతనధర్మంలోని ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సంప్రదాయాలలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య కూడా తమ గురు -పరమగురువులను సేవించారు. త్రేతాయుగంలో శ్రీరాముడు వశిష్ట–విశ్వామిత్రులను, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సందీపనిమునిని, కలియుగంలో దత్తాత్రేయుడు ఈమధ్యే నరసింహసరస్వతిగా అవతరించినా కృష్ణసరస్వతి యతీశ్వరుల వద్ద శిష్యరికం చేశారు. అంతటి ప్రాముఖ్యమున్న గురుపరంపర, ప్రాశస్త్యం ఉన్న పీఠాల్లో కొనసాగుతూనే ఉంది. అందుకనే ఇచ్చటి పీఠాధిపతులు లోకోద్ధారకులు, ధర్మ రక్షకులుగా పూజ్యులు అవుతున్నారు.


తద్విరుద్ధంగా, గురు-పరంపర లేని ఆధునిక గురువులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. వీరికి ఆర్భాటాలే ప్రధానం. శారీరక పవిత్రత, ధర్మనిష్ఠ, ఆచారానికి విలువనిచ్చినట్లు కనబడతారు. గ్రంథాలలోని శ్లోకాలకు వ్యాఖ్యానం కూడా మరెవరో రాసిస్తే చదివి ప్రవచనంగా మరిపిస్తారు. సర్వహితం, విశ్వశాంతి అని బాహ్యంగా తపించే వీరు శతృసంహార యాగాలు, వశీకరణ -క్షుద్రపూజలు చేస్తూ ఆధ్యాత్మిక వ్యాపారం చేస్తుంటారు. ఒక పీఠంలో ఎయిడ్స్‌, అక్రమ సంబంధాలతో చనిపోయిన ఆశ్రమవాసులు ఉన్నారు. తప్పులను కప్పిపుచ్చడానికి, ప్రజల దృష్టిని మళ్ళించడానికే కలిగురువులు పెద్దెత్తున కార్యక్రమాలు చేస్తుంటారు. బాహ్యంగా పారాయణయజ్ఞాలు, జ్ఞానబోధలు లోపల కలెక్షన్ ఎంత, ఏ ప్రోగ్రామ్ పెడితే ఎంత ఆదాయం వస్తుంది, ఎవరిని ఆహ్వానించాలి... ఇవే చర్చలు. మరోవైపు ఈ స్వాములు ఊర్లు వెళ్ళినపుడల్లా అచట శిష్యులు అప్పోసప్పోచేసి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, వారి ఉద్యోగవిరమణ పిదప పిలిచి ‘నీ రిటైర్మెంట్ ఆదాయంలో నాకు ఎంత ఇస్తావు?’ అని అడుగుతున్నారు.


ఎంత దుర్మార్గం? జీవితాంతం కుటుంబబాధ్యతలు మోసి, కాయకష్టం చేసి సంపాదించిన సొమ్ముని ఈ అవలక్షణాల దూతలు నిర్దయగా స్వాహా చేస్తున్నారంటే ఎంత నీచం? ఇంకా, అపారమైన తెలివితో మాయమాటలు చెప్పి గిఫ్ట్ డీడ్‌లు రాయించుకుని గుడ్డిగా నమ్మిన శిష్యుల నుంచి ఆస్తులు కాజేసిన స్వామీజీలు మన మధ్యనే ఉన్నారు. శిష్యులను రాజకీయాల్లోకి దింపడం, రాజకీయవేత్తని ట్రస్టీగా నియమించడం, మరొక రాజకీయవేత్తకి ఆస్తుల రాబడులను చూసుకోవడానికి అప్పజెప్పడం చూస్తే ఆధ్యాత్మికాన్ని వ్యాపారపరం చేయడం కాక ఇంకేమిటి? వీరికి భగవంతుడి పేరు వ్యాపారం కోసమే. తమ తప్పులను కప్పిపుచ్చడానికి నిజాయితీగల అధికారులను సైతం పలుకుబడితో భయపెట్టడం వీరి దినచర్య. ఈ ఆశ్రమాలలో అవినీతి సొమ్ము కోట్లలో పొర్లిపారుతోందంటే అతిశయోక్తి కాదు. భక్తులిచ్చిన విరాళాలను భోగాలు, బినామీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్‌లకు మళ్ళిస్తున్నారు. అక్రమాలను నిరోధించి ధర్మాన్ని కాపాడమని వేడుకున్న భక్తులను, పోలీసులతో చేతులు కలిపి అక్రమకేసులు బనాయిస్తామని బెదిరించారంటే హిందూధర్మం ఎంతటి ప్రమాదంలో పడిందో ఆలోచించండి. నాతో ఒక కలిపీఠాధిపతి ‘జనం రెండు రోజులు రాళ్ళు వేస్తారు, తరువాత మర్చిపోతారు’ అన్న మాట విని షాక్ అయ్యాను.


ఇదీ, భక్తప్రజల మీద ఆయనకున్న అత్యంతనమ్మకం. ఇదే విషయం మహాభారతం శాంతి పర్వం 5.77లో చెప్పబడింది ‘తప్పుఒప్పులు తెలియనివాడు, అన్యాయపు జీవితాన్ని గడుపుతున్నవాడిని గురువైనా సరే విస్మరించాలి’ అని. ఒక గురువు, ఆయన కార్యదర్శి ఇండియాకి తిరిగివస్తూ అమెరికాలోని విమానాశ్రయంలో వేల డాలర్లతో పట్టుబడి, సంచలనం అవుతుందనే భయంతో అక్కడే వదిలేసి వచ్చారంటే ఎవరి కష్టార్జితం పోయినట్లు? మరొకదేశంలో రాసలీల వల్ల గొడవైతే కోట్ల రూపాయలు సెటిల్‌మెంట్ చేశారంటే, ఎవరి సొమ్ము పోయినట్లు? స్త్రీలతో అక్రమ సంబంధాలు ఆధ్యాత్మికమా? భూదస్తావేజులు తాకట్టు ఉంచుకుని ఆధ్యాత్మిక ముసుగులో వ్యాపారం చేయడం ఏమిటి? భక్తుల డబ్బుతో భవనాలు కట్టి వాణిజ్యానికి ఉపయోగించడం వ్యాపారం కాదా? గురువు కీలుబొమ్మ కావడమో, ఒకరి పీక మరొకరి చేతుల్లో ఉండడమో కలిపీఠాల వ్యవస్థ.


