Advertisement
Advertisement
Abn logo
Advertisement

పల్లె పెద్ద కుటుంబమైంది...!

ముత్యాల మేలి ముసుగేసుకుని ప్రకృతి అందంగా ముస్తాబైంది

శీతాకాలం చలి గాలులతో చక్కిలి గింతలు పెడుతోంది

పుష్యమాసం పుష్పమాసమై పరిమళంతో విరాజిల్లుతోంది

హాలికుల ఆలయాన పౌష్యలక్ష్మి కొలువైంది

పల్లెలోని ప్రతి ఇల్లు ధాన్యరాశులకు నెలవైంది

శ్రమైకజీవుల కళ్ళల్లో ఆనంద కాంతి సంకురాత్రి సంబురమైంది

బసవన్న కాలి అందెల సవ్వడి శుభమస్తు అన్న దీవెననిచ్చింది

బుడబుక్కలవాని మాట జంగందేవర ఢమరుక డబుడక్కల నాదం 

హరిదాసు కీర్తన జానపద కళకి సంస్కృతికి పల్లె పట్టం కట్టింది

పిండివెన్నెల తివాచీపై గుమ్మడి పువ్వు కీరిటంతో గొబ్బెమ కూర్చుంది

భోగిమంట నులివెచ్చని వేడిని ఒంటికి పులుముకోమంది

కాగితపు పిట్ట అంబరాన్ని అందుకోవాలని తహతహలాడింది

తరతమ బేధాలను మరచి పల్లె పెద్ద కుటుంబమైంది

భోగిపళ్ళు బొమ్మల కొలువులు పడుచుపిల్లల పరిహాసపు పరవళ్ళతో

తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి సందడి.– శ్రీధర్ వాడవల్లి

Advertisement
Advertisement