సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఘనంగా సంగీత విభావరి

ABN , First Publish Date - 2021-04-19T16:29:42+05:30 IST

సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఆన్‌లైన్ వేదికగా వేదికగా జరిగిన సంప్రదాయ సంగీత విభావరికి అద్భుతమైన స్పందన లభించింది. ఆన్‌లైన్ ద్వారా వేల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. న్యూజెర్సీ, ఎడిస

సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఘనంగా సంగీత విభావరి

సౌత్ ప్లైన్ఫీల్డ్: సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఆన్‌లైన్ వేదికగా వేదికగా జరిగిన సంప్రదాయ సంగీత విభావరికి అద్భుతమైన స్పందన లభించింది. ఆన్‌లైన్ ద్వారా వేల మంది  ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. న్యూజెర్సీ, ఎడిసన్లో సాయి దత్త పీఠం.. శ్రీ శివ విష్ణు ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవానికి సన్నాహకంగా సాయి దత్త పీఠం.. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆరెంజ్ మీడియా కాన్సెప్ట్ సహకారంతో ఆన్‌లైన్ ద్వారా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో సంప్రదాయ సంగీత కళాకారులంతా తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యంగా వీక్షకులు భక్తి సంగీతంలోమునిగితేలారు. పలు భాషలలో, అనేక భక్తి గీతాలతో వీక్షకులను అలౌకిక ప్రపంచంలోకి తీసుకెళ్లారు.


ప్రఖ్యాత వీణా విద్వాంసుడు ఫణి నారాయణ, తన వాద్య సహకార బృందంతో 2 గంటల పాటు సంగీతఝరిలో ఓలలాడించారు. ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, గురు స్వాతి అట్లూరి ప్రదర్శించిన భక్తి రసమయ నృత్య కార్యక్రమం, దివ్య ఏలూరి తన శిష్య బృందంతో గతంలో చేసిన నృత్య మెడ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒడిస్సీ నృత్య కళాకారిణి బిడిష మహంతిచే మోక్ష నృత్య ప్రదర్శన, జయీత దత్త ప్రదర్శించిన కథక్ నృత్య ప్రదర్శనతోపాటు కళాకారుల సంగీత కార్యక్రమాలు, ప్రముఖ సంగీత గురు రామాచారి బృంద గాన కచేరీ, వీణా, ఫ్లూట్, సితార్‌లతో కూడా కళాకారులు అందరినీ అలరింపచేశారు. హైదరాబాద్ నుండి ప్రముఖ గాయకులు హరి గుంట, ప్రవీణ్ కొప్పోలు పద్యాలు, వైజాగ్ శ్రీ మాత స్టూడియోస్ నుంచి వెంపలి అఖిల, లత మూల తదితరుల సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో పాటు మీగడ రామలింగస్వామి గారు చేసిన 139 వ సంగీతనవావధానం ఆకట్టుకుంది.


ప్రముఖ కవి, సంగీత విద్వాంసుడు కిభశ్రీ ఆధ్వర్యంలో మిత్ర ప్రాశ్నిక బృందంతో ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో అద్భుతంగా నిర్వహించినందుకు ఆరెంజ్ మూన్ కాన్సెప్ట్ అధినేత అశోక్ బడ్డి, మరియు సాంకేతిక బృందానికి సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చివరిగా.. సాయి దత్త పీఠం నుండి లైవ్‌లో  పాల్గొని తమ పాటలతో అలరించిన ప్రసాద్ సింహాద్రి, అదితి భావరాజులను రఘుశర్మ, ఉపేంద్రలు సత్కరించారు. మే 2 నుంచి 8 వరకు శ్రీ శివ, విష్ణు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని.. వాటిని కూడా దిగ్విజయం చేయాలని రఘు శర్మ శంకరమంచి భక్తులను కోరారు. శ్రీ శివ, విష్ణు ఆలయంలో ప్రత్యేక విశిష్టతలన్నింటిని ఆయన వివరించారు.


న్యూజెర్సీలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు శ్రీ శివ, విష్ణు ఆలయాన్ని సకల దేవతల సమాహారంగా తీర్చిదిద్దినట్టు రఘు శంకరమంచి తెలిపారు. న్యూజెర్సీలోని భక్తులంతా ఈ ఆలయ ప్రారంభోత్సవానికి తరలిరావాలని, న్యూజెర్సీ పబ్లిక్ యూటిలిటీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కోరారు. అంతేకాకుండా సంగీత విభావరిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన సాయి దత్త పీఠం సభ్యులను కొనియాడారు. ఇదే స్ఫూర్తితో మే 2 నుంచి 8 వరకు జరిగే ఆలయ ప్రారంభోత్సావాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. 




Updated Date - 2021-04-19T16:29:42+05:30 IST