సిరి సంబరం.. కొద్ది మంది భక్తుల నడుమ ఊరేగింపు

ABN , First Publish Date - 2020-10-28T18:24:11+05:30 IST

పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం ఈ ఏడాది వినూత్నంగా సాగింది. అశేష జనవాహిని లేకపోయినప్పటికీ భక్తిప్రపత్తులతో.. సంప్రదాయబద్ధంగా..

సిరి సంబరం.. కొద్ది మంది భక్తుల నడుమ ఊరేగింపు

టీవీలు... ప్రత్యేక  తెరలపై వీక్షణ


(విజయనగరం): పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం ఈ ఏడాది వినూత్నంగా సాగింది. అశేష జనవాహిని లేకపోయినప్పటికీ భక్తిప్రపత్తులతో.. సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కరోనా నిబంధనలతో భక్తులంతా ఇళ్లలో నుంచి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఉత్సవ నిర్వాహకులు, అధికారులు, బందోబస్తు సిబ్బంది, కొద్దిమంది భక్తుల నడుమ జై పైడిమాంబ నామస్మరణల నడుమ మంగళవారం మధ్యాహ్నం 3.21 గంటలకు సిరిమాను కదిలింది. అమ్మవారి చదురుగుడి నుంచి సిరిమాను ఊరేగింపు ప్రారంభమైంది. ఈ ఏడాది కరోనా నిబం ధనల నేపథ్యంలో భక్తుల సందడి తగ్గింది. సిరిమానుకు ముందు అమ్మవారి పరివారంగా చెప్పుకునే పాలధార, బెస్తవారి వల, అంజలి రథం, మాలధారణ చేసిన భక్తులు నడిచారు. సిరిమానును అధిరోహించిన బంటుపల్లి వెంకటరమణ ఊరేగింపు ఆసాంతం అక్షింతలు వేస్తూ భక్తులను ఆశీర్వదించారు.


సిరిమాను వెళ్తున్నప్పుడు ప్రజలు జై పైడిమాంబ అంటూ నినదిస్తూ.. అరటిపండ్లను విసురుతూ.. భక్తిప్రపత్తులను చాటుకున్నారు. దాదాపు రెండు గంట ల పాటు సిరిమాను మూడు పర్యాయాలు కోట శక్తికి నమస్కరించి తిరిగి వచ్చింది. నడిచే దేవతగా పేరొందిన పైడిమాంబ సిరిమానోత్సవం ఏటా ఘనంగా జరుగుతుంది. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో  జిల్లా అధికార యంత్రాంగం ఆంక్షలు విధించింది. దీంతో భక్తులు తక్కువగా కనిపించారు.  నగరంలోని 17 ప్రాంతాల్లో ప్రత్యేక ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌, ఆర్‌అండ్‌బీ, ఎత్తుబ్రిడ్జి, ఆర్టీసీ కాంప్లెక్స్‌, కోట, అంబేడ్కర్‌ కూడలి, హుకుంపేట, తెలకలవీధి, కొత్తపేట జంక్షన్‌, పూల్‌బాగ్‌ కాలనీ, కాటవీధి పార్కు తదితర ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్ర్కీన్‌ల ద్వారా భక్తులు సిరిమానోత్సవాన్ని వీక్షించా రు.ఉత్సవం ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అమ్మవారిని స్పీకర్‌ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. 


Updated Date - 2020-10-28T18:24:11+05:30 IST