Sri Lanka: మళ్లీ భారీ స్కోరు.. వికెట్ల వేటలో బౌలర్ల పోటీ

ABN , First Publish Date - 2021-07-21T00:33:50+05:30 IST

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక మరోమారు భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో

Sri Lanka: మళ్లీ భారీ స్కోరు.. వికెట్ల వేటలో బౌలర్ల పోటీ

కొలంబో: భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక మరోమారు భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసి భారత్ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక మరోమారు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (50), మినోద్ భనుక (36) శుభారంభాన్ని ఇచ్చారు. క్రీజులో పాతుకుపోయి పరుగులు పేర్చుకుంటూ వెళ్తున్న వేళ యుజ్వేంద్ర చాహల్ వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. 14వ ఓవర్ రెండో బంతికి మినోద్‌ను పెవిలియన్ పంపిన చాహల్.. ఆ తర్వాతి బంతికే భునుక రాజపక్స (0)ను ఔట్ చేశాడు. 


ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధనంజయ డి సిల్వా మరో వికెట్ పడకుండా బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో ఓపెనర్ అవిష్క అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే భువనేశ్వర్ కుమార్‌కు చిక్కి వెనక్కి వెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికే డి సిల్వా (32) కూడా అవుటవడంతో ఇన్నింగ్స్ భారత బౌలర్లు ఒత్తిడి పెంచారు. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన చరిత్ అసలంక భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 68 బంతులు ఎదుర్కొన్న అసలంక 6 ఫోర్లతో 65 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగులో అవుటయ్యాడు. 16 పరుగులు మాత్రమే చేసిన కెప్టెన్ దాసన్ షనక..  చాహల్ బౌలింగులో బౌల్డ్ కాగా, హసరంగ (8) చాహర్ బౌల్డ్ చేశాడు. చమిక కరుణరత్నె 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. 


భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్ రెండు వికెట్లు తీసుకున్నాడు. 

Updated Date - 2021-07-21T00:33:50+05:30 IST