దొంగస్వామీజీల వలన అమానవీయ కోణాలు ఆధ్యాత్మిక రంగంలో సంభవిస్తున్నాయి. వీరి వలన కుటుంబ వ్యవస్థ దెబ్బతిని, ఆప్యాయతలు దూరమై జీవితాలు నాశనమౌతున్నాయి. హిందూధర్మానికి ఈ పరిణామాలన్నీ మహాకళంకం. ఇదే నేటి పంచాంగాలలో కూడ హెచ్చరించబడుతోంది. పక్కా ప్రణాళికతో స్వార్థపరులతో చేతులు కలిపి దేశ ప్రధాని, రాష్ట్రపతి, న్యాయమూర్తులనే మూర్ఖులను చేస్తున్నారు. ప్రధానమంత్రి సందర్శిస్తే అక్కడ వ్యవహారాల మీద విచారించడానికి ఏ అధికారికీ ధైర్యముండదని వ్యూహరచన చేయడం దుర్మార్గం కాదా? ఇది ఏ గురు-పరంపర నుంచి సంక్రమించిన ఆధ్యాత్మికం?


కంచి పరమాచార్య, శృంగేరి అభినవ విద్యాతీర్థులు, పెజావర్ విశ్వేశతీర్థుల ధర్మానుష్ఠానం, దైవోపాసనా శక్తికి వేలమంది జాతి, మత, కుల, సిద్ధాంత బేధం లేకుండా నమస్కరించారు. వీరు రాగ-ద్వేషాలకు, లౌకిక- రాజకీయ వ్యవహారాలకు, శారీరక-, మానసిక లోభాలకు, అసూయ, శతృత్వం, ద్వంద భావాలకి దూరంగా ఉండేవారు. వీరే సిద్ధయోగులు, అవతారపురుషులు. అంటే, గురువు తన గురు-పరంపర నుంచి సంక్రమించిన తత్వజ్ఞానాన్ని, శాస్త్రబోధల్ని శిష్యులకి ఉపదేశించి, మంచి ఆలోచనా ధోరణి, ధర్మాచరణ, న్యాయం, దయాభావం కలిగిన గొప్పవ్యక్తిగా తయారుచేయగలగాలి. ముండకోపనిషత్ 1.2.12లో చెప్పినట్లు గురువు శ్రోత్రీయుడే కాకుండా, నిక్కచ్చిగా (శృతి) అనుసరించి బ్రహ్మనిష్ఠుడై బ్రహ్మచర్యం పాటిస్తూ జీవించాలి.


ప్రపంచం చుట్టూ వీరు తిరుగరు, ప్రపంచమే వీరి చెంతకు వస్తుంది. వీరే జగద్గురువులు. అందుకనే ధర్మచింతన కలిగిన భక్తి, వేదశాస్త్రాలు ఆచార సంస్కారాల మీద శ్రద్ధ, ఆధ్యాత్మిక పరిపక్వత కోసం పరితపించే జనులు ఏరికోరి వీరిని ఆశ్రయిస్తారు. భగవద్గీత 4.34లో శ్రీకృష్ణుడు ఉపదేశించినట్లు, పరులకు జ్ఞానబోధ చేసేవాడు సనాతన గురు-పరంపరలోని గురువు నుంచి మాత్రమే విద్యనభ్యసించి, తద్వారా ఆర్జించిన జ్ఞానం కలిగిఉండాలి. అలా కాకుంటే అతను గురువూ కాదు, అతని మాటలను జ్ఞానం అనలేం. దీన్నిబట్టి చూస్తే గురువుని విశ్వసనీయుడిగా నిర్థారించడానికి గురు-పరంపర ఎంతటి ప్రాముఖ్యతని సంతరించుకున్నదో తెలుస్తుంది. మరో ప్రక్క, గృహస్థులుగా ఉంటూ బ్రహ్మనిష్ఠతో స్వలాభాపేక్ష లేకుండా సమాజ హితంకోసం సనాతనధర్మాన్ని ప్రచారం చేసేవారు బ్రహ్మశ్రీలు. మరి వ్యాపారులెవరు, ఆచార్యులెవరో ప్రజలే బేరీజువేసుకోవాలి.


ఆధ్యాత్మికంలోనూ ప్రక్షాళన అవసరం. సనాతన హిందూధర్మ పవిత్రతని కాపాడేవిధంగా అధికారులు, ప్రభుత్వాలు, న్యాయస్థానాలు చర్యలు తీసుకోవాలి. భగవాన్ శ్రీరాముడికి ప్రతిష్ఠాత్మకంగా అయోధ్యలో మందిరం నిర్మిస్తే సరిపోదు, ఆయన మార్గదర్శనం చేసిన ధర్మవిధానాలు అమలుచేయాలి. అప్పుడే శ్రీరాముడు అయోధ్యలో కొలువై ఈ కలియుగంలో కూడా రామరాజ్యాన్ని అనుగ్రహిస్తాడు.


శ్రీరామపాద భాగవతార్‌

(నేడు గురుపౌర్ణమి)