Jul 30 2021 @ 22:43PM

సోడాల శ్రీదేవి

‘‘శ్రీదేవి... సోడాల శ్రీదేవి ఇక్కడ’’ అంటున్నారు ఆనందిని. అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయి తాట తీస్తున్నారు కూడా! సోడాల శ్రీదేవి పాత్రలో ఈ తెలుగమ్మాయి నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. సుధీర్‌బాబుకు జంటగా ఆమె కనిపించనున్నారు. సినిమాలో ఆనందిని ప్రచార చిత్రాల్ని శుక్రవారం విడుదల చేశారు. టీజర్‌లో పల్లెటూరి అమ్మాయిగా, సోడాలు అమ్మే యువతిగా సంప్రదాయ దుస్తుల్లో ఆమె సందడి చేశారు. సోడా తాగడానికి వచ్చి తనకు లైన్‌ వేస్తున్న సుధీర్‌బాబుతో ‘గోళీ గొంతులోకి దిగుద్ది. జాగ్రత్త’ అని ఆనందిని చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ‘‘ఇప్పటి వరకూ విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని నిర్మాతలు విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి చెప్పారు. ‘పలాస’ ఫేమ్‌ కరుణకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు.