వైభవంగా శ్రీనివాస కల్యాణం

ABN , First Publish Date - 2022-01-18T05:08:51+05:30 IST

మల్దకల్‌ మండల కేంద్రం లోని స్వయంభువు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

వైభవంగా శ్రీనివాస కల్యాణం
బీచుపల్లి కోదండరామాలయంలో సీతారాముల కల్యాణం

- స్వామివారికి ప్రత్యేక పూజలు  

- బీచుపల్లిలో సీతారాముల కల్యాణం 

- ఆలయాల్లో ప్రత్యేక పూజలు 

మల్దకల్‌/ ఇటిక్యాల/ అలంపూర్‌/ అయిజ/ గద్వాల, జనవరి 17 : మల్దకల్‌ మండల కేంద్రంలోని స్వయంభువు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం శ్రీనివాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచామృతా భిషేకం, అర్చన చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడిని కళ్యాణ మండపంలో ఆశీనులను చేసి, ఆగమశాస్త్ర పద్ధతిలో కల్యాణం నిర్వహించారు. వేద పండితులు మధుసూధనాచార్యులు, రమేశాచార్యులు, ధీరేంద్రదాసులు, రవిఆచార్యులు, నాగరాజుశర్మల ఆధ్వర్యంలో వేడుక కొన సాగింది. హైదరాబాద్‌కు చెందిన వేణుగోపాల్‌, గద్వాల పట్టణానికి చెందిన మధుగౌడు, కర్నూలు పట్టణానికి చెందిన  శ్రీకాంత్‌ దంపతులు కల్యాణా నికి సహకరించారు. కల్యాణ వేడుకకు సహకరించిన భక్తులను చైర్మన్‌ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి స్వామివారి శేషవస్త్రంతో సన్మానించారు. 


- ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామాలయంలో సోమవారం సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. అర్చకులు దినకరాచారి, భువనచంద్రాచారిల శిష్య బృందం ఆధ్వర్యం లో వేడుకను నిర్వహించారు. ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వ హించినట్లు మేనేజర్‌ సురేంద్రరాజు తెలిపారు. 


- అయిజ మండలం ఉత్తనూర్‌ గ్రామంలో ధన్వంతరి వేంకటేశ్వరస్వామి కల్యాణం కనుల పండువగా జరిగింది. ప్రతీ నెల పౌర్ణమి రోజున స్వామి వారి కల్యాణం నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా వేంకటేశ్వరస్వామి రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు.


జములమ్మ ఆలయంలో పౌర్ణమి వేడుకలు

నడిగడ్డ ప్రజల ఇలవేల్పు జములమ్మ ఆలయం లో సోమవారం పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ కుర్వ సతీష్‌కుమార్‌తో పాటు అన్నదానం దాత కొండపల్లి రమేష్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తి అమ్మవారిని పల్లకిలో చేర్చి బాజా భజంత్రీలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు.  సందర్భంగా అన్నదాత కొండపల్లి రమేష్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఈవో వీరేశం, ఆలయ కమిటీ డైరెక్టర్లు మేడికొండ జానకిరాములు, మాధవి కాంమ్లే, విజయ్‌కుమార్‌, కమ్మరి రాము, శంకర్‌ పాల్గొన్నారు. 


భక్తి శ్రద్ధలతో నందికోల సేవ

పౌర్ణమి సందర్భంగా అలంపూరు బాలబ్రహ్మే శ్వర స్వామి ఆలయంలో కర్నూలు పట్టణం, బుధ వారపేటకు చెందిన భక్తులు సోమవారం ప్రత్యేక నందికోలసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.



Updated Date - 2022-01-18T05:08:51+05:30 IST