భారత్‌కు శ్రీలంక విమాన సేవలు పునఃప్రారంభం

ABN , First Publish Date - 2021-08-29T01:11:24+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విధించిన ఆంక్షల

భారత్‌కు శ్రీలంక విమాన సేవలు పునఃప్రారంభం

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విధించిన ఆంక్షల సడలింపు తర్వాత శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ భారత దేశానికి వైమానిక సేవలను పునరుద్ధరిస్తోంది. న్యూఢిల్లీలోని శ్రీలంక హైకమిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం భారత దేశంలోని వివిధ నగరాలకు శ్రీలంక విమాన సేవలను పునరుద్ధరిస్తున్నారు. ముంబై, బెంగళూరు, మధురై, తిరుచిరాపల్లి, త్రివేండ్రం, కొచ్చిన్ నగరాలకు వీక్లీ ఫ్లైట్స్‌ను నడుపుతారు. కొలంబో-న్యూఢిల్లీ, కొలంబో-హైదరాబాద్ వైమానిక సేవలను కూడా పునరుద్ధరిస్తున్నారు. 


చెన్నైకి నాలుగు, ముంబైకి మూడు, బెంగళూరుకు ఒకటి చొప్పున వీక్లీ ఫ్లైట్స్‌ను నడుపుతారు. హైదరాబాద్, న్యూఢిల్లీ నుంచి కొలంబో వెళ్ళే విమానాలు వారానికి రెండు చొప్పున అందుబాటులో ఉంటాయి. చెన్నై, ముంబైల నుంచి వారానికి ఐదు విమానాలకు పెంచే అవకాశం ఉంది. అదేవిధంగా బెంగళూరు-కొలంబో విమాన సేవలు వారానికి మూడుసార్లకు పెరగవచ్చు. 


ప్రయాణికులను ఆకర్షించేందుకు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ‘ఒకటి కొనండి-మరొకదానిని ఉచితంగా పొందండి’ అనే పథకాన్ని ప్రారంబించింది. సడలించిన మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయని శ్రీలంక టూరిజం అధికారి కిమర్లి ఫెర్నాండో చెప్పారు. ప్రయాణికులు, ట్రావెల్ ఏజెంట్లు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్‌ను సందర్శించి, మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చునని తెలిపారు. 


కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిగా చేయించుకున్న ప్రయాణికులు ప్రయాణ సమయానికి 72 గంటల ముందుగా చేయించిన కోవిడ్-19 పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టును సమర్పించాలని శ్రీలంక హై కమిషన్ ప్రకటనలో తెలిపారు. 


Updated Date - 2021-08-29T01:11:24+05:30 IST