బకాయిదారులకు షాక్!

ABN , First Publish Date - 2020-10-28T18:28:18+05:30 IST

బిల్లు బకాయిదారులకు షాక్‌ ఇచ్చేందుకు విద్యుత్‌ శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే భారీగా బకాయిలు పేరుకుపోతున్నాయి. వినియోగదారులు సకాలంలో..

బకాయిదారులకు షాక్!

కఠిన చర్యలకు సిద్ధమవుతున్న విద్యుత్‌ శాఖ 

జిల్లా వ్యాప్తంగా రూ.182 కోట్ల బకాయిలు

ఆస్తుల జప్తు దిశగా అడుగులు

ఆర్‌ఆర్‌ చట్టం ప్రయోగానికి సన్నద్ధం


(ఇచ్ఛాపురం రూరల్‌): బిల్లు బకాయిదారులకు షాక్‌ ఇచ్చేందుకు విద్యుత్‌ శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే భారీగా బకాయిలు పేరుకుపోతున్నాయి. వినియోగదారులు సకాలంలో చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని అధికారులు సూచిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. మొండి బకాయిదారులకు నోటీసులిస్తున్నా స్పందించడం లేదు. దీంతో అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. బకాయిదారుల ఆస్తుల జప్తు దిశగా అడుగులేస్తున్నారు. ఆర్‌ఆర్‌ చట్టాన్ని ప్రయోగించడానికి సన్నద్ధమవుతున్నారు. 


నెలల తరబడి విద్యుత్‌ బిల్లులు చెల్లించని వారిపై అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.182 కోట్ల బకాయిలు ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటి వసూలుపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. జిల్లాలో గృహ, వాణిజ్య పరిశ్రమలు, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 8 లక్షల వరకూ ఉన్నాయి.  రూ.182 కోట్లు బకాయిలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. హెచ్‌టీ కనెక్షన్లకు సంబంధించి రూ.6.97 కోట్లు, ఎల్‌టీ కనెక్షన్లు నుంచి రూ. 6.21 కోట్లు, స్థానిక సంస్థల నుంచి రూ.98 కోట్లు బకాయిలున్నాయి. ఆమదాలవలస మునిసిపాల్టీ నుంచి అత్యధికంగా రూ.1.20 లక్షలు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. వీటిని వసూలు చేయడానికి దిగువస్థాయి సిబ్బంది నుంచి అధికారులు ప్రయత్నిస్తున్నారు. 


ఆ రెండు రంగాలు కీలకం 

ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచి భారీగా వసూలు కావాల్సి ఉంది. గతంలో ప్రభుత్వం నుంచే స్థానిక సంస్థల బకాయిలు చెల్లింపులు జరిగేవి. గత కొద్దిరోజులుగా ప్రభుత్వాలు వివిధ పద్దులు కింద స్థానిక సంస్థలకు నిధులు జమ చేస్తున్నాయి. పంచాయతీలే నేరుగా బిల్లులు చెల్లిస్తున్నాయి. నిధులు లేవన్న సాకుచూపి బిల్లులు చెల్లించడం లేదు.  దీంతో విద్యుత్‌ సంస్థకు పెనుభారంగా మారుతోంది. కరోనా వల్ల గత కొన్ని నెలలుగా ఆటుపోట్లు తలెత్తుతున్నాయి. ఒక నెలలో విద్యుత్‌ బిల్లులు తీయలేకపోయారు. తరువాత నెలలో రెండు బిల్లులు తీసి ఇచ్చారు. బకాయిలు పెరగడానికి కరోనా కూడా ఒక కారణంగా అంచనా వేస్తున్నారు.  పరిశ్రమలు చాలా వరకూ మూతపడటంతో బకాయిలు భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్‌ఆర్‌ చట్టాన్ని ప్రయోగిస్తున్నందున బకాయిదారులు చెల్లింపులకు ముందుకు వచ్చే వీలుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


బకాయిలు చెల్లించాల్సిందే 

వినియోగదారులు బకాయిలు చెల్లించాలి. మొండి బకాయిల వసూ లుపై దృష్టి పెట్టాం. బిల్లులు చెల్లించని వారికి ఇప్పటికే నోటీసులిచ్చాం. వారు స్పందించకుంటే రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగిస్తాం. 

-ఎన్‌.రమేష్‌, ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్‌, శ్రీకాకుళం 

Updated Date - 2020-10-28T18:28:18+05:30 IST