Srilankaకు సాయం చేసేందుకు కేంద్రం Green signal

ABN , First Publish Date - 2022-05-03T14:56:35+05:30 IST

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. లంకకు సాయం చేయడంపై తమకెలాంటి అభ్యంతరం లేదంటూ

Srilankaకు సాయం చేసేందుకు కేంద్రం Green signal

                                - స్టాలిన్‌ ధన్యవాదాలు 

   

చెన్నై: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. లంకకు సాయం చేయడంపై తమకెలాంటి అభ్యంతరం లేదంటూ కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేఖ రాశారు. లంకకు సాయం చేసేందుకు కేంద్రం అనుమతివ్వాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ వినతిని పరిశీలించిన విదేశాంగశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో శ్రీలంకకు సహాయాలు పంపిణీ విషయమై సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఉన్నతాధికారులతో చర్చించారు. శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశంలో శ్రీలంకకు బియ్యం, మందులు, పాలపొడి అందించేందుకు కేంద్రం అనుమతి కోరుతూ ముఖ్యమంత్రి ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలు ఆమోదించాయి. శ్రీలంకలోని రాయబార కార్యాలయం ద్వారా శ్రీలంకకు రూ.123 కోట్ల విలువైన సహాయాలు అందించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ స్టాలిన్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, దానితో పాటు శాసనసభలో ఆమోదించిన తీర్మాన నకలును కూడా జతచేసి పంపారు. 


కేంద్ర మంత్రి లేఖ...

ఈ నేపథ్యంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ సహాకారంతో శ్రీలంకకు సహాయాలు అందించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ లేఖ రాశారు. పొరుగు దేశంలోని ప్రజల కష్టాలను గమనించి మానవతా దృక్పథం తో వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విషయంలో సమన్వయకర్తగా వ్యవహరించవచ్చని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. సోమవారం ఈ సహాయాలను ఎంత త్వరగా పంపాలన్న విషయమై ఉన్నతాధికారులతో సమావేశమై స్టాలిన్‌ చర్చించారు. ఇదిలా వుండగా లంకకు సాయంపై కేంద్రమంత్రి జైశంకర్‌ స్పందన పట్ల సీఎం ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు. 

Read more