మరో 9 మంది..జిల్లాలో 144కు చేరిన కరోనా మృతులు

ABN , First Publish Date - 2020-08-13T10:25:39+05:30 IST

జిల్లాలో గడచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మరో తొమ్మిది మంది కరోనాతో మృతిచెందారు. దీంతో కొవిడ్‌ మృతుల సంఖ్య బుధవారం నాటికి 144కు చేరుకుంది. జిల్లాలో ఇప్పటివరకు 2,08,431 మంది నుంచి నమూనాలు

మరో 9 మంది..జిల్లాలో 144కు చేరిన కరోనా మృతులు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 12 : జిల్లాలో గడచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మరో తొమ్మిది మంది కరోనాతో మృతిచెందారు. దీంతో కొవిడ్‌ మృతుల సంఖ్య బుధవారం నాటికి 144కు చేరుకుంది. జిల్లాలో ఇప్పటివరకు 2,08,431 మంది నుంచి నమూనాలు సేకరించారు. బుధవారం  511 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 12,456కు చేరింది. ఇంకా వేలల్లో ‘కరోనా’ ఫలితాలు వెల్లడి కావాల్సిఉంది. పరిస్థితి తీవ్రంగా ఉండి, దగ్గు, జ్వరం, ఆయాసం ఉన్నవాళ్లకు ర్యాపిడ్‌ కిట్లతో పరీక్షిస్తున్నారు.


ఇందులో పాజిటివ్‌ వచ్చిన వారి పరిస్థితి బట్టి కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, కొవిడ్‌ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ర్యాపిడ్‌ టెస్టుల్లో నెగిటివ్‌ వచ్చినంత మాత్రాన కరోనా లేదని విడిచిపెట్టడంలేదు. వారికి వీఎల్‌ఎం లేదా వీటీఎం పరీక్షలను నిర్వహిస్తున్నారు. వీటి ఫలితాలు రోజుల తరబడి ఆలస్యమవుతున్నాయి. దీంతో ప్రజలు మానసికంగా ఆందోళన చెందుతున్నారు. కరోనా లక్షణాలు తీవ్రంగా లేనివారు హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. ఇలా 2,664 మంది ఇళ్ల వద్దనే చికిత్స తీసుకుంటున్నారు. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నా, కేసుల ఉధృతి పెరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.  


ఎవరూ మరణించకూడదు

గుజరాతీపేట: కొవిడ్‌ లక్షణాలతో ఏ వ్యక్తి కూడా మరణించకూడదని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.చెంచయ్య పేర్కొన్నారు. నూతనంగా  ఎంపికైన ఎమర్జెన్సీ మోటారు ట్రాన్స్‌పోర్టు(ఈఎంటీ)లకు డీఎంహెచ్‌వో కార్యాలయంలో బుధవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ‘జిల్లాలోని ప్రతి మండలానికి ఒక వాహనాన్ని కేటాయించాం.ఈవాహనంలో ఈఎంటీలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా సామాజిక వ్యాప్తి చాలా వేగంగా ఉంది. కరోనా లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి..


ఈ వాహనం ద్వారా కొవిడ్‌ ఆస్పత్రులకు తరలించాలి’ అని సూచించారు. ఇలా చేస్తే కొవిడ్‌ మరణాలు నివారించవచ్చని తెలిపారు. ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ బగాది జగన్నాథరావు మాట్లాడుతూ, ఈఎంటీలు మండలాల్లోని టీం సభ్యులను సమన్వయం చేసుకొని విధులు నిర్వహించాలని తెలిపారు. కొవిడ్‌ బాధితులను గుర్తించే సమయంలో ఈఎంటీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-08-13T10:25:39+05:30 IST